AP BJP : కన్నాపై బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్.. రంగంలోకి కీలక నేత.. పార్టీ మారకుండా ఉండేందుకు..!

ABN , First Publish Date - 2023-01-27T16:45:32+05:30 IST

ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ (Kanna Lakshmi Narayana) కమలం పార్టీకి దూరమవుతున్నారనే వార్తలతో అధిష్టానం అలర్ట్ అయ్యిందా..?

AP BJP : కన్నాపై బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్.. రంగంలోకి కీలక నేత.. పార్టీ మారకుండా ఉండేందుకు..!

ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ (Kanna Lakshmi Narayana) కమలం పార్టీకి దూరమవుతున్నారనే వార్తలతో అధిష్టానం అలర్ట్ అయ్యిందా..? ఆయన వేరే పార్టీలోకి వెళ్లకుండా.. అసలు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారో తెలుసుకోవడానికి నేరుగా హైకమాండే (BJP High command) కీలక నేతను రంగంలోకి దించిందా..? రాష్ట్ర నేతలతో కన్నాకు పొసగట్లేదని.. నేరుగా జాతీయ స్థాయి నేతలే ఏపీకి వచ్చారా..? కన్నా ఎపిసోడ్‌లో మొదట్నుంచీ ఏమేం జరిగాయనే విషయాలపై ప్రత్యేక కథనం.

అసలేం జరిగింది..!

సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయాక మునుపటిలా పార్టీలో యాక్టివ్‌గా ఉండట్లేదు. ఇందుకు కారణం ప్రస్తుత అధ్యక్షుడు సోమువీర్రాజు (Somu Veerraju), పలువురు నేతలతో పొసగకపోవడమే. ఎప్పుడూ లేనంతగా బీజేపీ (BJP) జిల్లా అధ్యక్షుల మార్పు జరిగింది. దీన్ని కన్నా తీవ్రంగా తప్పుబట్టారు. కోర్ కమిటీలో చర్చ జరగకుండానే జిల్లా అధ్యక్షులను మార్చారని, అధ్యక్షుల మార్పుపై తనతో చర్చించలేదని సోము వీర్రాజు తీరును కన్నా బహిరంగంగానే తప్పుబట్టారు. తొలగించిన వాళ్లంతా తాను నియమించిన వారేనని కన్నా అప్పట్లో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. మరోవైపు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో (Janasena Chief) సోము.. సమన్వయం చేసుకోలేకపోతున్నారని కూడా ఓపెన్‌గానే విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. పార్టీలో అసలేం జరుగుతోందో అర్థం కావట్లేదని.. హైకమాండ్ రంగంలోకి తగు చర్యలు తీసుకోవాలని కూడా కోరారు కన్నా. దీంతో.. ఈ పరిస్థితులన్నీ కన్నా వర్సెస్‌ సోముగా మారిపోయాయి.

Kanna-Vs-Somu.jpg

జనసేనలో చేరతారని..!

కమలనాథులతో ఇలా వైరం కొనసాగుతుండగానే.. ఏపీలో పవన్‌ కల్యాణ్‌ను (Pawan Kalyan), తెలంగాణలో బండి సంజయ్‌ను (Bandi Sanjay) బలహీనపరిచేందుకు కుట్ర జరుగుతోందని కన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. పవన్‌కు అండగా నిలబడతానని కన్నా ప్రకటించడం అప్పట్లో ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చే జరిగింది. ఈ కామెంట్స్‌తో కన్నా బీజేపీకి గుడ్ బై చెప్పేసి.. జనసేన తీర్థం పుచ్చుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. రేపో.. మాపో పవన్‌తో నేరుగా కన్నా భేటీ అవుతారనే టాక్ కూడా నడిచింది. మరోవైపు.. బీజేపీపై గౌరవమున్నా ఊడిగం మాత్రం చేయనని పవన్‌ గతంలో చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికీ ఏపీ బీజేపీలో అడపాదడపా చర్చ నడుస్తూనే ఉంది. సరిగ్గా ఇదే సమయంలో కన్నా (Kanna) ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇక పార్టీ మార్పు తప్పదన్నట్లుగా చర్చ నడిచింది.

‘వారాహి’ వాహనం పూజా కార్యక్రమంలో భాగంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. కన్నా ఎక్కడున్నా గౌరవిస్తానని, ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడలేనన్నారు. అటు కన్నా అసంతృప్తిగా ఉండటం.. పవన్‌కు సపోర్టు చేస్తూ మాట్లాడటం.. ఇటు కన్నా పార్టీ మార్పుపై జనసేనాని కూడా రియాక్ట్ అవ్వడంతో ఈ వ్యవహారం అంతా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

హైకమాండ్ అలర్ట్!

ఏపీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ హైకమాండ్ ఆరా తీసింది. రాష్ట్రంలో బలపడాలని కమలనాథులు భావిస్తుంటే.. రెండ్రోజులకోసారి ఇలా గొడవలు జరుగుతుండటంతో లోపం ఎక్కడుందో తెలుసుకోవాలని ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగారు. ఏపీ ముఖ్య నేతలతో నివేదికలు తెప్పించుకుని మరీ.. కన్నా ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాలని భావించింది. ఈ క్రమంలో కన్నా వ్యవహారాన్ని బీజేపీ జాతీయ నేత శివప్రకాష్‌జీ కి.. (Sivaprakash Ji) హైకమాండ్ఈ బాధ్యతలు అప్పగించింది. దీంతో ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడకు (Vijayawada) వెళ్లి కన్నాతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఏపీ బీజేపీలో (AP BJP) అసలేం జరుగుతోంది..? అసంతృప్తికి కారణాలేంటి..? అధ్యక్షుడు మొదలుకుని మిగిలిన నేతలంతా ఏమేం చేస్తున్నారు..? పార్టీ పరిస్థితి ఎలా ఉందనే ఇలా ప్రతీవిషయాన్ని ప్రకాష్‌జీకి పూసగుచ్చినట్లుగా కన్నా వివరించబోతున్నారని తెలుస్తోంది.

ఇకనైనా మార్పు వచ్చేనా..!

ఢిల్లీ నుంచి వచ్చే ప్రకాష్.. హైకమాండ్ నుంచి శుభవార్త (Good News) మోసుకొస్తున్నారనే టాక్ కూడా నడుస్తోంది. ఆ శుభవార్తేంటనే సస్పెన్స్‌గా ఉందట. ఆ వార్త చెప్పాక కన్నా ఎలా రియాక్ట్ అవుతారు..? ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోందనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇక కన్నా చెప్పిన విషయాలన్నింటికీ ప్రకాష్‌జీ.. ఢిల్లీ పెద్దలకు చెప్పాక ఏపీ బీజేపీలో ఏమైనా మార్పులు, చేర్పులు జరుగుతాయా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి చూస్తే.. హైకమాండ్ మాత్రం కన్నా పార్టీ మార్పునకు అస్సలు ఒప్పుకోవట్లేదనే విషయం దీన్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. మరి కన్నా మనసులో ఏముందో.. భేటీ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

Updated Date - 2023-02-09T16:44:56+05:30 IST