AP Politics : వీడియోతో చిక్కుల్లో పడిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. వారం రోజుల్లో ఏం జరుగుతుందో..!?
ABN , First Publish Date - 2023-05-04T16:05:52+05:30 IST
జనసేన (Janasena) తరఫున గెలిచి వైసీపీకి (YSRCP) అనుబంధంగా పనిచేస్తున్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (Rapaka Varaprasad) చిక్కుల్లో పడ్డారు. గతంలో..
జనసేన (Janasena) తరఫున గెలిచి వైసీపీకి (YSRCP) అనుబంధంగా పనిచేస్తున్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (Rapaka Varaprasad) చిక్కుల్లో పడ్డారు. గతంలో తాను దొంగ ఓట్లతో గెలిచానని బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ వీడియోపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (State Election Commission) కోరారు. రాపాకపై రాజోలుకు (Rajole) చెందిన ఎనుముల వెంకటపతిరాజు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అంతర్వేది దేవస్ధానం గ్రామంలో ఈ ఏడాది మార్చి 24న రాపాక ఎన్నికల అక్రమాలను అంగీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను ఎన్నికల్లో గెలిచేందుకు భారీగా దొంగ ఓట్లు వేశారని పేర్కొన్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియో ఆధారం తన వద్దకు వచ్చినందున ఈ ఫిర్యాదుపై సమగ్ర రిపోర్టు ఇవ్వాలని డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్‌కు ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. వారం రోజుల్లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌కు రాసిన లేఖలో ఉంది. అయితే.. ఇప్పుడీ వ్యవహారంలో రాపాక ఏం చేయబోతున్నారనే దానిపై ఆయన అభిమానులు, అనుచరుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇంతకీ రాపాక ఏమన్నారో..!
ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాపాకను టీడీపీ ఉండి ఎమ్మెల్యే రామరాజు కొనబోయారని స్వయంగా ఎమ్మెల్యేనే చెప్పడంతో పెద్ద రచ్చే జరిగింది. సరిగ్గా ఇదే టైమ్‌లోనే రాపాక నోటి నుంచి దొంగ ఓట్ల వ్యవహారం బయటికొచ్చింది. దీంతో ఈ రెండూ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తాను గెలవడానికి దొంగ ఓట్లే కారణంమని ఒప్పుకున్నారు. వరప్రసాద్‌కు తన సొంత గ్రామం చింతలమోరిలో అభిమానుల ఆత్మీయ సమావేశంలో రాపాక గుట్టు విప్పారు. అభిమానులు, స్నేహితులను చూసిన రాపాక... తన మనసులోని మాటను బయటపెట్టారు. అది కూడా సొంతూరిలోనే తనకు దొంగ ఓట్లు వేశారని చెప్పడం గమనార్హం. ‘చింతలమోరిలో మా ఇంటి దగ్గర బూత్‌లో కాపుల ఓట్లు ఉండవు. అన్నీ ఎస్సీల ఓట్లే ఉంటాయి. ఎవరో ఎవరికీ తెలిదు. సుభాష్‌తో పాటు వీళ్లంతా జట్టుగా వచ్చి ఒక్కక్కరు దొంగ ఓట్లు వేసి వెళ్లిపోయేవాళ్లు. పదిహేను, ఇరవై మంది వచ్చేవాళ్లు, ఒక్కొక్కరు పదేసి ఓట్లు వేసేవాళ్లు. ఏకంగా ఈ ఓట్ల వల్ల 800 ఓట్ల వందల మెజార్టీ వచ్చింది’ అని రాపాక తన గెలుపు రహస్యాన్ని బట్టబయలు చేశారు.
మొత్తానికి చూస్తే.. తన నోటి దురుసుతో రాపాక చిక్కుల్లో పడ్డారని ఆయన అభిమానులే మండిపడుతున్నారు. అయితే ఇప్పుడు జిల్లా కలెక్టర్ అసలేం జరిగింది..? రాపాక మాటల్లో నిజమెంత..? ఇలా అన్ని విషయాలను నిశితంగా పరిశీలించి ఎన్నికల కమిషన్‌కు నివేదిక అందజేయాల్సి ఉంది. ఈ నివేదికను బట్టి రాపాకపై ఈసీ చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. నివేదిక ఎలా ఉంటుందో..? నివేదిక ఇచ్చిన తర్వాత ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఏంటో తెలియాలంటే మరో వారం రోజులు వేచి చూడాల్సిందే మరి.