BRS BJP : ఈ రెండు పరిణామాలు జరిగితే.. బీజేపీ-బీఆర్ఎస్ లెక్కలు తేలిపోతాయ్..!?
ABN , First Publish Date - 2023-07-07T23:13:53+05:30 IST
బీజేపీకి బీఆర్ఎస్ ‘బీ’ టీమ్..(BJP-BRS) ఈ మాట గత నెలన్నర రోజులుగా ఎక్కడ చూసినా వినిపిస్తోంది.. మీడియాలో, సోషల్ మీడియాలో.. ప్రతిపక్షాల నోట ఇదే మాట. సీన్ కట్ చేస్తే అటు బీఆర్ఎస్.. ఇటు బీజేపీ ఒకరిపై ఒకరు ప్రేమను ఒలకబోసుకోవడం.. మునుపటిలాగా విమర్శలు, ప్రతివిమర్శలు లేకపోవడం.. ఒకవేళ ఉన్నా తగిలీ తగలక ఉండటంతో ఏదో తేడాగానే ఉందే అని అందరూ అనుకుంటున్నారు..
బీజేపీకి బీఆర్ఎస్ ‘బీ’ టీమ్..(BJP-BRS) ఈ మాట గత నెలన్నర రోజులుగా ఎక్కడ చూసినా వినిపిస్తోంది.. మీడియాలో, సోషల్ మీడియాలో.. ప్రతిపక్షాల నోట ఇదే మాట. సీన్ కట్ చేస్తే అటు బీఆర్ఎస్.. ఇటు బీజేపీ ఒకరిపై ఒకరు ప్రేమను ఒలకబోసుకోవడం.. మునుపటిలాగా విమర్శలు, ప్రతివిమర్శలు లేకపోవడం.. ఒకవేళ ఉన్నా తగిలీ తగలక ఉండటంతో ఏదో తేడాగానే ఉందే అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇందులో అసలు నిజానిజాలెంత తేలిపోవడానికి మరికొన్ని గంటలే సమయం ఉంది. బీఆర్ఎస్-బీజేపీ రెండే రెండు పరిణామాలు జరిగితే.. ఈ రెండు పార్టీల మధ్య ఏదో నడుస్తోందని తేలిపోతుంది.. లేని పక్షంలో యథావిధి పరిస్థితులే ఇక.! ఇంతకీ ఆ రెండు పరిణామాలేంటి..? అనేది ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఇదీ అసలు కథ..
బండి సంజయ్ (Bandi Sanjay) రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టాక ఎక్కడో ఉన్న బీజేపీని బీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అనే స్థాయికి తీసుకొచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఉప ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలే ఇందుకు చక్కటి ఉదాహరణ. ఇక బీఆర్ఎస్-బీజేపీ నేతల మధ్య రోజూ విమర్శలే.. ప్రభుత్వం తప్పొప్పులను ఎత్తిచూపడం, విమర్శలకు మించి ఉండేవి. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌పై బండి ఒంటికాలిపై లేచేవారు.. అంతేరీతిలో బీఆర్ఎస్ నుంచి కూడా కౌంటర్ అటాక్ ఉండేది. ఇలా బీఆర్ఎస్‌కు అసలుసిసలైన ప్రతిపక్షం బీజేపీనే అనేంతలా పార్టీ ఎదిగింది. ముఖ్యంగా బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ఇతర కేంద్ర మంత్రులు సైతం విమర్శలు గుప్పించేవారు. సరిగ్గా ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత పేరు రావడం.. వరుసగా విచారణ జరగడంతో తెలంగాణ గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయాలు హీటెక్కాయి. రేపో మాపో కవితను అరెస్ట్ చేసేస్తారనే రేంజ్‌లో బీజేపీ నేతలు ఊదరగొట్టారు. సీన్ కట్ చేస్తే రెండు పార్టీల మధ్య ఏం జరిగిందో కానీ.. రాజకీయంగా విమర్శలు, ప్రతివిమర్శలు, కేసులు, కొట్లాటలు ఇప్పుడు లేవు.. పూర్తిగా మారిపోయాయ్. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న దాఖలాలు అస్సల్లేవ్. దీంతో బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ పేరొచ్చింది. ఇక అప్పట్నుంచి రెండు పార్టీల మధ్య కవిత, కొన్ని కేసుల విషయంలో లోపాయికారి ఒప్పందం జరిగిందనే ఆరోపణలు మొదలయ్యాయ్. ఇదే టైమ్‌లో మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో ఈ రెండు పార్టీల మధ్య బంధం ఫెవికల్‌లాగా స్ట్రాంగ్ అయ్యిందని వార్తలు గుప్పుమన్నాయి. పైగా బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించడం.. కిషన్ రెడ్డికి అప్పజెప్పడం దీనికి తోడు లిక్కర్ స్కామ్ వ్యవహారం సైలెంట్ అవ్వడంతో బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేనని నినాదం కాంగ్రెస్ ఎత్తుకుంది.
ఈ రెండుగానీ జరిగితే..!
స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కూడా ఖమ్మం జనగర్జన వేదికగా బీఆర్ఎస్-బీజేపీ బంధం గురించి విమర్శలు గుప్పించారంటే పరిస్థితులు ఎక్కడివరకూ వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. ఇక రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు ప్రతిరోజూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. దీనికి తగిలీ తగలని కౌంటర్లు బీజేపీ, బీఆర్ఎస్ నుంచి వస్తున్నాయ్. ఈ పరిస్థితుల్లో ప్రధాని మోదీ (Modi TS Tour) తెలంగాణ పర్యటనకు (వరంగల్) రాబోతున్నారు. అయితే మోదీకి ఘన స్వాగతం పలకడానికి ఈసారైనా సీఎం కేసీఆర్ వస్తారా రారా అనేది ఊహకందని విషయం. ఇన్నిసార్లు మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చినా ప్రభుత్వం తరఫున కేసీఆర్ (CM KCR) ఒకట్రెండు సందర్భాల్లో తప్పితే .. మిగిలిన అన్నిసార్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. లేదా ఇతరులనే పంపేవారు. అయితే ఇప్పుడు బీజేపీతో అంటకాగుతున్నారన్న బీఆర్ఎస్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో మోదీకి స్వాగతం పలుకుతారా లేకుంటే మునుపటి సీనే రిపీట్ అవుతుందా అనేది తెలియాలి. ఒకవేళ స్వయంగా కేసీఆర్ వెళ్తే మాత్రం ‘బీ’ టీమ్ అనే విమర్శ, ఆరోపణలకు బలం చేకూరినట్లు అవుతుంది.
- ఇక రెండో విషయానికొస్తే.. కేసీఆర్ ఆహ్వానం పలుకుతారా లేదా అనేది అటుంచితే వరంగల్ సభావేదికగా ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలకు కౌంటర్లిస్తూ చెక్ పెడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఎక్కడో మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో కేసీఆర్ సర్కార్, కేసీఆర్ కుటుంబ రాజకీయాలు అంటూ విమర్శలు గుప్పించిన మోదీ.. ఇప్పుడు తెలంగాణకే వస్తున్నారు. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడతారా లేదా అనేది అటు బీజేపీ.. ఇటు బీఆర్ఎస్ పార్టీల శ్రేణుల మనసుల్లో మెదులుతున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ విమర్శలు లేకపోయినా.. కేంద్రం ప్రవేశపెట్టిన, తెలంగాణ ఇచ్చిన నిధులు గురించి మాత్రమే మోదీ మాట్లాడి వెళ్లిపోయినా.. బీజేపీ-బీఆర్ఎస్ మధ్య బంధం ఉందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
వెళ్తారో.. లేదో..!
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. కేసీఆర్ స్వాగతం పలకడమే కాదు.. మోదీతో కలిసి అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారని తెలియవచ్చింది. కార్యక్రమాలకు హాజరుకావాలని పీఎంవో నుంచి కేసీఆర్ ఆఫీసుకు ఆహ్వానం కూడా అందిందని తెలుస్తోంది. ఇప్పటి వరకూ మోదీకి స్వాగతం పలికే విషయంలోగానీ.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేదానిపై సీఎంవో నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ.. రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్.. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకున్నా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు చెబుతున్నారు. శనివారం నాడు ఏం జరుగుతుందో ఏమో అని బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు వేయి కళ్లతో.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు అన్నట్లుగా మరికొన్ని గంటలు వేచి చూడక తప్పదు మరి.