Mancherial CPI: సీపీఐకి అంత సీన్ లేదని బీఆర్ఎస్ ప్రచారం..సత్తా చాటాలని చూస్తున్న ఎర్రన్నలు..?

ABN , First Publish Date - 2023-03-10T09:14:21+05:30 IST

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కమ్యూనిస్టు నేతలకు అనురాగం, ఆప్యాయత పంచుతున్నారు. కారణాలేవైనా.. కమ్యూనిస్టుల బలంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు

Mancherial CPI: సీపీఐకి అంత సీన్ లేదని బీఆర్ఎస్ ప్రచారం..సత్తా చాటాలని చూస్తున్న ఎర్రన్నలు..?

బెల్లంపల్లి ఎమ్మెల్యేకి సీపీఐ ధమ్కీ ఇస్తోందా?.. సీపీఐకి బలం లేదని అవమానించిన చిన్నయ్యకు చుక్కలు చూపించాలని భావిస్తోందా?.. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని ఎర్రన్నలు ఎత్తులు వేస్తున్నారా?.. గూడ అంజన్న సంస్మరణ సభతో వార్నింగ్‌ బెల్‌ మోగించారా?.. ఇంతకీ.. బెల్లంపల్లిపై సీపీఐ ఎందుకు ఫోకస్‌ పెంచుతోంది?.. గూడ అంజన్న సంస్మరణ సభ.. అక్కడే నిర్వహించడంలోనున్న ఆంతర్యం ఏంటి?.. అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-108.jpg

రాబోయే ఎన్నికల్లో సత్తా ఏంటో చూపెడుతామని శపథం

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కమ్యూనిస్టు నేతలకు అనురాగం, ఆప్యాయత పంచుతున్నారు. కారణాలేవైనా.. కమ్యూనిస్టుల బలంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు నోరు జారుతున్నారు. దాంతో.. పలు జిల్లాల్లో రాజకీయ దుమారం రేగుతోంది. మొన్నామధ్య.. సీపీఐని తేలిగ్గా తీసి పారేసిన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆ పార్టీ నేతలు కొద్దిరోజులుగా రగిలిపోతున్నారు. సీపీఐని కించపరిచిన చిన్నయ్యకు రాబోయే ఎన్నికల్లో సత్తా ఏంటో చూపెడుతామంటున్నారు. అందుకు అవసరమైన ఎత్తులు వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Untitled-687.jpg

బెల్లంపల్లిలో ఎర్రజెండా ఎగురవేయాల్సిందేనన్న కసి

కొద్దిరోజుల క్రితం మీడియాతో మాట్లాడిన చిన్నయ్య.. బెల్లంపల్లిలో సీపీఐ బలంపై హాట్‌ కామెంట్స్‌ చేశారు. సీపీఐ బలహీన పడిందని చెప్పే క్రమంలో.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీకి వేయి కంటే ఎక్కువ ఓట్లు రావని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఆ వ్యాఖ్యలను సీపీఐ నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అప్పటినుంచి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సీపీఐకి కంచుకోట, ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన బెల్లంపల్లిలో తిరిగి ఎర్రజెండా ఎగురవేయాల్సిందేనన్న కసితో పని చేస్తున్నారు. బెల్లంపల్లిలో సీపీఐ బలోపేతానికి.. ముందుగా.. సంప్రదాయ ఓటు బ్యాంకు, వామపక్ష వాదులు, సానుభూతి పరులను ఐక్యం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Untitled-254.jpg

కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ సీపీఐ నేతలే!

నాలుగు రోజుల క్రితం బెల్లంపల్లిలో ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో ప్రజాకవి గూడ అంజన్న సంస్మరణ సభ భారీ ఎత్తున జరిగింది. ఆ కార్యక్రమంలో.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ, ప్రజా యుద్ధనౌక గద్దర్‌తోపాటు అనేక మంది నేతలు, ప్రముఖ కళాకారులు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. అయితే.. ఆ కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ సీపీఐ నేతలే. దాని ద్వారా సీపీఐ బలాన్ని తక్కువగా అంచనా వేయొద్దని ఎమ్మెల్యే చిన్నయ్యకు ఆ పార్టీ నేతలు హెచ్చరికలు పంపించారన్న చర్చ జరుగుతోంది.

Untitled-9852.jpg

2018 ఎన్నికల ఓట్ల ఆధారంగా బీఆర్ఎస్‌ ప్రచారం

వాస్తవానికి... ఉమ్మడి ఏపీలో బెల్లంపల్లి నుంచి సీపీఐ అనేకసార్లు విజయం సాధించింది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు బెల్లంపల్లి.. ఆసిఫాబాద్‌లో ఉండేది. ఆసిఫాబాద్ నుంచి 1983, 1985, 1994 ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా దివంగత గుండా మల్లేష్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత.. 2009 పునర్విభజనలో బెల్లంపల్లి ఎస్సీ నియోజకవర్గంగా ఏర్పడింది. ఆ ఎన్నికల్లోనూ గుండా మల్లేషే గెలిచారు. అయితే.. కొన్నాళ్ళ క్రితం ఆయన మరణించినా.. 2018 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల ఆధారంగా సీపీఐకి అంత సీన్ లేదని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. కానీ.. నాలుగు సార్లు విజయం సాధించిన సీపీఐ.. రాబోయే ఎన్నికల్లోనూ బరిలో నిలిచి గెలవాలని భావిస్తోంది.

Untitled-458.jpg

బెల్లంపల్లి సీటు పొత్తులో సీపీఐకి కేటాయిస్తారని ప్రచారం

ఇదిలావుంటే.. సింగరేణి నేపథ్యంతోపాటు గ్రామీణ ప్రాంతమూ అధికంగా ఉండే బెల్లంపల్లి రిజర్వుడ్‌ నియోజకవర్గం నుంచి.. 2014, 2018 ఎన్నికల్లో దుర్గం చిన్నయ్య వరుసగా గెలిచారు. మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీగా ఉన్నారు. ఆ క్రమంలో.. సీపీఐతో పొత్తు, బెల్లంపల్లి సీటు కేటాయిస్తారన్న ప్రచారాన్ని చిన్నయ్య జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే.. నోరు జారిన్నట్టు ప్రచారం జరుగుతోంది.

Untitled-1154.jpg

అయితే.. చిన్నయ్య వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్న సీపీఐ నేతలు.. బీఆర్ఎస్‌తో గానీ.. ఏదేని కారణాల వల్ల కాంగ్రెస్‌తో పొత్తు కుదిరినా బెల్లంపల్లిని మాత్రం వదులుకోకూడదని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అదేసమయంలో.. వచ్చే ఎన్నికల్లో గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా.. తమను ఛీప్‌గా తీసి పారేసిన చిన్నయ్యకు చుక్కలు చూపించాలని సీపీఐ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రాబోయే రోజుల్లో బెల్లంపల్లి పాలిటిక్స్‌ ఎలా ఉంటాయో చూడాలి మరి.

Updated Date - 2023-03-10T09:15:10+05:30 IST