Rebel Trouble In BRS : కేసీఆర్‌కు ఊహించని ట్విస్ట్.. పోటీపై తేల్చి చెప్పేసిన తుమ్మల
ABN , First Publish Date - 2023-08-25T18:55:15+05:30 IST
నాలుగు దశాబ్దాల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) భవిష్యత్ రాజకీయంపై తేల్చేశారు...
నాలుగు దశాబ్దాల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) భవిష్యత్ రాజకీయంపై తేల్చేశారు. సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించిన బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాలో (BRS First List) తుమ్మల పేరు ఉంటుందని అభిమానులు, కార్యకర్తలు భావించారు.. అయితే పేరు లేదు. పాలేరు (Paleru) టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డికే (Kandala Upender Reddy) కేటాయించారు. దీంతో తుమ్మల అనుచరులు, నియోజకవర్గంలోని ముఖ్యనేతలు తీవ్ర అసంతృప్తికి గురై వరుసగా రహస్య సమావేశాలు నిర్వహించారు. పోటీచేయాల్సిందేనని ఫ్యాన్స్ పట్టుబట్టారు. అవసరమైతే కాంగ్రెస్ అభ్యర్థిగానైనా తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచే పోటీ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అభిమానుల కోరిక మేరకు ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించారు. శుక్రవారం నాడు వేలాది మంది కార్యకర్తలు తుమ్మల ఇంటికి చేరుకున్నారు. ఇప్పటి వరకూ టికెట్ దక్కడంపై స్పందించని తుమ్మల.. కార్యకర్తల సమక్షంలోనే తేల్చి చెప్పేశారు.
అవును.. పోటీచేస్తున్నా..!
ఖమ్మంలో కార్యకర్తలతో సమావేశం అనంతరం తుమ్మల మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘నాకు ఈ ఎన్నికలు పెద్దగా అవసరం లేదు. నా రాజకీయ పదవి నా కోసం కాదు.. నా జిల్లా కోసం. ఖమ్మం జిల్లా వాసులు రాజకీయ రుణం తీర్చుకోలేనిది. గోదావరి జలాలతో మీ పాదాలు కడిగేందుకు ఎమ్మెల్యేగా చేస్తాను. నేను ఎన్నో ఆటుపోట్లు చూశాను. నా ప్రజల కోసం.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాను. మీ అభిమానం ఆవేశం, ఆందోళన, మీ ప్రేమ చూశాక మళ్లీ ఎమ్మేల్యేగా అడుగుపెడతాను. ఆత్మ గౌరవం కోసం ఎన్నికల్లో పోటీ చేస్తాను. తుమ్మల వల్ల ఉభయ జిల్లాల్లో ఎవ్వరూ తల వంచని విధంగా రాజకీయాలు చేస్తాను. ఈ ఎన్నికల్లో నన్ను తప్పించి శునకానందం పొందవచ్చు కానీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. నా పదవి అహంకారం కోసం కాదు. నన్ను కొందరు ఇబ్బంది పెట్టినా ఖమ్మం జిల్లా ప్రజలు నాకు అండగా ఉన్నారు. శ్రీ రామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో జిల్లా అభివృద్ధికి పాటుబడ్డాను. మళ్లీ చెబుతున్నా.. గోదావరి జలాలతో జిల్లా సస్య శ్యామలం చేయాలనేది నా కల. నాగలి దున్నే రైతు నైనా నన్ను మంత్రి చేశారు అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానీకం ఆశీర్వాదం’ అని తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పోటీ సరే.. పార్టీ కథేంటో..?
పోటీ చేస్తాను అని తుమ్మల చెప్పారు కానీ.. పార్టీ పేరు అనేది చెప్పలేదు. అయితే.. కాంగ్రెస్‌లోకి వెళ్తారా..? లేకుంటే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతారా..? అనేది తెలియట్లేదు.విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి తన సత్తా ఏంటే అధిష్టానానికి చూపించాలని తుమ్మల నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అనుచరులు, అభిమానులు చెప్పుకుంటున్నారు. కచ్చితంగా ఈ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీచేసే గెలుస్తానని గట్టి నమ్మకంగా ఉన్నారట తుమ్మల. అందుకే ఇంత ధీమాగా పోటీచేస్తానని అభిమానుల సమక్షంలో తుమ్మల ప్రకటించారట. మాజీ మంత్రి ప్రకటనతో బీఆర్ఎస్‌లో టెన్షన్ మొదలైందట. ఈయన అటు కాంగ్రెస్‌లోకి వెళ్లినా తలనొప్పే.. ఇండిపెండెంట్‌గా నిలబడినా అంతకుమించిన తలనొప్పేనని బీఆర్ఎస్ అధిష్టానం టెన్షన్ పడుతోందట. ఇవాళ, రేపో ప్రగతి భవన్ నుంచి పిలుపు రావొచ్చని.. సీఎం కేసీఆర్ బుజ్జగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ‘ఈ ఎన్నికల్లో పోటీచేయకండి.. కచ్చితంగా బీఆర్ఎస్సే గెలుస్తుంది.. మంత్రి పదవి ఇస్తాను’ అని తుమ్మలను కేసీఆర్ కోరే ఛాన్స్ ఉంది. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ఇదే పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ కీలక నేతలు పార్టీలోకి ఆహ్వానించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తుమ్మల ఏ పార్టీ నుంచి పోటీచేస్తారు..? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొనగా.. బీఆర్ఎస్‌లో మాత్రం టెన్షన్ మొదలైంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.