Joe Biden: అమెరికా అధ్యక్షుడికి బిగుస్తున్న ఉచ్చు.. ట్రంప్ బాటలోనే..
ABN , First Publish Date - 2023-01-12T07:38:59+05:30 IST
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు (Joe Biden) ఉచ్చు బిగుస్తోంది.
ఒకప్పటి వ్యక్తిగత ఆఫీసులో ఇంటెలిజెన్స్ పత్రాల గుర్తింపు
ఉపాధ్యక్ష పదవి వీడినా ప్రభుత్వానికి అప్పగించని వైనం
వాషింగ్టన్, జనవరి 11: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు (Joe Biden) ఉచ్చు బిగుస్తోంది. గతంలో అమెరికా ఉపాధ్యక్షుడిగా (US Vice President) పనిచేసిన సమయంలో ఇంటెలిజెన్స్‌కు (Intelligence) సంబంధించిన రహస్య పత్రాలను తన వ్యక్తిగత కార్యాలయంలో ఉంచిన విషయం బయటికి రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధ్యక్ష పదవి నుంచి వైదొలగినప్పుడే వాటిని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉన్నా, ఆ పని చేయలేదు. ఇప్పటికే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇంటెలిజెన్స్ రహస్య పత్రాలను ఫ్లోరిడాలోని (Florida) తన వ్యక్తిగత కార్యాలయానికి తీసుకెళ్లిపోయిన ఘటనపై విచారణను ఎదుర్కొంటున్నారు. తాజాగా బైడెన్ కూడా అలాంటి దర్యాప్తును ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. పెన్సిల్వేనియా యూనివర్సిటీలో బైడెన్ పనిచేసినప్పుడు ఉపయోగించుకున్న కార్యాలయాన్ని ఇటీవల ఖాళీ చేసే సమయంలో ఈ పత్రాలు బయటపడ్డాయి. అవన్నీ 2013, 2016 మధ్య కాలానికి సంబంధించినవని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్, ఇరాన్, బ్రిటన్ దేశాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారం కూడా వాటిలో ఉంది. చికాగోలోని అటార్నీ జాన్ లాస్చ్ జూనియర్ ఇప్పటికే దీనిపై ప్రాథమిక దర్యాప్తును పూర్తి చేసి అటార్నీ జనరల్ మెర్రిక్ గార్లాండ్‌కు నివేదిక అందజేశారు. ఈ వ్యవహారంలో సమగ్ర దర్యాప్తుపై మెర్రిక్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా, ఉపాధ్యక్ష పదవి వీడిన తర్వాత రహస్య పత్రాలు తన వ్యక్తిగత కార్యాలయంలోనే ఉండిపోయిన విషయం తనకు గుర్తులేదని బైడెన్ మంగళవారం మీడియాకు చెప్పారు. పత్రాలు బయటపడగానే ఏం చేయాలో అదే తన అటార్నీలు చేశారని, నేషనల్ ఆర్కీవ్‌కు సమాచారం ఇచ్చారని చెప్పారు.