Kamal Haasan Rahul: రాహుల్ గాంధీకి కీలక విషయాలు వెల్లడించిన కమల్ హాసన్!
ABN , First Publish Date - 2023-01-02T14:34:33+05:30 IST
‘‘ దేశంలో నేటి పరిస్థితుల పట్ల నా ఆవేదన, దిగులుకు గొంతుకనివ్వడం ఒక భారతీయుడిగా నా బాధ్యత అనిపించింది’’ అని దిగ్గజ నటుడు, మక్కల్ నీది మయ్యమ్(MNM) వ్యవస్థాపకుడు కమల్ హాసన్ (Kamal Haasan) వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: ‘‘ దేశంలో నేటి పరిస్థితుల పట్ల నా ఆవేదన, దిగులుకు గొంతుకనివ్వడం ఒక భారతీయుడిగా నా బాధ్యత అనిపించింది’’ అని దిగ్గజ నటుడు, మక్కల్ నీది మయ్యమ్(MNM) వ్యవస్థాపకుడు కమల్ హాసన్ (Kamal Haasan) వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపడుతున్న భారత్ జోడో యాత్రలో (Bharat Jodo Yatra) భాగస్వామై ప్రసంగించడానికి కారణం ఇదేనని ఆయన వెల్లడించారు. యాత్రలో పాల్గొన్న కొన్ని రోజుల తర్వాత రాహుల్ గాంధీతో కమల్ హాసన్ ప్రత్యేకంగా ముచ్చటించారు. పలు అంశాలపై తన అభిప్రాయాలను ఇష్టాగోష్టిగా పంచుకున్నారు. వీరిద్దరి సంభాషణకు సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో కమల్ హాసన్ పంచుకున్న విశేషాలపై ఓ లుక్కేద్దాం...
పోరాటానికి ముందు దేశాన్ని అర్థంచేసుకోవాలని, ఈ విషయంలో అచ్చంగా మహాత్మా గాంధీ చేసినట్టే చేస్తున్నారంటూ భారత్ జోడో యాత్ర చేపడుతున్న రాహుల్‌ను కమల్ హాసన్ ప్రశంసించారు. పోడియం ఎక్కి లెక్చర్లు ఇవ్వడానికి బదులుగా జనాల వద్దకే వెళ్లి సాధకబాధకాలు ఆలకిస్తున్నారంటూ రాహుల్‌ను మెచ్చుకున్నారు. ఈ కారణంగానే భారత్ జోడో యాత్రను సెలబ్రేట్ చేసుకోవాలనిపించిందని తెలిపారు. చెమటచుక్కలు, కన్నీళ్ల ధారల గుండా 2,800 కిలోమీటర్లు యాత్ర చేశారని అన్నారు.
గాంధీజీకి క్షమాపణగానే ‘హే రామ్’ సినిమా
జనాలు ఏవిధంగా చరిత్రను విస్మరిస్తున్నది, వర్తమానాన్ని మాత్రమే గుర్తుంచుకుంటున్న తీరుపై ఆయన స్పందించారు. ‘‘ మనం చరిత్ర మరచిపోయాం. ప్రస్తుతం జరుగుతున్న విషయాలనే గుర్తుంచుకుంటున్నాం. మహాత్మగాంధీ గురించి నేను ఇప్పుడు మాట్లాడగలను. కానీ మొదటి నుంచి మాట్లాడేవాడిని కాదు. మా నాన్న కాంగ్రెస్ వ్యక్తి. కానీ చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా టీనేజీలో ఉన్నప్పుడు మహాత్మ గాంధీని విమర్శించేవాడిని. కానీ గాంధీ అంటే ఏంటో 24-25 ఏళ్ల వయసులో సొంతంగా తెలుసుకున్నాను. అందుకే హే రామ్ (Hey Ram) సినిమా తీశాను. ఆ విధంగా బాపుకి క్షమాపణలు చెప్పాను ’’ అని కమల్ హాసన్ వివరించారు. దేశంలో వ్యాపింపజేస్తున్న హింస, ద్వేషభావంపై తన అభిప్రాయాలు తెలియజేస్తూ.. చంపడం అనేది విమర్శకు అత్యంత చెత్త రూపమని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. విద్వేషమంటే గుడ్డితనమని, తప్పుగా అర్థంచేసుకోవడమేనని వ్యాఖ్యానించారు.
కాగా దేశ రాజధాని న్యూఢిల్లీలో రాహుల్ భారత్ జోడో యాత్రలో కమల్ హాసన్ ఇటివలే పాల్గొని ప్రసంగించారు. ‘‘ ఇక్కడెందుకు ఉన్నావని చాలా అడుగున్నారు. నేనొక భారతీయుడిని’’ అని సభలో కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. ‘‘ మా నాన్న కాంగ్రెస్‌వాది. నాకు విభిన్న సిద్ధాంతాలు ఉన్నాయి. సొంత రాజకీయ పార్టీ పెట్టాను. అయితే జాతీయ స్థాయిలో చూస్తే అన్ని రాజకీయ పార్టీల పరిధులు అస్పష్టమే. ఆ అస్పష్టతను దాటి ఇక్కడికి వచ్చాను’’ అని కమల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.