Mallareddy Comedy : బాబోయ్.. మల్లారెడ్డి.. పాలు, పూలు, కూరగాయలు అమ్మడమే కాదు.. ఇంకా చాలానే చేశారుగా.. పగలబడి నవ్వే విషయం చెప్పిన కేటీఆర్..
ABN , First Publish Date - 2023-04-15T19:11:27+05:30 IST
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) మీడియా ముందుకొచ్చినా.. సభల్లో మాట్లాడినా ఎంత సరదాగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. యూట్యూబ్‌లో..
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) మీడియా ముందుకొచ్చినా.. సభల్లో మాట్లాడినా ఎంత సరదాగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. యూట్యూబ్‌లో (Youtube) మల్లారెడ్డి అని కొడితే చాలు అన్నీ నవ్వులు పూయించే వీడియోలు (Mallareddy Funny Videos) వస్తుంటాయ్. ఆ వీడియోల జాబితాలోకి తాజాగా మాట్లాడిన మాటల తాలుకూ వీడియో కూడా చేరనుంది. అయితే మల్లారెడ్డి ఎంత ఫన్నీగా మాట్లాడుతారో.. అంతకు రెట్టింపుగా నవ్వులు పూయిస్తూ మంత్రి కేటీఆర్ (Minister KTR) మాట్లాడారు. శనివారం నాడు మేడ్చల్ (Medchal) పరిధిలోని జవహర్‌నగర్‌లో రూ.250 కోట్ల వ్యయంతో నిర్మించిన కలుషిత వ్యర్ధజలాల శుద్ధి నిర్వహణ ప్లాంట్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు నిర్వహించిన సభావేదికగా మంత్రులు మల్లారెడ్డి, కేటీఆర్‌లు ప్రసంగించారు. ఈ ఇద్దరూ మాట్లాడుతున్నంత సభకు వచ్చిన కార్యకర్తలు, వీరాభిమానులు నవ్వు ఆపుకోలేకపోయారు. ఇంతకీ ఇంతలా నవ్వు తెప్పించేలా మల్లన్న ఏం మాట్లాడారు..? కేటీఆర్ ఎలా రియాక్ట్ అయ్యారు..? అనే విషయాలు ఈ కథనంలో చూద్దాం.
ఇంతకీ మల్లారెడ్డి ఏమన్నారు..?
జవహర్‌నగర్‌లో ప్లాంట్ ప్రారంభించిన అనంతరం మంత్రులు మల్లారెడ్డి, కేటీఆర్.. స్థానిక నేతలు ప్రసంగించారు. ‘ మీరు కొత్తగా మాకు ఏమీ ఇవ్వనక్కర్లేదు. మా దమ్మాయిగూడెం కాలనీ అంతా వర్షాలు వస్తే మొన్న మురికి నీళ్లతో మునిగిపోయింది. అదికూడా పెద్దగా ఖర్చేమీ కాదు సార్.. మూడు, నాలుగు కోట్లలో అయిపోతుంది సార్. మేం వందల కోట్లు అడగం సార్. పెద్ద మనసు, ప్రేమ ఉన్నోళ్లం సార్. ఇదిగో ఈ సభకు వచ్చిన వాళ్లంతా మీకు (కేటీఆర్) థ్యాంక్స్ చెప్పేందుకు వచ్చారు సార్. జవాన్ నగర్ ప్రజలు అంతా మీకు ధన్యవాదాలు తెలపడానికి వచ్చారు సార్. మిమ్మల్ని డబ్బులు అడిగేందుకు రాలేదు సార్.. ఒక్క రూపాయి కూడా అడగనని చెప్పినా.. ఇప్పుడు కూడా ఏమీ అడగట్లేదు. మిమ్మల్ని చూడటానికే ప్రజలు వచ్చారు సార్.. నువ్వు మా లీడర్ సార్, మా మినిస్టర్ సార్. ప్రజలారా మీరంతా అదృష్టవంతులు, మంచిగా ఇళ్ల పట్టాలు వస్తున్నాయి. మళ్లీ వచ్చేది మన పార్టీనే (నవ్వుతూ..), పనులు చేసేది కూడా మన పార్టీయే.. ఎవడి దగుల్భాజీ మాటలు, మోసపూరిత మాటలు నమ్మొద్దు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పబ్లిక్ సెక్టార్లను అమ్ముతున్నాయ్’ అని మంత్రి మల్లారెడ్డి నవ్వులు పూయించారు. అంతటితో ఆగని ఆయన తన ప్రసంగాన్ని ముగించే ముందు.. డైనమిక్ స్మార్ట్ మినిస్టర్.. ప్రపంచంలో ఎక్కడైనా స్మార్ట్ మినిస్టర్ ఉన్నాడా అంటే ఆయనే కేటీఆర్ అని చెప్పుకొచ్చారు. స్మార్ట్ అంటే పనిలో, తెలివి అన్నారాయన. ప్రపంచంలో ఇలాంటి వాళ్లు లేరు కాబట్టే హైదరాబాద్ ఈ రేంజ్‌లో అభివృద్ధి చెందుతోందని మల్లారెడ్డి నవ్వుతూ అన్నారు.
కేటీఆర్ ఏమన్నారంటే..
‘సరే మల్లారెడ్డన్న ఇంకా అంతా చెప్పినవ్ కదా నేను వెళ్లిపోతా (నవ్వుతూ). మొత్తం నువ్వే చెప్పినవ్.. కేతమ్మ చెప్పారు.. ఇక నేను మాట్లాడేదేముంది..?. మల్లన్నతో పెట్టుకుంటే గిట్లే ఉంటది. మా మల్లన్న ఏం చెప్పిండు.. పాలు పిండినా అన్నావా లేదా (మల్లారెడ్డి వైపు చూస్తూ) కూరగాయాలు అమ్మినా.. ఇంకేం అమ్మినవ్.. పూలు కూడా అమ్మినవ్. ఇంకా గమ్మత్తు చెబుతాను ఆగు.. శంకుస్థాపన దగ్గర జనాలంతా మీద పడుతుంటే మల్లన్న అందర్నీ నూకుతున్నారు. అరే ఎందుకే పెద్ద మనిషివి నీకివన్నీ అని అంటే.. చిన్నప్పుడు బర్రెలను కూడా కంట్రోల్ చేశాను సార్.. గిదేంది..!. (సభావేదికపై ఉన్న వారు.. సభకు వచ్చిన జనాలు పగలబడి నవ్వేశారు) అంటే కష్టపడి జీవితంలో పైకి వచ్చిన మల్లారెడ్డిగారు అన్ని రకాలుగా మీకు (ప్రజలకు) అండగా ఉంటున్నారు.. ఇది చాలా సంతోషించదగిన విషయం. ఆయన కూడా ఒక ఆస్పత్రి కట్టారు కానీ ఎందుకో సరిగ్గా నడవలేదట. మల్లారెడ్డి కార్పొరేట్ సంస్థల నుంచి జవహర్ నగర్‌కు కూడా ఏదో ఒకటి చేయండి’ అని మల్లారెడ్డిని కేటీఆర్ కోరారు.
ప్రస్తుతం ఈ ఇద్దరి మాటలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. ఇక మీమ్స్‌కు అయితే కొదువే లేకుండా పోయింది. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు, బీఆర్ఎస్ వీరాభిమానులు పగలబడి నవ్వుకుంటున్నారు. కొందరైతే ఇన్ని రోజులు పాలు, పూలు, కూరగాయాలే అనుకున్నాం కేటీఆర్ వల్ల మరో ఇంట్రెస్టింగ్ విషయం తెలిసిందని కామెంట్స్ చేస్తున్నారు.