Schengen visa for Indians: భారతీయులకు స్కెంజెన్ వీసాల నిలిపివేత.. స్విట్జర్లాండ్ ఎంబసీ ఏం చెప్పిందంటే..
ABN , First Publish Date - 2023-08-04T10:31:21+05:30 IST
భారతీయులకు స్కెంజెన్ వీసాల అపాయింట్‌మెంట్‌లు నిలిపివేశారంటూ జరుగుతున్న ప్రచారంపై స్వీస్ ఎంబసీ (Swiss Embassy) తాజాగా క్లారిటీ ఇచ్చింది.
Schengen visa for Indians: భారతీయులకు స్కెంజెన్ వీసాల అపాయింట్‌మెంట్‌లు నిలిపివేశారంటూ జరుగుతున్న ప్రచారంపై స్వీస్ ఎంబసీ (Swiss Embassy) తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఐరోపా సమాఖ్య దేశాల్లో వీసా ఆంక్షలు లేకుండా పర్యటించేందుకు జారీ చేసే వీసాల అపాయింట్‌మెంట్‌లు అక్టోబర్ వరకు నిలిపివేశారనే వార్తల్లో నిజం లేదని ఇండియాలోని స్విట్జర్లాండ్ రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. భారతీయ ప్రయాణికులకు స్కెంజెస్ వీసా (Schengen visa) లను నిలిపివేయలేదని తెలిపింది. భారత పర్యాటక బృందాలకు యధావిధిగా వీసా అపాయింట్‌మెంట్లు కొనసాగిస్తున్నట్లు స్విట్జర్లాండ్ ఎంబసీ చెప్పుకొచ్చింది. ఇక స్కెంజెన్ వీసా అనేది ఐరోపా దేశాలలో 90 రోజుల వరకు పర్యటించేందుకు వీలు కల్పించే వీసా. ఏదైనా స్కెంజెన్ దేశం దీనిని జారీ చేస్తే, దానిపై ఇతర స్కెంజెన్ దేశాలను కూడా సందర్శించేందుకు అనుమతి ఉంటుంది.
కాగా, 2019తో పోలిస్తే 2023లో ఇప్పటివరకు స్వీస్ అత్యధిక వీసాలను భారతీయులకు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు మొదటి ఆరు నెలల్లోనే ఏకంగా 1.29లక్షల దరఖాస్తులను పరిశీలించింది. మహమ్మారి కరోనా ముందుతో పోలిస్తే 7.8 శాతం ఎక్కువ వీసాలను జారీ చేసింది. ఇండియన్స్ వీసాల ప్రక్రియను 2023లో మరింత సులభతరంగా మార్చయడానికి స్విట్జర్లాండ్ ఎంబసీ కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ప్రయాణానికి 6 నెలల ముందే వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంతకుముందు కేవలం నెల ముందు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి వీలు ఉండేది. ఈ నిర్ణయం ఇప్పుడు పర్యాటకులకు ఎంతో ఉపయోగకరంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Mahzooz draw: లక్ అంటే నీదే భయ్యా.. రూ.5.61లక్షలు ఖర్చు చేస్తే.. రూ.45కోట్ల జాక్‌పాట్!
ఇదిలాఉంటే.. లక్నో దరఖాస్తు కేంద్రాన్ని కూడా అతి త్వరలోనే భారతీయులకు అందుబాటులోకి తీసుకొస్తామని స్వీస్ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ కేంద్రంతో భారత్‌లో మొత్తం దరఖాస్తు సెంటర్ల సంఖ్య 13కు చేరుతుంది. ఇక స్విట్జర్లాండ్ ఎంబసీ తాజా ప్రకటన ప్రకారం వీఎఫ్‌ఎస్ (VFS) ద్వారా దరఖాస్తు చేసిన వీసాలపై నిర్ణయాన్ని వెల్లడించడం అనేది 13 రోజులలోపు జరుగుతుంది. ఇంతకుముందు ఒక దరఖాస్తు రీసెట్ చేయాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం చెప్పడానికి 21 రోజులు పట్టేది. ఈ మార్పు కూడా భారతీయులకు స్కెంజెన్ వీసా పొందడం మరింత సులభతరం చేసింది.