Vijayasai Retirement : వైసీపీలో పెను సంచలనం.. అయ్యో పాపం సాయిరెడ్డి.. జగన్ ఇలా తీసిపడేశారేంటి..!
ABN , First Publish Date - 2023-06-23T12:48:02+05:30 IST
వైసీపీలో నంబర్-02గా ఉన్న సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy) రిటైర్మెంట్ తీసుకుంటున్నారా..? వైసీపీలో (YSRCP) ఇక ఆయన శకం ముగిసినట్టేనా..? ఈ విషయాన్ని స్వయంగా సీఎం జగనే (CM YS Jagan Reddy) ప్రకటించేశారా..? వయసు రీత్యా విజయసాయి ఇక రాజకీయాలకు పనికిరారని చెప్పేశారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇవన్నీ వందకు వెయ్యిశాతం నిజమనే అనిపిస్తోది..
వైసీపీలో నంబర్-02గా ఉన్న సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy) రిటైర్మెంట్ తీసుకుంటున్నారా..? వైసీపీలో (YSRCP) ఇక ఆయన శకం ముగిసినట్టేనా..? ఈ విషయాన్ని స్వయంగా సీఎం జగనే (CM YS Jagan Reddy) ప్రకటించేశారా..? వయసు రీత్యా విజయసాయి ఇక రాజకీయాలకు పనికిరారని చెప్పేశారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇవన్నీ వందకు వెయ్యిశాతం నిజమనే అనిపిస్తోంది. గత 48 గంటలుగా సోషల్ మీడియాలో (Social Media) పెద్దఎత్తున వైరల్ అవుతున్న విషయం ఇది. మరీ ముఖ్యంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు కొందరు అదేపనిగా ట్వీట్లు చేస్తుండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. ఇంతకీ ఈ విషయం ఎప్పుడు.. ఎక్కడ ప్రస్తావనకు వచ్చింది..? వైఎస్ జగన్ ఈ కామెంట్స్ చేశారన్న విషయంలో నిజమెంత..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో చూద్దాం..
ఇంతకీ ఏం జరిగిందబ్బా..?
వైఎస్ ఫ్యామిలీతో (YS Family) విజయసాయిరెడ్డికి ఉన్న అనుబంధాన్ని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒక ఆడిటర్‌గా లోటస్‌పాండ్‌లోకి ఎంటరై.. వైసీపీలో నంబర్-02 వరకూ ఎదిగారు. పార్టీని అధికారంలోకి తేవడానికి బహుశా ఈయన పడిన కష్టాన్ని మాటల్లో చెప్పలేం. అందుకే జగన్‌కు కూడా సాయిరెడ్డి అంటే అంత నమ్మకం. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్‌కు నమ్మినబంటు. వైసీపీలో ఏ పని జరగాలన్నా.. ఎవరికి ఏ పదవి కావాలన్నా విజయసాయి చెబితేనే జరుగుతుందనేది జగమెరిగిన సత్యమే. అయితే ఇదంతా ఏడెనిమిది నెలల ముందువరకు పరిస్థితి అంతే.. ఇప్పుడు రోజులు మారాయి. సాయిరెడ్డికి మునుపటిలా నాయకత్వం, హుషారు లేదు. ఎందుకంటే.. ఆయన ‘ముసలోడు’ అయ్యారు. ఈ మాటలు అన్నది ఎవరో కాదండోయ్.. స్వయంగా సీఎం వైఎస్ జగన్ రెడ్డే. ‘సాయన్న ముసలోడు అయ్యాడు.. అన్నీ పనులు చేయలేడు.. అందుకే అనుబంధ విభాగాల సమన్వయ బాధ్యతలను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించాల్సి వచ్చింది’ అని గడప గడపకూ ప్రభుత్వం మీటింగ్‌లో సీఎం చెప్పుకొచ్చారు. జగన్ కామెంట్స్‌తో అదే కార్యక్రమంలో ఉన్న సాయిరెడ్డి ఒకింత కంగుతిన్నారు. ఇక మిగిలిన ప్రజాప్రతినిధులు.. బాబోయ్ ఈ మాటలు అన్నది జగనేనా..? అని ఆలోచనలో పడ్డారట. పొరపాటున అన్నారా..? లేకుంటే చెప్పాల్సిందే చెప్పారా..? అని అని చర్చించుకుంటున్నారట.
అధ్వాన్నంగా సాయిరెడ్డి పరిస్థితి..?
వైసీపీ అధికారంలోకి రావడానికి ఎవరైతే కీలక పాత్ర పోషించారో ఇప్పుడు ఆయన పరిస్థితే పార్టీలో అధ్వాన్నంగా తయారయ్యింది. కీలక నేత కాస్త ఇప్పుడు సామాన్య కార్యకర్తగా అయ్యారు. ఎందుకంటే.. ఈయన చేతిలో ఉన్న ఉత్తరాంధ్ర సమన్వయకర్త, సోషల్ మీడియా ఇంచార్జీ, అనుబంధ విభాగాల సమన్వయకర్త.. ఇలా ఏ ఒక్క పదవీ లేకుండా జగన్ తొలగించేశారు. ఉత్తరాంధ్ర బాధ్యతలు టీటీడీ చైర్మన్, తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి, సోషల్ మీడియా బాధ్యతలు సజ్జల భార్గవ్ రెడ్డికి, అనుబంధ సంఘాలు చెవిరెడ్డికి కట్టబెట్టింది అధిష్టానం. అంటే ఇప్పుడు విజయసాయిరెడ్డి కేవలం రాజ్యసభ సభ్యుడు మాత్రమే అన్న మాట. రేపొద్దున ఈ పదవి కాలం అయిపోతే ఇక పూర్తిగా ఆయన ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుందేమో అన్న పరిస్థితి వైసీపీలో నెలకొంది. సాయిరెడ్డి పరిస్థితే ఇలా ఉంటే ఇక మన పరిస్థేంటబ్బా అని సీనియర్లంతా ఆలోచనలో పడ్డారట. అయినా జగన్ రెడ్డికి ఇవన్నీ మామూలే అని.. పని అయ్యాక ఎవర్నీ లెక్కచేయరని అవసరైతే అంతు చూడటానికి వెనుకాడరని సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది.
ఎక్కడ చెడింది..?
వాస్తవానికి నందమూరి తారకరత్న అనారోగ్యంతో బాధపడుతున్నప్పటి నుంచి చనిపోయి, అంత్యక్రియలు ముగిసేవరకూ అన్నీతానై చూసుకున్నారు. ఎందుకంటే అలేఖ్యారెడ్డి (భార్య సోదరి కుమార్తె) సాయిరెడ్డికి కూతురు వరుస అవుతుంది. ఈ క్రమంలో నందమూరి, నారా కుటుంబానికి సాయిరెడ్డి బాగా దగ్గరయ్యారని వార్తలు రావడం.. పైగా టీడీపీ అధినేత చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉండటం వైఎస్ జగన్‌కు రుచించలేదని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. సరిగ్గా అదే సమయంలో అనుబంధ విభాగాల సమన్వయకర్త పదవి పీకేయడంతో ఇది పెనుసంచలనమే అయ్యింది. నాటి నుంచే జగన్‌కు సాయిరెడ్డికి మధ్య గ్యాప్ పెరిగిందని వార్తలు వస్తూనే ఉన్నాయి. పైగా ఈ ఇద్దరూ కలుసుకున్న సందర్భాలు కూడా లేకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. నాడు మొదలైన ఈ అసంతృప్తి ఇప్పుడు ఏకంగా సాయిరెడ్డిని ‘ముసలోడు’ ఇక రాజకీయాలకు పనికిరాడన్న పరిస్థితికి వచ్చిందంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. పోనీ.. సాయిరెడ్డి కంటే వయసులో పెద్దవారు లేరా అంటే.. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో పాటు ఇంకా నలుగురైదుగురు కీలక నేతలే ఉన్నారు. వాళ్లందరికీ లేని రిటైర్మెంట్ విజయసాయికే ఎందుకిస్తున్నారన్నది ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు, నేతల మదిలో మెదులుతున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. వయసురీత్యా సాయిరెడ్డి బాధ్యతలు తగ్గించారే తప్ప అంతకుమించి మరొకటేమీ లేదని కొందరు ముఖ్యనేతలు లోలోపల చెప్పుకుంటున్నారట. అంతేకాదు.. సాయిరెడ్డే రిటైర్మెంట్ అడిగారని.. అందుకే జగన్ ఇలా చెప్పుకొచ్చారని మరోవైపు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పాపం సాయిరెడ్డి..!
విజయసాయి వైసీపీలోనే కాదు జగన్ అక్రమాస్తుల కేసుల్లో కూడా ఏ2. జగన్ రెడ్డితో పాటే జైలు జీవితం కూడా గడిపారు. అయితే.. జగన్ అక్రమాస్తుల కేసు ఫైనల్‌స్టేజ్‌కు వచ్చిందని ఎక్కడో తేడాకొట్టే పరిస్థితులు ఉన్నాయని ముందుగానే పసిగట్టిన జగన్ ఇలా సాయిరెడ్డిని పక్కనపెడుతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే ఎలాంటి పదవి లేని విజయసాయికి.. జగన్ మాటలు బాగా నొప్పించాయట. నిజంగా ఇది సాహసమేనని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే ఇదంతా జగన్ పక్కా ప్లాన్ ప్రకారమే పొమ్మనలేక పొగబెడుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై విజయసాయి ఎలా రియాక్ట్ అవుతారు..? దీన్ని అవమానంగా భావించి రాజకీయాలకే రాం.. రాం చెప్పేస్తారా..? లేకుంటే పార్టీకే గుడ్ బై చెప్పేస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.