Mancherial: నియోజకవర్గంలో ఏకమవుతున్న బీసీ నేతలు..రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో..!?

ABN , First Publish Date - 2023-03-15T09:07:04+05:30 IST

మంచిర్యాల నియోజకవర్గం గతంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ పరిధిలో లక్షెట్టిపేట పేరుతో ఉండేది. లక్షెట్టిపేట నియోజకవర్గం...

Mancherial: నియోజకవర్గంలో ఏకమవుతున్న బీసీ నేతలు..రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో..!?

మంచిర్యాలలో బీసీ ఎమ్మెల్యే నినాదం మరోసారి తెరపైకి వస్తోంది. మెజారిటీ ఓటర్లు బీసీలే ఉన్నప్పటికీ.. దశబ్దాల నుంచి రాజకీయ ప్రాధాన్యం దక్కడం లేదన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ సారైనా ఏకమై బీసీ ఎమ్మెల్యేను ఎన్నుకునేందుకు సిద్ధమవుతున్నారు. అన్ని పార్టీల్లోని బీసీ నేతలు రహస్య సమావేశాలు పెట్టుకోవడం మంచిర్యాలలో రాజకీయంగా హీట్‌ పెంచుతోంది. అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-14000.jpg

ప్రధాన పార్టీల బీసీ నేతలు కార్యాచరణ

మంచిర్యాల నియోజకవర్గం గతంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ పరిధిలో లక్షెట్టిపేట పేరుతో ఉండేది. లక్షెట్టిపేట నియోజకవర్గం మొదటిసారిగా 1952లో ఏర్పడింది. అప్పటినుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల వరకు సుమారు 70 సంవత్సరాల్లో ఒకే ఒకసారి బీసీ అభ్యర్థి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక గత పరిస్థితులు ఎలా ఉన్నా.. 2014లో నడిపెల్లి దివాకర్‌రావు కాంగ్రెస్‌ను వీడి.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత.. గత ఎన్నికల్లోనూ దివాకర్‌రావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే.. రాబోయే ఎన్నికల్లో వెనుకబడ్డ కులాలకు చెందిన వారికే టిక్కెట్ దక్కేలా ప్రధాన పార్టీల బీసీ నేతలు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఏ పార్టీ ముందుగా బీసీ అభ్యర్థిని ప్రకటిస్తుందో వారిని మాత్రమే గెలిపించేలా బీసీ సామాజికవర్గాలను సమీకరిస్తున్నారు.

Untitled-150.jpg

ఒకట్రెండు సామాజికవర్గాల లీడర్లే ఎమ్మెల్యేలు

వాస్తవానికి... మంచిర్యాల నియోజకవర్గ జనాభాలో 60 శాతం బీసీలే ఉన్నారు. జనాభా ప్రాతిపదికన చూసినా.. బీసీ ఓటర్లే అధికంగా ఉండడంతో వచ్చే ఎన్నికల్లో ఆ సామాజిక వర్గ నేతలకే టికెట్‌ ఇచ్చేలా అన్ని రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చేందుకు సమాలోచనలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు మంచిర్యాల నుంచి ఒకట్రెండు సామాజికవర్గాల లీడర్లే ఎమ్మెల్యేలు అయ్యారు. ప్రతి ఎన్నికలోనూ వెలమలు, రెడ్లు మాత్రమే ఎన్నికయ్యారు. స్థానికంగా బీసీ ఓటర్లు కీలకంగా ఉన్నప్పటికీ.. రెండు సామాజిక వర్గాల నాయకులే ఎన్నికవ్వడంపై ప్రస్తుతం బీసీ నాయకులు గుర్రుగా ఉన్నారు. బీసీల పట్ల రాజకీయ పార్టీలు చిన్నచూపు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో బీసీలకే టికెట్లు ఇవ్వాలనే డిమాండ్‌తో పార్టీలకు అతీతంగా లీడర్లు ఏకమవుతున్నారు. గత నెలలో బీఆర్ఎస్‌కు చెందిన బీసీ లీడర్లు మంచిర్యాలలో రహస్యంగా సమావేశం అయినట్లు తెలుస్తోంది. ఇటీవల బీసీ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్​మీటింగ్ కూడా నిర్వహించారు.

Untitled-1300.jpg

బీసీలకే టికెట్లు ఇవ్వాలంటూ పాదయాత్రలు

ఇక.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ మంచిర్యాల నియోజకవర్గంలో బీసీ నినాదం తెరపైకి వచ్చింది. అన్ని పార్టీలు బీసీలకే టికెట్లు ఇవ్వాలంటూ నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించారు. ప్రత్యేక కమిటీలు వేసుకుని బీసీలకే మద్దతు ఇవ్వాలంటూ తీర్మానాలు కూడా చేశారు. తీరా.. ఎన్నికల సమయం దగ్గరపడ్డాక బీసీ నినాదం మరుగునపడింది. నియోజకవర్గంలో 2.42 లక్షల మంది ఓటర్లకు గాను.. సుమారు లక్షా 65వేల మంది బీసీలు ఉన్నారు. ఎస్సీల ఓట్లు 55 వేల వరకూ ఉండగా.. 15 వేలు ఎస్టీలు, మరో 15 వేలు క్రిస్టియన్ ఓటర్లున్నారు. ఇక.. రెడ్డి ఓటర్లు సుమారు 6వేలు కాగా.. వెలమ ఓట్లు 2వేలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ క్రమంలోనే.. ఓ ప్రధాన జాతీయ పార్టీ ఈ సారి బీసీల వైపు మొగ్గు చూపుతున్నట్టు టాక్‌ నడుస్తోంది.

Untitled-1200.jpg

అగ్రవర్ణాలకు టికెట్లు ఇస్తే ఓడిస్తామని వార్నింగ్‌

ఇదిలావుంటే... ఇప్పటికే ఆదిలాబాద్‌లో బీసీ ఎమ్మెల్యే జోగు రామన్న బీఆర్ఎస్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్, బీజేపీ కూడా బీసీ అభ్యర్థులను సిద్ధం చేస్తున్నాయి. రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్న నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లోనూ బీసీ సమీకరణలు జరుగుతున్నాయి. మొత్తంగా.. అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలను అన్ని రాజకీయ పార్టీలు చిన్నచూపు చూస్తున్నాయనే కామెంట్స్‌ జోరుగా వినిపిస్తున్నాయి. బీసీల ఓట్లతో గెలిచిన నేతలు.. ఆ సామాజికవర్గాలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అగ్రవర్ణాలకు టికెట్లు ఇస్తే ఓడిస్తామని బీసీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. మంచిర్యాల నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.

Updated Date - 2023-03-15T09:07:04+05:30 IST