Delhi Liquor Scam : లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్ర ఉందని తేలితే.. బీఆర్ఎస్ శ్రేణులు షాకయ్యే విషయాలు చెప్పిన న్యాయ నిపుణులు..!
ABN , First Publish Date - 2023-03-08T15:20:08+05:30 IST
దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (BRS MLC Kavitha) ఈడీ నోటీసులు (ED Notice) జారీ చేసింది..
దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (BRS MLC Kavitha) ఈడీ నోటీసులు (ED Notice) జారీ చేసింది. బుధవారం ఉదయం నుంచి తెలంగాణలో (Telangana) ఇదో హాట్ టాపిక్‌గా మారింది. నోటీసులు రావడం, కవిత నుంచి రియాక్షన్.. ఆ తర్వాత విచారణకు ఇప్పట్లో రాలేనని ఈడీకి లేఖ రాయడం ఇవన్నీ పెద్ద చర్చకే దారితీశాయి. చివరికి ఈ నెల 15 తరువాత విచారణకు హాజరవుతానని ఈడీకి రాసిన లేఖలో కవిత స్పష్టం చేశారు. మరోవైపు.. ఈ నోటీసులపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో న్యాయ నిపుణులు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో (ABN-Andhrajyothy) ప్రత్యేకంగా మాట్లాడారు.
సీరియస్ క్రైమ్..!
ప్రముఖ న్యాయవాది, బీజేపీ మహిళా నేత రచనారెడ్డి (Rachana Reddy) స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో చార్టెడ్ ఫ్లయిట్‌లో డబ్బులు చేతులు మారాయని ఆరోపించారు. ఈ కుంభకోణం వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి 3వేల కోట్ల రూపాయిల పైచిలుకు నష్టం వాటిల్లిందన్నారు. లిక్కర్ స్కామ్ అనేది పెద్ద సీరియస్ క్రైమ్ అని.. అంతకుమించి సీరియస్ ఆధారాలు ఉన్నటువంటి నేరమన్నారు. రాజకీయ దురుద్దేశాలతో కేసు పెట్టడం లేదని.. పక్కాగా ఆధారాలు ఉన్నాయి కాబట్టే కేసు నడుస్తోందన్నారు. ఈ కేసులో కవిత చాలా అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్నారన్నారు. కవిత, రామచంద్ర పిళ్లైని ఇద్దర్నీ కలిపి జాయింట్‌గా విచారించే అవకాశాలు మెండుగా ఉన్నాయని రచనారెడ్డి చెబుతున్నారు. దీంతో పాటు విచారణ కూడా చాలా అడ్వాన్స్ స్టేజ్‌లో ఉందని తెలిపారు.
కవిత పాత్ర తేలితే..!
నోటీసుల పట్ల కవిత రియాక్ట్ అయిన విధానంపై న్యాయ నిపుణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ‘తెలంగాణ ఎవరికి తల వంచదని కవిత అనడం పెద్ద డ్రామా. లిక్కర్ స్కామ్‌లో కవితపై సింపతీ దొరకడం లేదు. ఈ కుంభకోణంలో కవిత పాత్ర ఉందని తేలితే భారీగా జరిమానాతో పాటు, జైలు శిక్ష కూడా ఉండొచ్చు. కవితని విచారణ చేసిన వెంటనే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. కవితని లిక్కర్ స్కామ్‌లో వివరాలు అడిగి కనుక్కోవడానికి పిలవడం లేదు. పక్కాగా ఆధారాలు ఉన్నాయి కాబట్టే విచారణకు రమ్మంటున్నారు’ అని రచనారెడ్డి చెప్పుకొచ్చారు. రచనా కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కాస్త ఆందోళన కలిగించేలా ఉన్నాయి. మరోవైపు.. ఒక్క న్యాయవాదిగా కాకుండా బీజేపీ నేతగానే ఆమె మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. లిక్కర్ స్కామ్ ఆరోపణలపై ఎలా ముందుకెళ్లాలి..? నోటీసులపై ఏం చేద్దాం..? విచారణలో ఏం మాట్లాడాలి..? పిళ్లైని, కవితను కలిపి విచారిస్తే ఏం మాట్లాడాలనే విషయాలపై న్యాయ నిపుణులతో బీఆర్ఎస్ పెద్దలు చర్చిస్తున్నారు. అయితే షెడ్యూల్ ప్రకారమే ఇవాళ సాయంత్రం కవిత ఢిల్లీకి వెళ్తున్నారు.