Karnataka Election Results : కర్నాటక ‘హస్త’గతం.. ఏదో అనుకున్న కేసీఆర్ ఇప్పుడెలా ఫీలవుతున్నారో..!?
ABN , First Publish Date - 2023-05-13T14:18:30+05:30 IST
కర్ణాటక (Karnataka) ‘హస్త’గతమైంది..! ఆహా, ఓహో అన్న కమలం అడ్రస్ లేకుండా పోయింది..! కౌంటింగ్ ప్రారంభమైనప్పట్నుంచీ కాంగ్రెస్ (Congress) హవా కొనసాగుతూనే ఉంది..
కర్ణాటక (Karnataka) ‘హస్త’గతమైంది..! ఆహా, ఓహో అన్న కమలం అడ్రస్ లేకుండా పోయింది..! కౌంటింగ్ ప్రారంభమైనప్పట్నుంచీ కాంగ్రెస్ (Congress) హవా కొనసాగుతూనే ఉంది.. బీజేపీ (BJP) అగ్రనేతలు, కీలక మంత్రులు కూడా కొందరు ఓడిపోగా, మరికొందరు అదే బాటలోనే ఉన్నారు.. ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ పరిస్థితి అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి అన్నట్లుగా మారిపోయింది. కర్ణాటకలో గెలిచి దక్షిణాదిన కమలాన్ని వికసింపజేయాలని భావించిన కమలనాథులు (BJP Leaders) ఇప్పుడు మిన్నకుండిపోయారు. కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటగానే గల్లీ నుంచి ఢిల్లీ (Delhi) వరకూ ఎక్కడ చూసినా నేతలు, కార్యకర్తలు, వీరాభిమానులు స్వీట్లు పంచుకుని.. బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు. అయితే బీజేపీ కార్యాలయాల్లో స్వీట్లు, బాణాసంచాలు సిద్ధం శుక్రవారం నాడే సిద్ధం చేసుకున్నప్పటికీ ఏం చేయాలో తెలియని పరిస్థితట. ఇక అసలు విషయానికొస్తే.. కన్నడనాట కాంగ్రెస్ గెలుపుతో తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) ఏం చేస్తున్నారు..? గులాబీ బాస్ ముఖచిత్రమేంటి..? ఇంతకీ ఈ గెలుపును కేసీఆర్ ఎంజాయ్ చేస్తున్నారా..? లేదా..? అని తెలుసుకోవడానికి జనాలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంతకీ సార్ ఎలా ఫీలవుతున్నారనే విషయాలపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..
పరిస్థితి ఏమిటో..!
కన్నడనాట కాంగ్రెస్ పక్కాగా గెలుస్తుందన్నది ఎన్నికల ముందు నుంచే వస్తున్న టాక్. పోలింగ్‌కు ముందు.. ఆ తర్వాత వచ్చిన సర్వేలు సైతం చాలా వరకు కాంగ్రెస్ గెలుస్తుందనే చెప్పాయి. అయితే.. ఆ అంచనాలకు మించి కాంగ్రెస్ 130 సీట్లతో దూసుకెళ్తోంది. కర్ణాటకలో మొదలై దక్షిణాదిన పాగా వేయాలని భావించిన బీజేపీకి కాంగ్రెస్‌లో సగం సీట్లలో కూడా గెలిచే పరిస్థితులు లేకపోవడం గమనార్హం. ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ (PM Modi), కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah).. తెలంగాణ నుంచి బండి సంజయ్ (Bandi Sanjay), ఈటల రాజేందర్ (Etela Rajender) లాంటి పెద్ద తలకాయలు కర్ణాటకకు వెళ్లి ప్రచారం చేసినచోటే దాదాపు బీజేపీ అభ్యర్థులు ఓడిపోవడం కాంగ్రెస్‌కు మంచి కిక్కిచ్చే పరిణామమేనని చెప్పుకోవచ్చు. అంతేకాదు.. తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దింపడానికి రాష్ట్ర నేతలు మొదలుకుని ఢిల్లీ పెద్దల వరకూ విశ్వప్రయత్నాలే చేస్తున్నారు. ఒక్క కర్ణాటకలో గెలిస్తే ఇక దక్షిణాదిన తిరుగుండదు.. ఇక కమల వికాసమే అని భావించారు. కర్ణాటక తర్వాత బీజేపీ టార్గెట్ తెలంగాణ అని కూడా ఓ రేంజ్‌లో కమలనాథులు ప్రచారం చేసుకున్నారు. అయితే కర్ణాటక దగ్గరే నేతలకు స్పీడ్ బ్రేకర్ పడింది. ఈ పరిస్థితులన్నింటినీ నిశితంగా గమనిస్తున్న సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేస్తున్నారట. ఎందుకంటే.. శత్రువు ఓటమి.. పైగా తనను టార్గెట్ చేసిన పార్టీ ఘోరంగా ఓడిపోవడం అనేది ఎవరికైనా మంచి సంతోషాన్నిచ్చే విషయమే..!. బీజేపీ ముక్త భారత్ కోసం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు.. అందుకే టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి మోదీపై యుద్ధానికి సిద్ధమంటూ కాలు దువ్వుతున్నారు. అంతేకాదు తనతో వచ్చే పార్టీలను, ముఖ్యమంత్రులను కలుపుకొని మరీ ముందుకెళ్తున్నారు. ఇందుకోసం దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు.. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సభలు, సమావేశాలు కూడా నిర్వహించారు. ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటకలో ఎన్నికలు రావడం, అది కూడా బీజేపీ ఎదురుగాలి వీయడం కేసీఆర్‌కు సంతోషం కలిగించే విషయమేనని బీఆర్ఎస్ వర్గాలు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కేసీఆర్ ఏం చేయబోతున్నారు..!?
కన్నడనాట కాంగ్రెస్ గెలిచింది కదా అని కేసీఆర్.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం గానీ, దేశ రాజకీయాల్లో కలిసి ముందుకెళ్తారా..? అనేది ఇప్పుడు క్లారిటీ రావాల్సిన విషయం. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు ఒకరిద్దరూ పొత్తుపై మాట్లాడటం, అవసరమైతే బీఆర్ఎస్ కలుస్తామని ప్రకటనలు చేయడం రచ్చ రచ్చయ్యింది. అంతేకాదు.. అదే పరిస్థితి వస్తే తాను టీపీసీసీ చీఫ్‌గా వైదొలుగుతానని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో, దేశంలో బీజేపీని ఎదుర్కోవడానికి కేసీఆర్ ఏం చేయబోతున్నారు..? అనేదానిపై సర్వత్రా ఆసక్తే నెలకొంది. బహుశా రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు కానీ.. దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పాలంటే మాత్రం కచ్చితంగా కాంగ్రెస్‌తో కలిసే అడుగులు వేయాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు.. కర్ణాటకకు వెళ్లి జేడీఎస్ (JDS) తరఫున ప్రచారం చేసి.. కుమారస్వామికి (Kumara Swamy) సాయం చేయాలని భావించిన కేసీఆర్ ఈ ఫలితాలు ముందే ఊహించే వెళ్లలేదనే టాక్ కూడా నడుస్తోంది. పైగా.. కింగ్ మేకర్ అవుతానని అనుకున్న కుమారన్న కూడా బొక్కబోర్లాపడ్డారు..!. ఏదేమైనా ప్రచారానికి పోకపోవడమే తమకు మంచిదే అయ్యిందని బీఆర్ఎస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ గెలుపును హ్యాపీగా ఫీలవుతున్న కేసీఆర్.. శనివారం సాయంత్రం లేదా ఆదివారం నాడు ప్రత్యేకంగా మీడియా మీట్ నిర్వహించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ మునుపటితో పోలిస్తే పుంజుకుందన్నది. ఒకవేళ మీడియా ముందుకొస్తే ఆయన బీజేపీ, కాంగ్రెస్ గురించి ఏం మాట్లాడతారు..? కాంగ్రెస్‌ను శభాష్ అని మెచ్చుకుంటారా..? లేకుంటే బీజేపీ గురించే మాట్లాడి చేయాల్సిన విమర్శలు చేసి మిన్నకుండిపోతారా అనేది వేచి చూడాల్సిందే మరి.