TS Assembly Polls : కాంగ్రెస్ కీలక నేతతో రాజయ్య రహస్య భేటీ.. 45 నిమిషాలు అసలేం జరిగింది..!?
ABN , First Publish Date - 2023-09-04T18:49:43+05:30 IST
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయ్!. బీఆర్ఎస్‌లో (BRS) టికెట్ దక్కని ముఖ్యనేతలు, సిట్టింగులంతా పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో (Thummala Nageswara Rao) కాంగ్రెస్ నేతలు (Congress Leaders) వరుస భేటీలు అవుతున్నారు..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయ్!. బీఆర్ఎస్‌లో (BRS) టికెట్ దక్కని ముఖ్యనేతలు, సిట్టింగులంతా పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో (Thummala Nageswara Rao) కాంగ్రెస్ నేతలు (Congress Leaders) వరుస భేటీలు అవుతున్నారు. అతి త్వరలోనే తుమ్మల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇలా ఒకరిద్దరు కాదు.. టికెట్ దక్కని చాలా మంది గులాబీ పార్టీ నేతలతో కాంగ్రెస్ పెద్దలు టచ్‌లోకి వెళ్లిపోయారు. అయితే.. తాజాగా వరంగల్ (Warangal) వేదికగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పుడీ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా.. కారు పార్టీలో తెగ చర్చనీయాంశం అయ్యింది.
ఏం జరిగిందంటే..?
ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు (Thatikonda Rajaiah) ఈసారి టికెట్ దక్కలేదన్న విషయం తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఈయన్ను కాదనుకొని కడియం శ్రీహరికి (Kadiyam SriHari) టికెట్ ఇచ్చారు సీఎం కేసీఆర్. దీంతో అప్పట్నుంచే ఘనపూర్ వేదికగా అసలు సిసలైన రాజకీయం మొదలైంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ (BJP, Congress) లాంటి ప్రధాన పార్టీల పెద్దలు రాజయ్యను సంప్రదించినప్పటికీ.. ఆయన మాత్రం భవిష్యత్ కార్యాచరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అటు సంప్రదింపులు జరుపుతున్న సమయంలోనే.. కాంగ్రెస్ కీలక నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహాతో (Damodar Raja Narasimha) ఓ ప్రముఖ హోటల్‌లో రహస్యంగా రాజయ్య భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో పార్టీలోకి రావాలని ఆహ్వానించడం, టికెట్‌పై కీలకంగానే చర్చలు జరిగాయట. చర్చలు సక్సెస్ అయ్యాయని వార్తలు బయటికొస్తున్నాయి. టికెట్ రాలేదని ఎమ్మెల్యే అసంతృప్తిగా ఉండటం.. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి పిలుపొచ్చిందని వార్తలు రావడం.. తాజాగా రహస్య భేటీ జరగడంతో.. రాజయ్య పార్టీ మారుతారనేదానికి మరింత బలం చేకూరినట్లయ్యింది. రాజయ్య-రాజనర్సింహ భేటీతో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయాన్ని అటు రాజయ్య కానీ.. ఇటు రాజనర్సింహా గానీ కాంగ్రెస్ కానీ ధృవీకరించలేదు. కానీ.. చర్చలు మాత్రం దాదాపు కొలిక్కి వచ్చేసినట్లేనని.. ఇక ముహూర్తం ఖరారు చేసుకొని కండువా కప్పుకోవడమే ఆలస్యమని తెలియవచ్చింది. అయితే ఓ కార్యక్రమంలో భాగంగానే ఇద్దరూ కలిశారని తెలుస్తోంది.
ఇంత సడన్‌గా ఎలా..?
ఇటీవల పాలకుర్తి మండలం వల్మిడి సీతారాముల ఆలయం పున: ప్రతిష్టలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంతకాలం ఉప్పు - నిప్పులా ఉన్న స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఒకే వేదికపై ఒకరికొకరు తారసపడ్డారు. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుని చక్కగా పలకరించుకున్నారు. ఇద్దరూ కలసి కూర్చోవడంతో సభికులంతా ఆసక్తిగా చూశారు. అది గమనించిన రాజయ్యకు ఏమనిపించిందో ఏమో కానీ మధ్యలోనే సడెన్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇటీవలి కాలంలో కడియం, రాజయ్యల మద్య పెద్ద ఎత్తున విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరూ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. ఈ పరిణామంతో రాజయ్య-శ్రీహరి ఒక్కటయ్యారని అభిమానులు, కార్యకర్తలు.. ఇరు వర్గీయులు అనుకునేలోపే ఉన్నట్టుండి బాంబు లాంటి వార్త వినాల్సి వచ్చింది. ఇలా జరిగిన ఒకట్రెండు రోజుల వ్యవధిలోనే ఇప్పుడు కాంగ్రెస్ కీలక నేతతో రహస్యంగా భేటీ కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో రాజయ్య చర్చనీయాంశం అయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత.. రాజయ్య బహిరంగంగా కన్నీరు పెట్టుకోవడం, సీఎం కేసీఆర్ గీసిన గీత దాటబోనని చెప్పడం.. గులాబీ బాస్ వెంట ఉన్నానని చెప్పుకొచ్చారు రాజయ్య. ఈ వరుస వార్తలు, రహస్య భేటీ నేపథ్యంలో రాజయ్యపై బీఆర్ఎస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజయ్య కారులో ఉండిపోతారో లేకుండా గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని కడియంపై పోటీచేస్తారో వేచి చూడాల్సిందే మరి.