TS Assembly Polls : రెండు అసెంబ్లీ స్థానాల్లో కేసీఆర్ గెలిస్తే పరిస్థితేంటి.. రాజీనామా ఎక్కడ్నుంచి.. లక్కీ ఛాన్స్ ఎవరికి..!?
ABN , First Publish Date - 2023-08-22T20:25:00+05:30 IST
అవును.. గజ్వేల్‌తో (Gajwel) పాటు కామారెడ్డి (Kamareddy) అసెంబ్లీ నుంచి కూడా పోటీచేస్తున్నాను.. ఎందుకు సార్ అంటే.. పార్టీ డిసైడ్ చేసింది.. ఏం చేద్దాం అంటావ్.. పార్టీకి లేని ఇబ్బంది మీకేంటి..? ఇవీ ప్రగతి భవన్ వేదికగా బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా (BRS First List) రిలీజ్ చేసే క్రమంలో గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) చేసిన కామెంట్స్. కేసీఆర్ అనుకున్నట్లుగానే రెండు చోట్ల నుంచీ పోటీచేస్తారు సరే..
అవును.. గజ్వేల్‌తో (Gajwel) పాటు కామారెడ్డి (Kamareddy) అసెంబ్లీ నుంచి కూడా పోటీచేస్తున్నాను.. ఎందుకు సార్ అంటే.. పార్టీ డిసైడ్ చేసింది.. ఏం చేద్దాం అంటావ్.. పార్టీకి లేని ఇబ్బంది మీకేంటి..? ఇవీ ప్రగతి భవన్ వేదికగా బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా (BRS First List) రిలీజ్ చేసే క్రమంలో గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) చేసిన కామెంట్స్. కేసీఆర్ అనుకున్నట్లుగానే రెండు చోట్ల నుంచీ పోటీచేస్తారు సరే.. ప్రతిపక్షాలు చెబుతున్నట్లుగా అది అపనమ్మకమా..? గజ్వేల్‌లో ఓడిపోతారనే కామారెడ్డి నుంచి ప్రత్యామ్నాయమా..? అనేది కాసేపు పక్కనపెడదాం. ఈ ఎన్నికల్లో ఒకవేళ అటు కామారెడ్డి, ఇటు గజ్వేల్‌లోనూ రెండు చోట్లా గెలిస్తే పరిస్థితేంటి..? అప్పుడు కంచుకోట (KCR Kanchukota) అయిన గజ్వేల్‌ను వదులుకుంటారా..? ప్రత్యామ్నాయం అనుకున్న కామారెడ్డినే వదిలేస్తారా..? అన్నది ఇప్పుడు బీఆర్ఎస్ (BRS) వర్గాల్లో జరుగుతున్న పెద్ద చర్చ. పోనీ కామారెడ్డిని వదిలేస్తే అక్కడ్నుంచి ఎవరు పోటీ.. ఒకవేళ గజ్వేల్ ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే ఏం జరుగుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.
కంచుకోటలను వదిలి.. కామారెడ్డే ఎందుకో!
కేసీఆర్ రాజకీయాల్లోకి (KCR Politics) వచ్చిన తర్వాత 1983లో మొదటిసారిగా సిద్దిపేట (Siddipet) నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 1985లో సిద్దిపేట నియోజకవర్గం నుంచే పోటీచేసి గెలిపొందగా అప్పటినుంచి కేసీఆర్ ఓటమినే ఎరగలేదు. వరుసగా సిద్దిపేట నియోజకవర్గం నుంచే 1989,1995,1999 ఎన్నికల్లో గెలుపొందారు. 2001లో టీఆర్‌ఎస్ (TRS) పార్టీని స్థాపించిన తర్వాత రాజీనామా చేసిన ఉప ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచే గెలుపొందారు. 2004 ఎన్నికల్లోను సిద్దిపేట నుంచే గెలుపొందారు. 2006లో కరీంనగర్ (Karimnagar) ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. 2008లోనూ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో మహబూబ్‌నగర్ (Mahaboob Nagar) ఎంపీగా గెలుపొందారు. 2014లోను గజ్వేల్ నుంచి పోటీ చేసి సీఎం అయ్యారు. 2018లోను అక్కడి నుంచే పోటీ చేశారు. దీంతో అటు సిద్దిపేట, ఇటు గజ్వేల్ రెండు అసెంబ్లీ స్థానాలు నాటి నుంచే కేసీఆర్ కంచుకోటలా ఉన్నాయి. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గంలోను కేసీఆర్ పోటిచేయనున్నారు. గులాబీ బాస్ ఇక్కడ్నుంచి పోటీ చేయడం వెనుక ఈ నేపథ్యంలో కామారెడ్డి నుంచి పోటీ చేస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను క్లీన్ స్వీప్ చేయవచ్చనే భావనలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పైగా.. కేసీఆర్ పూర్వీకులది కోనాపూర్ (Konapur) అని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
గజ్వేల్‌ను వదిలేయాల్సి వస్తే..!
కేసీఆర్ రెండు నియోజకవర్గాల్లో పోటీచేస్తామని చెప్పారు సరే.. సీఎం కాబట్టి రెండు నియోజకవర్గాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుచుకుంటారు కూడా.!. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. అయితే గెలిచిన తర్వాత పరిస్థితేంటి..? ఇటు కంచుకోట అయిన గజ్వేల్‌ను వదిలేస్తారా లేకుంటే ప్రత్యామ్నాయంగా భావించిన కామారెడ్డిని వదిలేస్తారా..? ఏదో ఒకటి వదిలేస్తారు సరే ఆ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీచేస్తారు..? అనేది ఇప్పుడు బీఆర్ఎస్ నేతల్లో, కార్యకర్తలు, అభిమానుల నుంచి వస్తున్న ప్రశ్నలు. అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు గజ్వేల్‌ను వదిలేయాల్సి వస్తే.. అక్కడ్నుంచి తనపై ఒకప్పుడు పోటీచేసి ఓడి ఆ తర్వాత బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొని.. రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్‌గా కొనసాగుతున్న ఒంటేరు ప్రతాప్ రెడ్డికి (Pratap Reddy Vanteru) టికెట్ కేటాయించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలియవచ్చింది. ఎందుకంటే.. ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు ఇంతకుమించిన నేత ఎవరూ లేకపోవడం.. పైగా కేసీఆర్‌పై 2014, 2018 ఎన్నికల్లో గట్టిగానే పోటీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో అయితే.. ప్రతాప్ రెడ్డి టీడీపీ తరఫున పోటీచేయగా.. కేవలం 19,391 ఓట్ల తేడాతోనే కేసీఆర్ గట్టెక్కారు. ఓట్ల లెక్కింపు రోజున కేసీఆర్ పక్కాగా ఓడిపోతారనేంత పరిస్థితి వచ్చిపడింది. 2014 ఎన్నికలతో జాగ్రత్త పడిన కేసీఆర్.. 2018 ఎన్నికల్లో గట్టిగానే ప్లాన్ చేసుకున్నారు. ఒంటేరుకు దొరక్కుండానే 58,290 మెజార్టీతో గెలిచి నిలిచారు. ఆ తర్వాత ఇక ఒంటేరును పార్టీలో చేర్చుకొని కీలక పదవే కట్టబెట్టారు. ఇప్పుడు కేసీఆర్ నియోజకవర్గానికి అన్నీ తానై ప్రతాప్ రెడ్డి చూసుకుంటున్నారు. అందుకే ఇక్కడ్నుంచి రాజీనామా చేయాల్సి వస్తే ఒంటేరుకు కేసీఆర్ ఛాన్స్ ఇస్తారని.. ఇది ఆల్రెడీ ఫిక్స్ అయిన విషయమేనని టాక్ నడుస్తోంది.
కామారెడ్డిలో గెలిస్తే.. వాట్ నెక్స్ట్!
రెండు స్థానాల్లో గెలిచిన తర్వాత కంచుకోట అయిన గజ్వేల్‌ను వదులుకోవడానికి కేసీఆర్‌కు మనసొప్పకపోతే.. కామారెడ్డి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి తీరాల్సిందే. ఉపఎన్నిక వస్తే ఎవర్ని బరిలోకి దింపుతారు..? మళ్లీ గంప గోవర్ధన్‌కే (Gampa Govardhan) టికెట్ ఇస్తారా..? లేకుంటే వేరే వ్యక్తికి సీటిస్తారా అనేది ప్రశ్నార్థకమే. అయితే బీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. కామారెడ్డిని వదిలేయాల్సి వస్తే.. కచ్చితంగా గోవర్ధన్‌కే టికెట్ ఇచ్చి గెలిపించుకొని తనకోసం సీటును త్యాగం చేసిన ఆయన్ను కేబినెట్‌లోకి కూడా తీసుకుంటారట. ఒకవేళ కామారెడ్డిని వదలని పక్షంలో గోవర్ధన్‌ను ఎమ్మెల్సీని చేసి శాసనమండలికి పంపిస్తారట. అంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మంత్రి.. టికెట్ లేకపోతే ఎమ్మెల్సీ.. ఏదైనా సరే అసెంబ్లీలోనే గంప గోవర్ధన్ ఉంటారన్న మాట. గజ్వేల్, కామారెడ్డికి సంబంధించి ఈ విషయాలే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాగా.. గజ్వేల్ నుంచి ఈసారి బీజేపీ నుంచి మాజీ మంత్రి, సీనియర్ నేత ఈటల రాజేందర్ (Etela Rajender) పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇందుకు ఢిల్లీ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఇక కామారెడ్డిలో కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ (Mohammed Ali Shabbir) పోటీచేస్తారని టాక్ నడుస్తోంది. 2014 ఎన్నికల్లో 18,683 ఓట్లు.. 2018 ఎన్నికల్లో 5,007 ఓట్ల తేడాతో గంప గోవర్ధన్‌పై షబ్బీర్ అలీ ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో అటు గజ్వేల్ నుంచి ఇటు కామారెడ్డి నుంచి కేసీఆర్‌పై ఎవరు పోటీచేస్తారు..? కేసీఆర్ గెలిచాక ఏం చేస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.