Fact Check: అక్టోబర్‌లో ప్రభుత్వం రద్దు.. ముందస్తుకు వెళ్లేందుకు వైసీపీ ప్రణాళిక?

ABN , First Publish Date - 2023-09-28T15:05:38+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని రద్దు చేసే ఆలోచనలో ఉందా? ఇందులో వాస్తవం ఎంతుందో తెలీదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ ప్రచారం జోరుగా సాగుతోంది.

Fact Check: అక్టోబర్‌లో ప్రభుత్వం రద్దు.. ముందస్తుకు వెళ్లేందుకు వైసీపీ ప్రణాళిక?

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని రద్దు చేసే ఆలోచనలో ఉందా? ఇందులో వాస్తవం ఎంతుందో తెలీదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. అక్టోబర్ 10వ తేదీలోపే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని వైసీపీ ప్రణాళికలు రచిస్తోందని వార్తలొస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందస్తుకు వెళ్తేనే.. టీడీపీని నిర్వీర్యం చేసి, తిరిగి అధికారంలోకి రావొచ్చని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన గుట్టుచప్పుడు కాకుండా మంత్రులు, వైసీపీ నేతలతో రహస్య సమావేశం నిర్వహించారట. ఇప్పుడున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా తాను ఎంతగానో నమ్మే, ఆరాధించే స్వరూపానంద సరస్వతిని జగన్ కలిశారని.. అసెంబ్లీ రద్దుకు మంచి ముహూర్తం గురించి చర్చించారని చెప్పుకుంటున్నారు. ఆయన సూచన మేరకే.. అక్టోబర్ 10లోపు అసెంబ్లీ రద్దు చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

నిజానికి.. వైసీపీ ప్రభుత్వంపై ఏపీ ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. ఇంతవరకూ రాజధాని లేకుండా ఏపీని ఏకాకి చేయడం, ప్రాజెక్టులు లేకుండా దిక్కుమాలిన రాష్ట్రంగా మార్చడం, పథకాలు పేరు చెప్పి రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడంతో.. వైసీపీపై రాష్ట్ర ప్రజలు గుర్రుగా ఉన్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి తమకు భవిష్యత్తే లేకుండా చేశాడని జగన్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇలాంటి చేదు అనుభవాలు ఎన్నో ఎదురయ్యాయి. దీనికి తోడు.. వాలంటీర్ వ్యవస్థలోని పాపాల గుట్ట కూడా బయటపడటంతో, జగన్ ప్రభుత్వం ఇరుకున పడింది. ఇక నవరత్నాలను ఎలా నిర్వీర్యం చేశారో అందరికీ తెలిసిందేగా! మద్యపానం నిషేధం పేరుతో ఇంకా మద్యం అమ్మకాలు పెంచి పేదలను ఇబ్బంది పెట్టడమే కాకుండా మద్యం ద్వారా వచ్చే నిధులను పక్కదారి పట్టిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.


మొత్తానికి తనపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు జగన్ ‘స్కిల్ డెవలప్‌మెంట్’ కేసుని తెరమీదకు తీసుకొచ్చి, చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేయించారు. ఇప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా ఏపీ ప్రజల్ని రెచ్చగొట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఒకవేళ టీడీపీపై అవినీతి బురదజల్లి, ప్రజల్ని నమ్మించడంలో సక్సెస్ అయితే.. అప్పుడు ముందస్తుకు వెళ్లడమే నయమని జగన్ ఉద్దేశంగా తెలుస్తోంది. టీడీపీని నిర్వీర్యం చేస్తే.. తమకు అనుకూలంగా ఓట్లు పడతాయని, ఫలితంగా మరోసారి అధికారాన్ని చేపట్టవచ్చని జగన్‌తో పాటు ఆయన పార్టీ నేతలు ధీమాతో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. అయితే.. ఈ ముందస్తు ఎన్నికలపై వస్తున్న వార్తలు అవాస్తవమని తెలుస్తోంది. కొందరు వైసీపీ మద్దతుదారులు కావాలనే ఈ ఫేక్ వార్తల్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్టు సమాచారం అందుతోంది.

అయితే వైసీపీనే కావాలని ఈ ప్రచారం చేయిస్తోందని.. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా మంచిదేనని.. ఈ దరిద్రపు ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు సాగనంపుదామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. వివేకా హత్య కేసును పక్కదారి పట్టించి చంద్రబాబు అరెస్టుపైనే రాజకీయం నడిపిస్తున్నారని.. కానీ ప్రజలు వివేకా హత్య కేసును మరిచిపోలేదని ఆయన పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేంత సాహసం జగన్ చేయలేరని.. ఒకవేళ వెళ్లినా ఆయనకు పరాభవం తప్పదని జోస్యం చెప్పారు.

Updated Date - 2023-09-28T15:05:38+05:30 IST