Telangana Election2023: ఈసారి తెలంగాణ ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించేది వీళ్లేనా?.. తెగ పాకులాడుతున్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ..
ABN , First Publish Date - 2023-05-08T17:44:29+05:30 IST
తెలంగాణలోని రాజకీయ పక్షాలు అనుసరిస్తున్న సరళిని గమనిస్తే పార్టీలన్నీ ఒక వర్గం ఓట్లపై ఫుల్ ఫోకస్ చేసినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ వర్గం ఓటర్లు తమవైపు ఉంటే అధికారాన్ని సులభంగా హస్తగతం చేసుకోవచ్చని నేతలు భావిస్తున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రం (Telangana) ఏర్పడ్డాక ముచ్చటగా మూడోసారి ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు (Assembly election) జరగబోతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకున్న బీఆర్ఎస్ (BRS) హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్న కాంగ్రెస్ (Congress party) ఈసారి ఎలాగైనా గద్దెనెక్కాలని పట్టుదలతో ఉంది. ఇక కుటుంబ పార్టీలను పక్కకునెట్టి డబుల్ ఇంజన్ సర్కారును తీసుకొస్తామని బీజేపీ (BJP) ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రధాన పార్టీలే కాదు.. చిన్నాచితకా పార్టీలు సైతం వీలైనన్ని సీట్లు గెలిచి ప్రభుత్వ ఏర్పాటులో చక్రం తిప్పాలని లెక్కలు వేసుకుంటున్నాయి. మొత్తంగా 6 నెలల ముందే తెలంగాణలో ఎన్నికల (Telangana Election) హడావుడి మొదలైంది. ఇప్పటికే పార్టీలన్నీ క్రియాశీలకమయ్యాయి. కేడర్‌ను ఉత్తేజపరిచే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో రాజకీయ పక్షాలు అనుసరిస్తున్న సరళిని గమనిస్తే ఒక వర్గం ఓట్లపై పార్టీలు ఫుల్ ఫోకస్ చేసినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ వర్గం ఓటర్లు తమవైపు ఉంటే అధికారాన్ని సులభంగా హస్తగతం చేసుకోవచ్చని నేతలు భావిస్తున్నట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. మరి రాబోయే తెలంగాణ ఎన్నికల్లో అత్యంత కీలకమవబోతున్న ఆ వర్గం ఓటర్లు ఎవరు?. వారి ఓట్ల కోసం పార్టీల పాకులాటలు ఏమిటి?... అనే ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో గమనిద్దాం...
ఓటు విషయంలో కాస్తా కూస్తో అవగాహనతో స్వతహాగా నిర్ణయం తీసుకునే వర్గాల్లో యువతరం కూడా ఉంటుందనడంలో అతిశయోక్తిలేదు. ముఖ్యంగా నిరుద్యోగులు, నిరాశకు గురయ్యే యువత నిక్కచ్చిగా ఓట్లు వేస్తారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ కారణంగానే యువ ఓటర్ల మద్ధతున్న పార్టీలకు ఎన్నికల బరిలో అడ్వాంటేజ్ ఉంటుందనేది కాదనలేని వాస్తవం. ఈ విషయాన్ని గట్టిగా విశ్వసిస్తున్న తెలంగాణ రాజకీయ పక్షాలు ఇప్పటికే యువతను తమవైపు ఆకర్షించే ప్రయత్నాలను మొదలుపెట్టాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ యువతకు హామీల భరోసా ఇవ్వడం ఇప్పటికే మొదలుపెట్టేశాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అని తేడా లేకుండా పార్టీలన్నీ ఈ విషయంలో దూసుకెళ్తున్నాయి.
నిరుద్యోగుల ఓట్లే లక్ష్యంగా...
రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న నిరుద్యోగులు, యువత ఓట్లే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలను సిద్ధం చేసింది. ఈ మేరకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అన్ని పార్టీల కంటే ముందుగానే ‘యూత్ డిక్లరేషన్’ను ఆ పార్టీ ప్రకటించింది. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఆవిష్కరించిన ఈ డిక్లరేషన్ ద్వారా యువతరం ఓట్లు కొల్లగొట్టాలని యోచిస్తోంది. నిరుద్యోగ యువతకు భృతిని అందజేస్తామని ప్రకటించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో 1.93 లక్షల ఉద్యోగాలు ఖాళ్లీగా ఉన్నట్టు చెబుతున్న ఈ పార్టీ.. అధికారంలోకి రాగానే విడతల వారీగా ఖాళ్లీలను భర్తీ చేస్తామని చెబుతోంది. జాబ్ క్యాలెండర్ ప్రకటించి దాని ప్రకారం నియామకాలు జరుపుతామని వాగ్ధానం చేస్తోంది. ఉద్యోగ నియామకాలను ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తామని హామీ ఇస్తోంది. మరోవైపు బీజేపీ కూడా యువ ఓటర్లపై గట్టిగానే ఫోకస్ పెట్టింది. 2 లక్షల ఖాళ్లీలను నియమిస్తామని ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. ఉద్యోగాల నియామకాల కోసం యూపీఎస్సీ తరహాలో ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తామని ఆ పార్టీ చెబుతోంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం, నిరుద్యోగ భృతి హామీ విషయంలో బీఆర్ఎస్ మాట తప్పడం తమకు సానుకూలమవుతాయని కాంగ్రెస్, బీజేపీలు లెక్కలు వేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని యువత దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయి.
బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో?
యువత ఓట్ల విషయంలో బీఆర్ఎస్ కూడా చేయాల్సిన ప్రయత్నాలను చేస్తోంది. ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజం లేదని, పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆ పార్టీ చెబుతోంది. అయితే 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ ఆ పార్టీకి మైనస్‌గా మారొచ్చనే విశ్లేషణలున్నాయి. ఒక్కో నిరుద్యోగికి రూ.3016 నిరుద్యోగ భృతి ఇస్తామని 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ఆ పార్టీ పొందుపరచింది. కానీ ఆచరణ చేయకపోవడం పెద్ద మైనస్‌గా ఉంది. మరోవైపు ఇటివల వెలుగుచూసిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ నుంచి టెన్త్ పేపర్ లీక్ పరిణామాలు బీఆర్ఎస్‌కు మైనస్‌గా మారతాయనే అంచనాలున్నాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేటు పెట్టుబడుల ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వచ్చేలా చేస్తున్నామని బీఆర్ఎస్ సర్కారు చెప్పుకుంటోంది. ప్రధాన పార్టీలతోపాటు చిన్నపార్టీలు కూడా యువత ఓట్లు ఆకర్షించేందుకు తమదైన శైలిలో ప్రచారం మొదలుపెట్టాయి. మరి వచ్చే ఎన్నికల నాటికి యువత ఓట్లే లక్ష్యంగా పార్టీలు ఇంకెన్ని ఎత్తులు వేస్తాయి?, నిరుద్యోగులు, యువతరం ఓట్లు ఏ పార్టీకి పడతాయనేది వేచిచూడాల్సి ఉంది.