London: ఉన్నత చదువుల కోసం పరాయి దేశం వెళ్లి కానరాని లోకాలకు.. తెలుగు యువకుడ్ని బలిగొన్న రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2023-07-27T10:34:35+05:30 IST
భవిష్యత్‌పై ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఓ తెలుగు యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది.
ఎన్నారై డెస్క్: బ్రిటన్ రాజధాని లండన్ (London) లో విషాద ఘటన చోటు చేసుకుంది. భవిష్యత్‌పై ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఓ తెలుగు యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఏపీకి చెందిన కిరణ్ కుమార్ అనే తెలుగు విద్యార్థి (Telugu Student) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చేతికి అందివచ్చిన కొడుకు ఇలా అర్ధాంతరంగా మృతిచెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర్రుకు చెందిన చెందిన ఆరాధ్యుల యజ్ఞనారాయణ, భూలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సుధీర్ కుమార్ తపాలశాఖలో (Postal Department) జాబ్ చేస్తున్నాడు. చిన్న కుమారుడు కిరణ్ కుమార్ (25) ఏలూరులో ఇంజినీరింగ్ చేశాడు. అనంతరం రెండున్నరేళ్ల కింద లండన్ వెళ్లి ఎంఎస్ పూర్తి చేశాడు.
ఆ తర్వాత ఉద్యోగం వేటలో పడిన అతడు.. నిపుణుల సూచన మేరకు కొన్ని కోర్సులు నేర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో రోజూ క్లాసులకు వెళ్తున్నాడు. రోజులానే జూన్ 26వ తారీఖున కూడా ద్విచక్రవాహనంపై క్లాస్‌కు వెళ్లేందుకు బయల్దేరాడు. అదే సమయంలో పోలీసులు ఓ దొంగను వెంటాడుతున్నారు. ఆ దొంగ వేగంగా వెళ్తూ.. కిరణ్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో కిరణ్ తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో పోలీసులు అతడిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇక నెలపాటు వివిధ ప్రయత్నాలు చేసిన కుటుంబ సభ్యులు అక్కడి ప్రవాస భారతీయుల సహకారంతో కిరణ్ మృతదేహాన్ని లండన్ నుంచి స్వదేశానికి విమానంలో తరలిస్తున్నారు. కిరణ్ కుమార్ మృతితో అతని స్వస్థలం గొడవర్రులో విషాదఛాయలు అలుముకున్నాయి.