Vivek Ramaswamy: ఎవరీ వివేక్ రామస్వామి..? అన్నీ కలిసొస్తే అమెరికా అధ్యక్షుడిని అవుతానంటున్న ఈ ఎన్నారై బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే..
ABN , First Publish Date - 2023-02-18T10:22:36+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇప్పటికే భారత సంతతి (Indian Origin) మహిళ, రిపబ్లికన్ పార్టీ (Republican Party) సీనియర్ నాయకురాలు నిక్కి హెలీ (Nikki Haley) ఇటీవలే తాను అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇప్పటికే భారత సంతతి (Indian Origin) మహిళ, రిపబ్లికన్ పార్టీ (Republican Party) సీనియర్ నాయకురాలు నిక్కి హెలీ (Nikki Haley) తాను అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు అదే రిపబ్లికన్ పార్టీ నుంచి మరో ఇండో-అమెరికన్ (Indo-American) అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించారు. ఆయనే యువ మిలియనీర్ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy). 37 ఏళ్ల రామస్వామి 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తనను తాను 'క్యాపటలిస్ట్ అండ్ సిటిజెన్'గా అభివర్ణించుకున్న ఆయన ఇప్పటికే పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ స్పీచ్‌లు ఇవ్వడం, టెస్ట్ రన్స్ నిర్వహించడం చేస్తున్నారు.
కాగా, అమెరికన్ పెట్టుబడిదారుడు బిల్ అక్మాన్ తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యల కారణంగానే రామస్వామి ఇలా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. "భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి పోటస్ కోసం పోటీ చేసి గెలుస్తారు!" అని బిల్ అక్మాన్ ట్విటర్ వేదికగా వ్యాఖ్యానించారు. "అతని సందేశం కోసం దేశం సిద్ధంగా ఉందని భావిస్తున్నాను. అతను యువకుడు, తెలివైనవాడు, ప్రతిభావంతుడు. తన మాటలు, చేతలతో కేంద్రాన్ని ఆకర్షించి గెలిచే సత్తా అతనికి ఉంది. అతను చాలా మంది నమ్మే, బయటకు చెప్పడానికి భయపడే కఠినమైన సత్యాలను మాట్లాడతాడు" అని అక్మాన్ ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ పేలిన తూటా.. ఆరుగురు మృతి!
ఇంతకీ ఎవరీ వివేక్ రామస్వామి..?
రామస్వామి కేరళ నుండి యూఎస్ వలస వెళ్లిన భారతీయ తల్లిదండ్రులకు సిన్సినాటిలో జన్మించారు. అతని తండ్రి ఎలక్ట్రిక్ ఇంజనీర్ కాగా.. తల్లి మానసిక వైద్యురాలు. యేల్, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో రామస్వామి విద్యను అభ్యసించారు. ‘వోక్, ఇంక్: ఇన్‌సైడ్ కార్పొరేట్ అమెరికాస్ సోషల్ జస్టిస్ స్కామ్’ రచయిత అయిన రామస్వామి ఒక ప్రముఖ బయోటెక్ వ్యవస్థాపకుడు కూడా. అతను యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఆమోదం పొందిన ఐదు ఔషధాలను అభివృద్ధి చేశాడు. ఇక తాజాగా అక్మాన్ పంచుకున్న రామస్వామి ప్రసంగానికి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. అక్కడ అతను 'జాత్యహంకారిగా' ముద్రపడే ముప్పు గురించి మాట్లాడటం మనం చూడవచ్చు. ఇదిలాఉంటే.. రామస్వామి ప్రస్తుత నికర సంపద 500 మిలియన్ డాలర్లకు (రూ.41,379,171,500) పైగా ఉంది. నివేదికల ప్రకారం అతని ఎన్నికల ప్రారంభ ప్రచారానికి ఇది సరిపోతుంది అనేది అక్మాన్ అభిప్రాయం. అంతేగాక అన్నీ కలిసొస్తే అమెరికా అధ్యక్షుడిగా వివేక్ రామస్వామిని చూడొచ్చని ఆయన గట్టిగా నమ్ముతున్నారు.
ఇది కూడా చదవండి: అమ్మ బాబోయ్.. ఇలాంటి కూతుళ్లున్న తండ్రుల పని ఔటే.. తల్లి వద్ద తండ్రిని ఎలా ఇరికించేసేందో చూడండి..!