TS BJP : తెలంగాణ బీజేపీలో కొనసాగుతోన్న అలజడి.. రాజీనామా వార్తలపై ఫస్ట్ టైమ్ స్పందించిన ఈటల..
ABN , First Publish Date - 2023-03-14T23:53:42+05:30 IST
తెలంగాణ బీజేపీలో అలజడి కొనసాగుతూనే ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్స్‌తో ఒక్కసారిగా పార్టీలో విబేధాలు బయటపడ్డాయి.
తెలంగాణ బీజేపీలో అలజడి కొనసాగుతూనే ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై (BRS MLC Kavitha) రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) చేసిన కామెంట్స్‌తో ఒక్కసారిగా పార్టీలో విబేధాలు బయటపడ్డాయి. అప్పటి వరకూ బండిపై పీకలదాకా కోపంతో ఉన్నవాళ్లంతా ఒక్కొక్కరుగా మీడియా ముందుకొచ్చి ఆయనపై తమకున్న అసంతృప్తిని వెల్లగక్కారు. ఇవన్నీ ఇలా జరుగుతుండగా.. ఉన్నట్టుండి తెలంగాణ బీజేపీలో మరో బాంబ్ పేలింది..!. సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etela Rajender) అధిష్టానం తనకిచ్చిన చేరికల కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అంతేకాదు.. ఈ కీలక పదవి నుంచి తనను తప్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda), కేంద్ర మంత్రి అమిత్ షాను (Amit Shah) కోరినట్లు వార్తలు వచ్చాయి. అటు బండి వ్యవహారం.. ఇటు ఈటల వ్యవహారం.. మధ్యలో నేతల ప్రెస్‌మీట్లతో పార్టీలో అసలేం జరుగుతోందో కార్యకర్తలు, కమలనాథులకు అర్థం కాని పరిస్థితి.
ఈ భేటీతో మరింతగా..!
మరోవైపు.. ఈ వార్తలకు ఇటీవలే జేపీ నడ్డా నివాసంలో ఈటల భేటీ అయ్యారు. దీంతో రాజీనామా వార్తలకు మరింత బలం చేకూరింది. పైగా.. అప్పట్టో బీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పదుల సంఖ్యలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని స్వయంగా ఈటల చెప్పారు. దీంతో ఈటల దగ్గర పెద్ద ప్లానే ఉందనుకుని చేరికల కమిటీకి ఆయన్నే చైర్మన్‌గా చేసింది అధిష్టానం. అయితే నాటి నుంచి వరకూ ఆ చేరికలు అయితే జరగలేదు. పార్టీలో చేరితే టికెట్ ఇస్తామనే హామీతో పాటు.. ప్రాధాన్యత గల పదవులు ఇవ్వాలని కొందరు నేతలు ఈటలకు చెప్పినట్లు సమాచారం. ఇదే మాటను రాష్ట్ర, కేంద్ర పెద్దలకు చెప్పినప్పటికీ ఏ మాత్రం స్పందన రాలేదని.. ఆ తర్వాతే చేరికల కమిటీకి రాజీనామా చేయాలని ఈటల భావించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన చేసేదేమీ లేక తీవ్ర అసంతృప్తితో రాజీనామా చేయాలని భావించారాట. అంతేకాదు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పెను సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత విచారణకు వెళ్లడంపైన కూడా అందుకే స్పందించలేదని కూడా పుకార్లు షికార్లు చేశాయి. ఇలా గత కొన్నిరోజులుగా తెలంగాణలో వస్తున్న ఈ పొలిటికల్ రూమర్స్‌పై ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడి ఈటల ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
ఆ ఆలోచనే లేదు..!
‘బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌గా నేను రాజీనామా చేశానని కొందరు.. రాజీనామా చేసేశానని మరికొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం వందకు వంద శాతం అవాస్తవం. ఈ ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. అసలు రాజీనామా అనే ఆలోచనే నాకు లేదు.. అలాంటి చర్చేమీ జరగలేదు’ అని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వేదికగా ఈటలు క్లారిటీ ఇచ్చుకున్నారు.
మొత్తానికి చూస్తే.. ఈటల ఏబీఎన్ వేదికగా క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఇకనైనా వార్తలు ఆయన రాజీనామా వ్యవహారంపై వార్తలు ఆగుతాయో లేదో వేచి చూడాల్సిందే మరి.