Rice: అగ్రరాజ్యంలో భారతీయులకు బియ్యం కష్టాలు.. స్టోర్ల ముందు నో స్టాక్ బోర్డులు.. గల్ఫ్ దేశాల్లోనూ భారీగా పెరిగిన ధరలు
ABN , First Publish Date - 2023-07-23T07:46:07+05:30 IST
తెలుగువాడి బలహీనత వరి అన్నం. చాలామందికి బయట ఏం తిని వచ్చినా ఒక ముద్ద అన్నం తినకపోతే భోజనం పూర్తయినట్లు కాదు.
అమెరికాలో మనోళ్లకు బియ్యం భయం!
భారత్ ఎగుమతి నిషేధంతో ప్రపంచమంతా కొరత
ముప్పును ముందే పసిగట్టిన అమెరికన్ భారతీయులు
ఆఫీసులకు సెలవు పెట్టి మరీ బియ్యం మూటల కొనుగోలు
శుక్రవారం అమెరికా అంతటా స్టోర్ల ముందు బారెడు క్యూ
ఒక్కరోజులోనే నిల్వలు ఖాళీ.. ఉప్పుడు బియ్యమూ ఖతం
నిషేధంతో 15 నుంచి 50 డాలర్ల మేరకు పెరిగిన ధర
హైదరాబాద్, జూలై 22(ఆంధ్రజ్యోతి): తెలుగువాడి బలహీనత వరి అన్నం. చాలామందికి బయట ఏం తిని వచ్చినా ఒక ముద్ద అన్నం తినకపోతే భోజనం పూర్తయినట్లు కాదు. ఇంట్లో మూలన ఒకటి రెండు బియ్యం మూటలు ఉంటే కానీ మనసుకు స్థిమితంగా ఉండదు. అమెరికాకు వెళ్లినా, అంతరిక్షానికి వెళ్లినా ఈ బుద్ది మారేది కాదు. నిన్నటిదాకా వడ్లు కొనేది లేదంటూ తెలంగాణ రైతులను ఏడిపించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా సాధారణ బియ్యం ఎగుమతులపై నిషేధం విధించి అమెరికన్ తెలుగువారి పొట్ట కొట్టింది. ఇప్పటిదాకా 20 శాతం అదనపు సుంకంతో బియ్యం ఎగుమతులను అనుమతిస్తూ వచ్చింది. ఎన్నికల సంవత్సరం దేశీయంగా ధరలు పెరుగుతున్నాయని ఆందోళన చెంది గురువారం నుంచి పూర్తి నిషేధం విధించింది. బియ్యం తప్ప వేరే అలవాటు లేని అమెరికాలోని దాదాపు 15 లక్షల మంది దక్షిణ భారతీయులు తిండి సంక్షోభంలో పడ్డారు. ప్రస్తుతం ఉన్న నిల్వలు అయిపోతే బిర్యానీ కోసం వాడే బాస్మతి బియ్యం కానీ, కేరళలో కొందరు ప్రజలు వండుకొనే ఉప్పుడు బియ్యం కానీ తినాలి. వాటి ఎగుమతిపై ఎలాంటి నిషేధం లేదు.
చివరి ఆప్షన్‌గా ఆగ్నేయాసియా దేశాల నుంచి దిగుమతి చేసుకొనే నాసిరకం బియ్యం కొనుక్కోవాలి. నిజానికి ప్రపంచంలో ఎగుమతి అయ్యే బియ్యంలో 40 శాతం భారతదేశం నుంచే వస్తుంది. భారతదేశం ఎగుమతిపై నిషేధం పెట్టడంతో ఇతర దేశాల బియ్యం ఏమూలకూ సరిపోని పరిస్థితి ఏర్పడింది. అందునా, అమెరికన్ భారతీయులు ఎక్కువగా ఇష్టపడే సోనా మసూరీ రకం బియ్యం భారతదేశంలో మాత్రమే పండుతుంది. ఇతర దేశాల్లో దొరకదు. భారత ప్రభుత్వం గురువారం బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన వెంటనే అమెరికాలోని భారతీయులు రానున్న సంక్షోభాన్ని గుర్తించారు. ఆఫీసులకు సెలవు పెట్టి మరీ గ్రాసరీ స్టోర్లలో క్యూ కట్టారు. 9 కిలోల బియ్యం సంచులు ఎన్ని దొరికితే అన్ని కొని కార్లలో వేసుకొని ఇళ్లకు తీసుకెళ్లి పోయారు. శుక్రవారం అమెరికా అంతటా ఎక్కడ చూసినా స్టోర్ల బయట భారతీయుల క్యూలే కనిపించాయి. స్టోర్లలో ఒక్క పూటలోనే సాధారణ బియ్యం అయిపోవడంతో ఆలస్యంగా వచ్చిన వాళ్లు ఎగుమతి నిషేధం లేని బాస్మతి, ఉప్పుడు బియ్యం బస్తాలను కూడా కరువు వచ్చినట్లు కొనుక్కుపోయారు. కార్ల నిండా బియ్యం బస్తాలే. ఒక్కరోజులో ఫుడ్ లయన్, కోస్ట్ కో లాంటి స్టోర్లలో బియ్యం మూటలన్నీ ఖాళీ అయిపోయాయి. సాధారణంగా 9 కిలోల బియ్యం బ్యాగ్ 15 డాలర్లకు కొనేవాళ్లు.
ఇప్పుడు దాని ధర ఏకంగా 50 డాలర్లకు ఎగబాకింది. కొందామన్నా స్టాక్ లేదు. కొన్నిచోట్ల వియత్నాం, మెక్సికోల నుంచి దిగుమతి చేసుకున్న మేకుల్లాంటి బియ్యం అమ్ముతున్నా భారతీయులు కొనడం లేదు. నిషేధం ఎత్తేసే వరకు భవిష్యత్తులో అవే తినక తప్పదని భావిస్తున్నారు. సోనా మసూరీ బియ్యం కన్నా బాస్మతి బియ్యానికి గ్లైసిమిన్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ సమస్య ఉన్న వాళ్లకు ఉత్తమమని, భారత్ నుంచి ఎగుమతుల నిషేధం ఎత్తేసే వరకు ఆరోగ్యం పేరుతో బాస్మతి రైస్ తిందామని ఎన్నారైల వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు చక్కర్లు కొడుతున్నాయి. సాధారణంగా దశాబ్దాలుగా యూఎ్‌సలో ఉంటున్న భారతీయ అమెరికన్లు మూడు నెలలకు సరిపడా బియ్యం నిల్వలు ఇంట్లో ఉంచుకుంటారు. కొత్తగా వచ్చిన వారికి ఈ అలవాటు లేకపోవడం వల్ల తాజా పరిణామాలతో భయపడిపోయి బియ్యం కోసం పరుగులు తీశారు. ముఖ్యంగా వినాయక చవితి మొదలు కార్తీక పౌర్ణమి వరకు వరసగా 3-4 నెలలు పండగ సీజన్ ఉండటంతో తెలుగు కుటుంబాలు బియ్యం కొరత గురించి ప్యానిక్ అయ్యాయి. ఒక్కొక్కళ్లు కనీసం పది నుంచి పదిహేను బ్యాగులు కొనుక్కున్నారు. డాలస్ లాంటి ప్రాంతాల్లో ఇల్లు కొంటే 15 బ్యాగుల బియ్యం ఉచితం లాంటి ప్రకటనలు భారతీయ బిల్డర్లు విడుదల చేశారు. దక్షిణ భారత ప్రజలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండే కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాల్లో కూడా ఇదే పరిస్థితి. భారతదేశం నుంచి ఏటా అమెరికా, కెనడాలకు కలిపి 64 వేల టన్నుల బియ్యం ఎగుమతి అవుతుంది. యూరప్ దేశాలకు 73 వేల టన్నులు వెళుతుంది. అత్యధికంగా గల్ఫ్ దేశాలకు 7 లక్షల టన్నులు వెళుతుంది. అంటే, ఎగుమతుల నిషేధం వల్ల అత్యధికంగా ప్రభావితం అయ్యేది గల్ఫ్ దేశాలన్న మాట. భారత్ నుంచి బియ్యం ఎగుమతుల్లో 25 శాతం సోనా మసూరీ బియ్యమే.
అంతర్జాతీయంగా భారత బియ్యం కొనుగోళ్లు ఏడాదిలో 35 శాతం పెరిగాయి. పైగా ఈ ఏడాది భారీ వర్షాలతో వరి ధాన్యం ఉత్పత్తి 20 శాతం తగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో బియ్యం ధరలు ఒకేసారి మూడు శాతం పెరిగాయి. గత ఏడాది జూలైతో పోలిస్తే ధర ఏకంగా 11.5 శాతం పెరిగింది. ఎన్నికల ముందు బియ్యం రేట్లు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని ఎగుమతులపై నిషేధం విధించింది. భారత్ తర్వాత అత్యధికంగా బియ్యం ఎగుమతి చేసే వియత్నాం, థాయ్‌లాండ్‌ల బియ్యం ధరలు కూడా భారీగా పెరిగాయి. పైగా రష్యా నల్ల సముద్రంలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఆహారధాన్యాల నౌకల రాకపోకలకు ఇచ్చిన వెసులుబాటును వారం క్రితమే ఉపసంహరించుకుంది. ఉక్రెయిన్ యుద్ధంపై పట్టుబిగించే కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. దాని ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా బియ్యంతో పాటు ఇతర ఆహార ధాన్యాల ధరలు కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అమెరికా, చైనాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోవడంతో ఈ ఏడాది అక్కడ పంట దిగుబడులు భారీగా తగ్గిపోతాయని అంచనా వేస్తున్నారు. వరి ఎక్కువగా పండించే ధాయ్‌లాండ్ కూడా కరవు పరిస్థితుల్లో నీటిని పొదుపు చేయడానికి వరి ఏడాదికి ఒక పంటే వేయాలని ఆదేశించింది.