Indian Nurses: ప్రతిష్టాత్మక 'గ్లోబల్ నర్సింగ్ అవార్డ్' రేసులో ఇద్దరు భారతీయ నర్సులు..!
ABN , First Publish Date - 2023-05-10T14:03:52+05:30 IST
ఇద్దరు భారతీయ నర్సులు ప్రతిష్టాత్మక 'గ్లోబల్ నర్సింగ్ అవార్డ్'కు (Global Nursing Award) రేసులో నిలిచారు.
ఎన్నారై డెస్క్: ఇద్దరు భారతీయ నర్సులు ప్రతిష్టాత్మక 'గ్లోబల్ నర్సింగ్ అవార్డ్'కు (Global Nursing Award) రేసులో నిలిచారు. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేట్ హెల్త్ కేర్ సర్వీస్ ప్రొవైడర్ ఆస్టర్ డీఎం హెల్త్ కేర్ ఈ అవార్డులను ప్రదానం చేస్తుంది. దీని కింద విజేతకు 2.50 లక్షల అమెరికన్ డాలర్ల (రూ.2.05కోట్లు) రివార్డును అందజేస్తుంది. ఇక ఈ అవార్డ్ రేసులో నిలిచిన ఇద్దరు భారతీయ నర్సులు శాంతి థెరెసా లక్రా( Shanti Theresa Lakra ), జెన్సీ జెర్రీలుగా (Jincy Jerry). అండమాన్ అండ్ నికోబార్ దీవులలో ప్రమాదకరమైన వారిగా పరిగణించే గిరిజన జాతులతో శాంతి థెరెసా లక్రా పనిచేస్తున్నారు. అలాగే కేరళ మూలాలున్న ఐర్లాండ్‌కు చెందిన వ్యక్తి జెన్సీ జెర్రీ. వీరిద్దరూ ఈ అవార్డ్ కోసం ఎన్నికైన 10 మందితో కూడిన తుది జాబితాలో చోటు దక్కించుకున్నారు. పబ్లిక్ ఓటింగ్ అనంతరం జ్యూరీ విజేతలను ప్రకటించనుంది. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా మే 12న లండన్‌లో జరిగే వేడుకలో విజేతకు అవార్డును ప్రదానం చేస్తారు.
శాంతి థెరిస్సా లక్రా.. పోర్ట్‌బ్లెయిర్‌లోని జీబీ పంత్ (GB Panth) హాస్పిటల్‌లో పదేళ్లుగా నర్సింగ్ సేవలు నిర్వర్తిస్తున్నారు. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లోని అత్యంత ప్రమాదకర ఆదిమ తెగలకు ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ అవార్డ్‌తో సత్కరించింది. 2004లో సునామీ విరుచుకుపడినప్పుడు అక్కడి తెగలకు వైద్య సేవలు అందించడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఆమె అండమాన్ దీవుల్లోని అన్ని ప్రధాన తెగల సంక్షేమం కోసం పాటు పడుతున్నారు. ఈ క్రమంలోనే శాంతి థెరిస్సా సేవలను గుర్తించిన గ్లోబల్ అవార్డ్ కమిటీ ఆమె పేరును షార్ట్‌లిస్ట్ చేసింది. ఇక మరో నర్సు జెన్సీ జెర్రీ.. డబ్లిన్‌లోని మేటర్ మిసెరికార్డియే యూనవర్సిటీ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఇన్‌ఫెక్షన్ నియంత్రణకు సంబంధించి నర్సింగ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. ప్రయోగశాలల నుంచి ఫలితాలను క్రోడీకరించేటప్పుడు మానవ తప్పిదాలను తగ్గించడానికి ఆమె ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడం విశేషం. ఈ క్రమంలోనే గ్లోబల్ నర్సింగ్ అవార్డ్స్‌లో ఆమె షార్ట్‌లిస్ట్ అయ్యారు.