AP Politics: బండి సంజయ్‌ ఎంట్రీతో బీజేపీ వైఖరిలో మార్పు వస్తుందా?

ABN , First Publish Date - 2023-08-19T18:15:33+05:30 IST

తెలంగాణ మాజీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ త్వరలో ఏపీ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయబోతున్నారు. ఈ నెల 21న ఆయన అమరావతి పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఏపీలో ఓటర్ నమోదు ప్రక్రియను బండి సంజయ్ స్వయంగా సమీక్షించనున్నారు. అయితే బండి రాకతో ఏపీలో బీజేపీ పరిస్థితిలో మార్పు వస్తుందా అని ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు.

AP Politics: బండి సంజయ్‌ ఎంట్రీతో బీజేపీ వైఖరిలో మార్పు వస్తుందా?

ప్రస్తుతం ఏపీలో బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంది. 2014 ఎన్నికల సమయంలో సాక్షాత్తూ ప్రధాని మోదీ వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొనప్పుడు.. బీజేపీకి ఏపీలో కొంచెం బలం చేకూరినట్టయ్యింది. ప్రత్యేక హోదా తప్పకుండా ఇస్తామని మోదీ మాటివ్వడంతో.. జనాల్లో బీజేపీపై ఎనలేని నమ్మకం ఏర్పడింది. కానీ.. సంవత్సరాలు గడిచేకొద్దీ ఆ హామీని నెరవేర్చకపోవడంతో, ఉన్న కాస్తో కూస్తో పరువు కూడా గంగలో కలిసిపోయింది. మోదీ ఏదో చేస్తారని ఆశిస్తే పెద్ద పంగనామాలు పెట్టాడంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలకు గురయ్యారు. క్రమంగా అది బీజేపీపై ద్వేషం పెరిగేలా చేసింది. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే.. ఏపీలో బీజేపీ ఉనికి ఉందా? అని చర్చించుకునే స్థాయికి చేరింది.

ప్రత్యేక హోదా ఇస్తామని మాట తప్పడం, రాజధాని నిర్మాణానికి సరైన స్థాయిలో నిధులు ఇవ్వకపోవడం, పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం వంటి అంశాల కారణంగా బీజేపీ నానాటికీ బలహీనపడుతోంది. దీంతో ఇటీవల బీజేపీ అధ్యక్షుడిని అధిష్టానం మార్చింది. అధికార పార్టీతో కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో సోము వీర్రాజు నుంచి దగ్గుబాటి పురంధేశ్వరికి బీజేపీ అధిష్టానం అధ్యక్ష పదవిని కట్టబెట్టింది. అయితే తాజాగా మరో ముందడుగు వేసింది. తెలంగాణలో బీజేపీకి ఊపిరి పోసిన బండి సంజయ్‌ను నమ్ముకుంది. ఆయన సేవలను ఏపీలోనూ వాడుకోవాలని నిర్ణయం తీసుకుని కీలక బాధ్యతలను అధిష్టానం అప్పగించింది.


తెలంగాణ మాజీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ త్వరలో ఏపీ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయబోతున్నారు. ఈ నెల 21న ఆయన అమరావతి పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఏపీలో ఓటర్ నమోదు ప్రక్రియను బండి సంజయ్ స్వయంగా సమీక్షించనున్నారు. అయితే బండి రాకతో ఏపీలో బీజేపీ పరిస్థితిలో మార్పు వస్తుందా అని ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఇప్పటివరకు అధికార పార్టీ వైసీపీపై పైకి ఆరోపణలు చేస్తున్నా.. అంతర్గతంగా ఆ పార్టీకి సహరించేలా వ్యవహరిస్తోందనే టాక్ బలంగా ఉంది. ఇచ్చినమ్మ వాయనం.. పుచ్చికుంటినమ్మా వాయనం అన్న తరహాలో రెండు పార్టీలు పరస్పరం సహకారం అందించుకుంటున్నాయి. అధికారికంగా జనసేనతో పొత్తులో ఉన్నా పరోక్షంగా వైసీపీకి బీజేపీ అధిష్టానం సహకరిస్తుందన్న ఆరోపణలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి వైసీపీ-బీజేపీ మైత్రిబంధం బహిర్గతం అవుతూనే ఉంది. మరి ఇప్పుడు బండి సంజయ్ ఎంట్రీతో బీజేపీ వైఖరిలో మార్పు వస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలో కేసీఆర్‌కు మాటకు మాట చెప్పడంలో బండి సంజయ్ ఆరి తేరారు. దుబ్బాక, హుజురాబాద్ వంటి ఉపఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం బండి సంజయ్ ఎంతో కృషి చేశారు. అధికార పార్టీపై మాటల యుద్ధం, బీఆర్ఎస్ నేతలకు కౌంటర్లు ఇవ్వడంలో బండి సంజయ్‌ది ప్రత్యేక శైలి అని చెప్పవచ్చు. పదునైన వ్యాఖ్యలతో ప్రత్యర్థులపై బండి సంజయ్ విరుచుకుపడుతూ ఉంటారు. ప్రత్యర్థులపై విమర్శలు చేయడంలో తన వాయిస్ బలంగా వినిపిస్తుంటారు. దీంతో బండి సంజయ్ రాకతో ఏపీలోనూ పొలిటికల్ హీట్ పెరుగుతుందన్న అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నాయి. వీళ్లకు బీజేపీ కూడా కలిస్తే వైసీపీకి దబిడి దిబిడే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కనీసం అసెంబ్లీ సీట్లపై కాకున్నా లోక్‌సభ సీట్లను గెలుచుకోవడానికి బండి సంజయ్ వాయిస్ సహాయం చేస్తుందని ఏపీ బీజేపీ నేతలు భావిస్తున్నారు. బండి సంజయ్‌కు ఉన్న మాస్ ఫాలోయింగ్ దృష్ట్యా లోక్‌సభ స్థానాల్లో పార్టీ బలోపేతానికి ఆయనను బీజేపీ ఉపయోగించుకోనున్నట్లు సమాచారం అందుతోంది. మరి ఏపీ రాజకీయాల్లో బండి సంజయ్ ఎలాంటి ముద్ర వేస్తారో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

Ambati Rambabu: వైఎస్ఆర్ మద్యపాన నిషేధం చేశారా? తాగి మాట్లాడుతున్నారా?

**********************************************************************************************

AP Politics: ప్రజల నెత్తిన వైసీపీ బోగస్ సర్వేలు.. అంత భయం ఎందుకో?

Updated Date - 2023-08-19T18:15:33+05:30 IST