NRI: సిడ్నీలో తెలుగుదేశం ఆస్ట్రేలియా సంక్రాంతి సంబరాలు అదరహో..!
ABN , First Publish Date - 2023-02-08T09:32:37+05:30 IST
సిడ్నీలోని తెలుగువారందరి కోసం తెలుగుదేశం ఆస్ట్రేలియా (Telugu Desam Australia) సంక్రాంతి సంబరాలు వేడుకలని ఫిబ్రవరి 4న కాజిల్ హిల్ షోగ్రౌండ్ నందు ఘనంగా నిర్వహించారు.
తెలుగుదేశం ఆస్ట్రేలియా వారీ 2023 సంక్రాంతి సంబరాలు
సిడ్నీలోని తెలుగువారందరి కోసం తెలుగుదేశం ఆస్ట్రేలియా (Telugu Desam Australia) సంక్రాంతి సంబరాలు వేడుకలని ఫిబ్రవరి 4న కాజిల్ హిల్ షోగ్రౌండ్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగువారి నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. పెద్ద సంఖ్యలో కుటుంబసమేతంగా పాల్గొని కార్యక్రమాన్ని ఆసాంతం ఆనందించారు.
తెలుగుదనం ఉట్టిపడే వస్త్రధారణ, హరిదాసుల హడావిడి, చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, ఆహూతుల కోసం నిర్వహించిన సరదా ఆటల మధ్య జరిగిన ఈ సంబరాలు అందరి మన్ననలు అందుకున్నాయి. తమ ఆటపాటలతో అలరించిన చిన్నారులకి జ్ఞాపికలు అందజేశారు.
ఈ వేడుకలలో భాగంగా స్పాన్సర్ల చేతుల మీదగా తెలుగుదేశం ఆస్ట్రేలియా 2023 తెలుగు క్యాలెండరు ఆవిష్కరణ జరిగింది. ఆస్ట్రేలియాకి చెందిన తెలుగు సింగర్ సుష్మిత రాజేష్ యొక్క నెక్స్ట్ గ్లోబల్ ఆల్బమ్ 5 భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా శివరాత్రికి T-సిరీస్‌లో సిడ్నీ నుంచి లాంచ్ అవుతున్న సందర్భంగా తెలుగుదేశం ఆస్ట్రేలియా ప్లాట్ ఫామ్ లో డిస్క్ లాంచ్ వైభవంగా జరిగింది.
ముఖ్య అతిథిగా పాల్గొన్న న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి గౌ. డామియన్ ఫ్రాన్సిస్ తెలుగువారి సంస్కృతిని ప్రతిబింబించే విధంగా జరిగిన కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తు తరాలు తమ మూలాలు మర్చిపోకుండా ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి గత 10 సంవత్సరాలుగా సంస్థకు వెన్నుముకగా ఉన్న సభ్యులు, స్పాన్సర్లకు తెలుగుదేశం ఆస్ట్రేలియా కార్యవర్గం కృతజ్ఞతలు తెలియజేసింది. అలాగే మే 28న సంస్థ నిర్వహిస్తున్న ఆంధ్రుల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలలో కూడా పాల్గొనాలని కోరారు.
తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షించడంలోను, తెలుగువారికి పలు విపత్తుల్లో ఆర్థికంగా సహాయం చేయడంలోనూ, తెలుగువారందరినీ ఒక త్రాటి మీద నడిపించి ఐక్యంగా ఉంచడంలోనూ అవిరళమైన కృషి చేస్తున్న తెలుగుదేశం ఆస్ట్రేలియాను ఆహూతులు ప్రశంసించారు.