BRS First List : మైనంపల్లిపై బీఆర్ఎస్ వేటు..? టికెట్ ప్రకటించాక ఇదేంటో..!?
ABN , First Publish Date - 2023-08-21T18:29:58+05:30 IST
మల్కాజిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావుపై (Mynampally Hanumantha Rao ) బీఆర్ఎస్ (BRS) వేటు వేయనుందా..? మంత్రి హరీష్ రావుపై (Minister Harish Rao) ఆయన చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుందా..?..
మల్కాజిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావుపై (Mynampally Hanumantha Rao ) బీఆర్ఎస్ (BRS) వేటు వేయనుందా..? మంత్రి హరీష్ రావుపై (Minister Harish Rao) ఆయన చేసిన వ్యాఖ్యలను అధిష్టానం సీరియస్‌గా తీసుకుందా..? ఇవాళ సాయంత్రం లేదా రేపటిలోపు మైనంపల్లిపై వేటు పడనుందా..? అంటే బీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. ప్రగతి భవన్ (Pragathi Bhavan) నుంచి సోమవారం సాయంత్రం లేదా మంగళవారం మధ్యాహ్నం అధికారికంగా వేటు వేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మంత్రి హరీష్ రావుపై మైనంపల్లి చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
టికెట్ ప్రకటించాక వేటు..?
కాగా.. ప్రగతి భవన్ వేదికగా సీఎం కేసీఆర్ 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా.. అందులో ఒకరు మైనంపల్లి హన్మంతరావు. మల్కాజిగిరి నుంచి మైనంపల్లికే టికెట్ ఇచ్చారు కేసీఆర్. అయితే.. టికెట్ ప్రకటించిన తర్వాత వేటు ఏంటనేది ఇప్పుడు మైనంపల్లి అభిమానులు, అనుచరుల నుంచి అధిష్టానానికి వస్తున్న ప్రశ్న. అయితే.. మైనంపల్లికి మల్కాజిగిరి.. ఆయన కుమారుడికి మైనంపల్లి రోహిత్‌కు మెదక్ నియోజకవర్గం నుంచి టికెట్లు ఆశించారు. అయితే హన్మంతరావుకు టికెట్ దక్కింది కానీ.. కుమారుడికి మెదక్ టికెట్ దక్కలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన పద్మా దేవేందర్ రెడ్డికి మళ్లీ టికెట్ కేటాయించారు కేసీఆర్. అంతేకాదు.. ప్రగతి భవన్ వేదికగా టికెట్ అయితే ఇస్తున్నామని.. పోటీ చేయడం, చేయకపోవడం అనేది మైనంపల్లి ఇష్టమని కేసీఆర్ ప్రత్యేకించి ప్రస్తావన తెచ్చి మరీ చెప్పారు. మొదట తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ ఆ తర్వాత మనసు మార్చుకున్న మైనంపల్లి మల్కాజిగిరి నుంచి పోటీచేస్తానని.. మెదక్‌లో పోటీ విషయం రోహిత్‌కే వదిలేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ ప్రకటన చేసిన తర్వాతే మల్కాజిగిరిలో అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు సంబరాలు చేసుకున్నారు.
కేటీఆర్ సీరియస్..!
ఈ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. మంత్రి హరీశ్‌రావుపై మైనంపల్లి అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనంపల్లి ప్రవర్తనను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్‌కు హరీశ్‌రావు ఒక మూలస్తంభం అని.. పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతో సేవ చేశారన్నారు. అందుకే హరీశ్‌రావుకు తామంతా అండగా ఉన్నామని కేటీఆర్ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌ను, ప్రగతి భవన్ వేదికగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. కచ్చితంగా మైనంపల్లిపై వేటు పడుతుందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే మైనంపల్లి వ్యాఖ్యలపై ఇంతవరకూ హరీష్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. ఒకవేళ వేటు వేస్తే అక్కడ్నుంచి ఎవర్ని బరిలోకి దింపుతారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి ప్రెస్‌మీట్‌లో ఈ జాబితానే ఫైనల్ కాదని.. మార్పులు, చేర్పులు ఇకముందు కూడా ఉండొచ్చని కూడా చెప్పారు. ఇది మైనంపల్లిని ఉద్దేశించి చెప్పారనే టాక్ కూడా నడుస్తోంది.
ఇంతకీ హరీష్‌ను ఏమన్నారు..?
‘హరీష్ రావు గతం గుర్తించుకోవాలి. హరీష్ నియోజకవర్గంని వదిలి మా జిల్లాలో పెత్తనం చేస్తున్నాడు. హరీష్ రావు బట్టలు ఊడతీసే వరకు నిద్రపోను. అక్రమంగా రూ. లక్ష కోట్లు సంపాదించాడు. సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తాను. రాజకీయంగా ఎంతో మందిని అణిచివేశాడు. మెదక్ అసెంబ్లీ నుంచి నా కుమారుడు.. మల్కాజ్‌గిరిలోనే నేను పోటీ చేస్తాను. మెదక్‌లో నా కుమారుడిని కచ్చితంగా గెలిపించుకుంటాం. నేను బీఆర్ఎస్‌లోనే ఉన్నాను. నాకు పార్టీ ఇప్పటికే టికెట్ ప్రకటించింది. అయితే నా కుటుంబంలో ఇద్దరికీ టికెట్ ఇస్తేనే పోటీ చేస్తాను’ అని మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు. ఆ తర్వాత ఈయన బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్‌లో చేరుతారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఇవాళ ఉదయం నుంచి జరిగిన పరిణామాలన్నింటినీ పక్కనెట్టి.. మనసు మార్చుకుని బీఆర్ఎస్ తరఫునే పోచేస్తానని క్లియర్ కట్‌గా చెప్పేశారు. అయితే.. వేటు వేశాక ఈయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.