PM Modi MP Arvind: ప్రధాని మోదీ పసుపు బోర్డ్ ప్రకటన ఇందుకేనా...?.
ABN , First Publish Date - 2023-10-02T16:56:54+05:30 IST
తెలంగాణకు జాతీయ పసుపు బోర్డ్ ప్రకటన వెనుక బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందా?. దీని వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇందుకు కారణాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం..
తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ (Telangana Election2023) మరికొన్ని రోజుల వ్యవధిలోనే వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) సహా ఇతర పార్టీలు సైతం వ్యూహాత్మకంగా కదం తొక్కుతున్నాయి. బీఆర్ఎస్ అందరికంటే ముందుగా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచార పర్వంలోకి దూకగా.. కాంగ్రెస్ పార్టీ (Congress Party) రేపో మాపో అభ్యర్థులను ప్రకటించబోతోందని తెలుస్తోంది. ఇక బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపికపై గట్టిగానే కసరత్తులు చేస్తోంది. తెలంగాణ ఎన్నికల సమరంలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లతో పోల్చితే బీజేపీ కాస్త వెనుకబడ్డట్టు విశ్లేషణలు వినిపిస్తున్నప్పటికీ కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు పార్టీ అధిష్ఠానం గట్టిగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాష్ట్ర పర్యటనకు విచ్చేశారు. ఇంకా చెప్పాలంటే పాలమూరు వేదికగా ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. తెలంగాణ ఓటర్లకు చేరువవ్వడమే లక్ష్యంగా రెండు కీలక ప్రకటనలు కూడా చేశారు. ఒకటి ములుగులో రూ.900 కోట్లతో జాతీయ గిరిజన వర్సిటీ ఏర్పాటు.. కాగా రెండవది తెలంగాణకు జాతీయ పసుపు బోర్డు మంజూరు. అయితే... గిరిజన వర్సిటీ మాటెలా ఉన్నా.. జాతీయ పసుపు బోర్డ్ ప్రకటన వెనుక బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందా?. అసలు కారణాలు వేరే ఉన్నాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇందుకు కారణాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం..
అసలు కారణం ఇదేనా!!
2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో తెలంగాణలో జాతీయ పసుపు బోర్డ్ ఏర్పాటుకు తనది హామీ అంటూ మహబూబ్‌నగర్ ప్రస్తుత బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విస్తృత ప్రచారం చేశారు. ఎంతగా అంటే బాండ్ పేపర్‌పై ఓటర్లకు హామీ కూడా రాసిచ్చారు. పసుపు బోర్డ్ ప్రకటన చేయించలేకుంటే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇక అంతకుముందు 2014 నుంచి 2019 వరకు ఎంపీగా కొనసాగిన కల్వకుంట్ల కవిత పలుమార్లు పసుపు బోర్డ్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేసినా ఆమె సఫలం కాలేదు.
దీంతో తనపై నమ్మకం ఉంచాలంటూ ఎంపీ అర్వింద్ చేసిన ప్రయత్నం, ప్రచారం సక్సెస్ అయ్యాయి. దీంతో ఆయన 2019లో కవితను ఓడించి ఎంపీ అయ్యారు. కానీ నాలుగేళ్లు గడిచిపోయినా పసుపు బోర్డ్ ఏర్పాటుకు సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటనా లేకపోవడం, అసలు ఇచ్చే ఉద్దేశ్యం ఉందో లేదో కూడా క్లారిటీ ఇవ్వకపోవడంతో పరిస్థితులు ఎంపీ అర్వింద్‌కు ప్రతికూలంగా మారుతున్నాయని బీజేపీ వర్గాలు ఆందోళన చెందాయని, అందుకే ఈ ప్రకటన అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 9 ఏళ్ల నుంచి పసుపు బోర్డ్ ఏర్పాటు డిమాండ్ ఉన్నప్పటికీ ఎన్నికల సమీపిస్తున్న సమయంలోనే ప్రకటన చేయడం చూస్తుంటే క్లియర్‌గా అర్థమవుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పసుపు బోర్డ్ ఏర్పాటు చేయకపోతే బీజేపీకి, ఎంపీ అర్వింద్‌కు ఇబ్బందులు తప్పవని పసిగట్టారని బీఆర్ఎస్ శ్రేణులు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. మరి ఈ ప్రచారంలో ఎంతవరక నిజముందో వారికే తెలియాలి.