US Visa: అమెరికా వెళ్లే భారతీయుకులకు తీపి కబురు.. వీసా మంజూరుపై అగ్రరాజ్యం కీలక నిర్ణయం
ABN , First Publish Date - 2023-07-28T09:12:31+05:30 IST
యూఎస్‌లో (US) సందర్శకులు తగ్గిపోవడానికి ప్రధాన కారణం వీసా ప్రక్రియ. వేచిచూసే సమయం చాలా ఎక్కువగా ఉండడం పర్యాటకులను విసుగెత్తిస్తుంది.
ఎన్నారై డెస్క్: మహమ్మారి కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని రంగాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఇక పర్యాటకం (Tourism) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, గడిచిన ఏడాది కాలంగా కోవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి. దాంతో టూరిజం మెల్లమెల్లగా గాడిలో పడుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో పరిస్థితులు చక్కపడ్డాయి కూడా. అందులోనూ స్పెయిన్ (Spain) అయితే దూసుకెళ్తోంది. ఆ దేశ పర్యాటక రంగం ఇప్పటికే 86శాతం మేర కోలుకోవడం విశేషం.
ప్రస్తుతం ఆ దేశ టూరిజం కరోనా ముందు పరిస్థితుల కంటే కేవలం 3శాతం మాత్రమే వెనుకబడి ఉన్నట్లు తాజాగా వెలువడిన గణాంకాలు తెలియజేస్తున్నాయి. కానీ, అగ్రరాజ్యం అమెరికాలో (America) మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఆ దేశంలో టూరిస్టుల సంఖ్య 2023 జూన్ చివరినాటికి కరోనా మునుపటి పరిస్థితులతో పోల్చుకుంటే 26 శాతం తక్కువగా నమోదు కావడం అక్కడి పరిస్థితులను అద్దం పడుతోంది. మరోవైపు యూఎస్‌లో (US) సందర్శకులు తగ్గిపోవడానికి ప్రధాన కారణం వీసా ప్రక్రియ. వేచిచూసే సమయం చాలా ఎక్కువగా ఉండడం పర్యాటకులను విసుగెత్తిస్తుంది.
UK Visa: భారతీయ యువ వృత్తి నిపుణులకు బ్రిటన్ గుడ్‌న్యూస్
ప్రస్తుతం అమెరికా పర్యాటక వీసా పొందాలంటే కనీసం 400 రోజులు వేచి చూడాల్సి వస్తోంది. అందుకే అక్కడికి వెళ్లేందుకు ఇతర దేశాల పర్యాటకులు (Tourists) చాలామంది వెనుకాడుగు వేస్తున్నారు. మరోవైపు యురోపియన్ యూనియన్, బ్రిటన్ దేశాలు పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. దాంతో దేశ పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసే అంశంపై అగ్రరాజ్యం దృష్టి సారించింది. దీనిలో భాగంగా వీసా మంజూరు సమయాన్ని తగ్గించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించిందని తెలుస్తోంది. యూరోపియన్ దేశాలు పర్యాటకుల సంఖ్యను పెంచుకునేందుకు వీసా నుంచి మినహాయింపు కూడా ఇస్తున్నాయి.
ఈ తరుణంలో వీసా (Visa) మంజూరు సమయం తగ్గించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ముఖ్యంగా భారత్ నుంచి అమెరికాకు ఎక్కవ మంది వెళ్లే అవకాశం ఉన్నందున వారికి టూరిస్ట్ వీసా (Tourist Visa) సమయం తగ్గించి.. త్వరగా వీసా మంజూరు చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం. ఇక లాక్‌డౌన్ ముగిసిన తర్వాత యూఎస్‌కు విదేశాల నుంచి రాకపోకలు భారీగా పెరిగాయి. దాంతో అక్కడ హోటల్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ఆ వ్యయాన్ని భరించలేకనే చాలామంది పర్యాటకులు ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.