TS Elections : బీజేపీకి బిగ్ షాక్.. కేటీఆర్ ఆహ్వానంతో బీఆర్ఎస్‌లోకి సీనియర్ నేత..!
ABN , First Publish Date - 2023-11-02T23:00:20+05:30 IST
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత మొదలైన కమలనాథుల రాజీనామాలు.. నేటి వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. బీజేపీ అభ్యర్థుల జాబితా ప్రకటన వచ్చేసరికి టికెట్లు ఆశించిన, అసంతృప్తులు ఒక్కొక్కరుగా కమలం పార్టీకి గుడ్ బై చెప్పేసి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో చేరిపోతున్నారు...
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత మొదలైన కమలనాథుల రాజీనామాలు.. నేటి వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. బీజేపీ అభ్యర్థుల జాబితా ప్రకటన వచ్చేసరికి టికెట్లు ఆశించిన, అసంతృప్తులు ఒక్కొక్కరుగా కమలం పార్టీకి గుడ్ బై చెప్పేసి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో చేరిపోతున్నారు. ఇప్పటి వరకూ పదుల సంఖ్యలో ముఖ్య నేతలు, సీనియర్లు కాషాయ పార్టీకి రాజీనామా చేశారు. మరోవైపు సీనియర్ నేతలు సైతం అదే బాట పడుతున్నారు. టికెట్లు ఆశించిన యువనేతలు అయితే తీవ్ర అసంతృప్తితో ఇక ఎప్పటికీ న్యాయం జరగదని భావించి కమలానికి కటీఫ్ చెప్పేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసినప్పటికీ టికెట్ ఇవ్వకపోగా.. కనీసం ఎందుకివ్వలేదో..? ఈ పరిస్థితి ఎందుకొచ్చింది..? అనే విషయాన్ని కనీసం పిలిపించి మాట్లాడే పరిస్థితి కూడా బీజేపీ అధిష్టానం లేదని సీనియర్ నేతలు రగిలిపోతున్నారు.
టికెట్ ఆశించి..!
ఇప్పటి వరకూ 88 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. ఈ రెండు జాబితాల్లోనూ తన పేరు లేకపోవడంతో ఖైరతాబాద్‌కు చెందిన సీనియర్ నేత పల్లపు గోవర్ధన్ రాజీనామా చేశారు. ఖైరతాబాద్ టికెట్ ఆశించి గోవర్ధన్ బంగపడ్డారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు. పల్లపు.. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన బలమైన బీసి నేత. ఆయన రాజీనామా చేసినట్లు తెలుసుకున్న బీఆర్ఎస్ కీలక నేతలు, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు పార్టీలోకి ఆహ్వానించారు. శుక్రవారం నాడు భారీ ర్యాలీతో తెలంగాణ భవన్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పల్లపు గోవర్ధన్.. గులాబీ కండువా కప్పుకోబోతున్నారు.
ఇక ఉండలేను!
మొత్తానికి చూస్తే.. ఈ ఎన్నికల్లో ఖైరతాబాద్‌లో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే పోరు ఉండనుంది. ఎందుకంటే.. గోవర్ధన్ కారెక్కితే ఖైరాతాబాద్‌లో బీజేపీ ఖాళీ అయినట్టేనని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్న పరిస్థితి. గోవర్ధన్ వెంట యువజన సంఘాలు, వడ్డెర, ఉప్పర ఇతర బీసి నేతలు ఉన్నారు. పైగా.. ఆర్ఎస్ఎస్, బీజేపీతో 22 ఏళ్ల అనుబంధం గోవర్ధన్‌కు ఉంది. పార్టీ మారినా.. హింధుత్వం, ధర్మం కోసం సంఘ్ స్పూర్తితో పని చేస్తానని చెబుతున్నారు. ఎన్నికల్లో నాలుగైదు సీట్లు గెలిచేందుకే బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బలహీన వర్గాలను పార్టీ నాయకత్వం మోసం చేస్తోందని గోవర్ధన్ ఆరోపించారు. పార్టీ కోసం సర్వం ధారపోసిన వారికి, బీసీలకు కనీస గౌరవం కూడా లేదని ఆయన చెబుతున్నారు. ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి ఇక బీజేపీలో ఉండటం ఆత్మహత్యతో సమానమని.. అగ్రకులాల చేతిలో బీజేపి బందీ అయ్యిందని పల్లపు గోవర్ధన్ చెప్పుకొచ్చారు.
నాడు.. నేడు..!
వాస్తవానికి.. గ్రేటర్ ఎన్నికల్లో ఖైరతాబాద్ టికెట్ ఆశించి విఫలమైన పల్లపు గోవర్ధన్ ఈసారి అసెంబ్లీ టికెట్ వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పార్టీ కార్యక్రమాలతోపాటు సొంత ఎజెండాను అమలు చేసేవారు. ఖైరతాబాద్‌లో నిర్వహించిన యువజన సమ్మేళనంతో అన్ని పార్టీలను ఆకట్టుకోగలిగారు. బీసీ, యూత్ విభాగంలో తనకు టికెట్ ఖాయం అని ఇన్నాళ్లు చెప్పుకున్నారు. శ్రీరామ నవమి శోభాయాత్ర గోవర్ధన్‌కు మంచి పేరు తెచ్చి పెట్టిందని అనుచరులు చెబుతుంటారు. ఆర్ఎస్ఎస్, బీజేపీతో 22 ఏళ్ల అనుబంధం గోవర్ధన్‌ను పట్టించుకోకపోవడంతో ఇక పార్టీలో ఉండకూడదని రాజీనామా చేసి బయటికొచ్చేశారు. బీఆర్ఎస్‌లో చేరితో ఏ మాత్రం నేతలు ఆదరిస్తారో చూడాలి మరి.