NRI: సౌదీలో తెలంగాణ యువకుడి దుర్మరణం.. చలిని తట్టుకోలేక హీటర్ ఆన్ చేస్తే..

ABN , First Publish Date - 2023-01-02T20:25:52+05:30 IST

సౌదీలో తెలంగాణ యువకుడి దుర్మరణం. హీటర్‌ పోగ పీల్చడంతో కబళించిన మృత్యువు.

NRI: సౌదీలో తెలంగాణ యువకుడి దుర్మరణం.. చలిని తట్టుకోలేక హీటర్ ఆన్ చేస్తే..

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: భగభగమండే సౌదీ అరేబియా(Saudi Arabia) ఎడారులలో ఎండ ఎంత తీవ్రంగా ఉంటుందో చలి కూడా అదే స్థాయిలో ఉంటుంది. శీతాకాలంలో చలి నుంచి కాపాడుకోవడానికి ప్రజలు రాత్రి వేళలలో పెద్ద సంఖ్యలో హీటర్లను వినియోగిస్తారు. ఈ క్రమంలో ప్రతి శీతాకాలంలో సౌదీ అరేబియా, కువైత్, ఇతర గల్ఫ్ దేశాలలో తెలుగువారితో సహా అనేక మంది భారతీయులు ప్రాణాలు కోల్పోతుంటారు.

తాజాగా నిర్మల్ జిల్లా ఖానాపురం మండలం మస్కపూర్ గ్రామానికి చెందిన 28 ఏళ్ళ అబ్దుల్ జహీర్ సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలో హీటర్ పొగ కారణంగా మరణించాడు. చలి బారి నుండి కాపాడుకోవడానికి రాత్రి హీటర్(Heater) స్వీచ్చాన్ చేసిన పడుకొన్న జహీర్, అతడి ఇద్దరు సహచరులు గాఢనిద్రలో ఉండి హీటర్ నుండి పొగ(Smoke) వెలువడటం గమనించలేదు. హీటర్ పొగలో ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్ కూడా ఉండటంతో జహీర్ ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన ఇద్దరు అస్వస్థతకు గురయి ఆసుపత్రిలో చేరారు. ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అధికారిక ప్రక్రియలను పూర్తి చేయడానికి సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీ సామాజిక కార్యకర్తలు ముజమ్మిల్ షేఖ్, అబ్దుల్ రఫీక్‌లు ప్రయత్నిస్తున్నారు.

కొద్ది కాలం క్రితం జరిగిన భారీ బస్సు ప్రమాదంలో సురక్షితంగా బయటపడ్డ జహీర్ అనూహ్యంగా మరణించాడు. అతని తండ్రి క్యాన్సర్‌తో మరణించారు. అప్పట్లో తండ్రి చికిత్స కోసం జహీర్ సౌదీ అరేబియాలో తెలిసిన వారి నుండి పెద్ద ఎత్తున అప్పులు చేసినట్లుగా సమాచారం.

వెచ్చదనం కొరకు వినియోగించే హీటర్లలో అత్యధికం విద్యుత్‌తో నడిచేవే అయినా కొన్ని ఆయిల్, మరికొన్ని కాయిల్ ఆధారంగా పనిచేస్తాయి. గ్రామీణ ప్రాంతాలలో, వ్యవసాయ క్షేత్రాలలో డీజిల్, కిరోసిన్ హీటర్లను కూడా వినియోగిస్తారు. వీటి నుండి వెలువడే పొగలో కార్బన్ మోనాక్సైడ్(Carbon Monoxide, CO) వాయువు కారణంగా మరణాలు సంభవిస్తాయి. రాత్రి వేళల్లో నిద్రలో హీటర్లు స్విచ్చాఫ్ చేయకుండానే నిద్రకు ఉపక్రమించడంతో తరుచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎలాంటి వాసన, రంగు లేని ఈ పొగ నిశబ్దంగా మానవుల ప్రాణాలను బలిగొంటుంది.

సౌదీ అరేబియాలో ప్రతి శీతాకాలంలో 70 లక్షలకు పైగా విద్యుత్, ఆయిల్ హీటర్లను వెచ్చదనం కోసం వాడుతారు. రాత్రి వేళలలో ఈ హీటర్లు వాడేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం తరుచూ విజ్ఞప్తులు చేస్తుంటుంది.

Updated Date - 2023-01-02T20:31:26+05:30 IST