BRSను వ్యతిరేకిస్తున్న మహారాష్ట్ర నవ నిర్మాణ సేన..అడుగు పెట్టనీయబోమని హెచ్చరిక..

ABN , First Publish Date - 2023-02-22T10:58:24+05:30 IST

మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణ బాధ్యతలను గులాబీ బాస్ సరిహద్దు జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్‌ నేతలకు

BRSను వ్యతిరేకిస్తున్న మహారాష్ట్ర నవ నిర్మాణ సేన..అడుగు పెట్టనీయబోమని హెచ్చరిక..

మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణకు అడ్డంగులు ఎదురవుతున్నాయా?.. కేసీఆర్ టాస్క్.. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల నేతలకు తలనొప్పిగా మారుతోందా?.. బీఆర్ఎస్‌ను మహారాష్ట్ర నవ నిర్మాణ సేన తీవ్రంగా వ్యతిరేకిస్తోందా? కాళేశ్వరం ముంపు బాధిత మహారాష్ట్ర రైతులు నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందా?.. ఇంతకీ.. మహారాష్ట్రలో బీఆర్ఎస్‌కు ఎదురవుతున్న అడ్డంకులు ఏంటి?.. మహారాష్ట్ర నుంచి ఇంతవరకూ పెద్దగా చేరికలు లేకపోవడం దేనికి సంకేతం?..అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-2654.jpg

ఇతర జిల్లాల్లోనూ సభల నిర్వహణకు ప్లాన్‌

మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణ బాధ్యతలను గులాబీ బాస్ సరిహద్దు జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్‌ నేతలకు అప్పగించారు. అధినేత ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆ జిల్లా నేతలు.. చేరికలపై దృష్టి పెడుతున్నారు. నాందేడ్ సభ ఊపుతో ఇతర జిల్లాల్లోనూ సభలు నిర్వహించాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. తెలంగాణ ఉత్తర ముఖద్వారమైన ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్ జిల్లాలకు మూడు వైపులా మహారాష్ట్ర ఉంది. వేయి కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటోంది. తెలంగాణ మూలాలు అధికంగా ఉన్న నాందేడ్, అమరావతి, చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల్లో బలపడడం ద్వారా మహారాష్ట్ర అంతటా విస్తరించవచ్చని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. అందుకే.. తెలంగాణ మూలాలున్న నేతలకు గాలం వేస్తోంది.

Untitled-315645.jpg

మహారాష్ట్రలో అడుగు పెట్టనీయబోమని హెచ్చరిక

వాస్తవానికి.. గత కొన్నాళ్లుగా మహారాష్ట్రలోని కిన్వట్‌, వని, ధర్మాబాద్‌ తాలుకాల్లోని సరిహద్దు గ్రామాల ప్రజలు తెలంగాణలో కలపాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆ పరిణామాలు కలిసి వస్తాయని బీఆర్ఎస్ నేతలు నమ్ముతున్నారు. కానీ.. గడ్చిరోలి జిల్లా అహేరీ నియోజకవర్గంలోని ప్రజలు.. బీఆర్ఎస్‌ను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ముంపుకు గురవుతుండడంతో.. అక్కడి రైతుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమను నిండా ముంచిన బీఆర్‌ఎస్‌ను మహారాష్ట్రలో అడుగు పెట్టనీయబోమని హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా చేస్తున్నారు.

Untitled-2854.jpg

బీఆర్ఎస్‌పై జిల్లాల నేతలు విమర్శల దాడి

మరోవైపు.. బీఆర్ఎస్ హడావుడిని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన కూడా వ్యతిరేకిస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ థాకరే స్పందించకపోయినా.. జిల్లాల నేతలు మాత్రం బీఆర్ఎస్‌పై విమర్శల దాడి చేస్తున్నారు. మరాఠాల ఐక్యత, రాష్ట్ర ప్రయోజనాలను బీఆర్ఎస్ దెబ్బ తీయాలని చూస్తోందని ప్రచారం చేస్తున్నారు. సరిహద్దు గ్రామాల నేతలను ప్రలోభ పెట్టి తెలంగాణలో వీలీనం చేసుకోవాలనే కుట్ర జరుగుతోందని ఎంఎన్ఎస్ ఆరోపిస్తోంది. అయితే.. ఆయా పరిస్థితులకు తగ్గట్లే.. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటివరకు పేరున్న, బలమైన నేతలు ఎవరూ మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్‌లో చేరలేదు. ఇప్పటివరకు చేరిన వారిలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం దీపక్ మాత్రమే బలమైన నాయకుడు. మిగతా వాళ్లంతా అవుట్ డేటెడ్ లీడర్లే అన్న చర్చ సాగుతోంది.

Untitled-3054.jpg

మొత్తంగా... మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణ అనుకున్నంత సులువు కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే.. కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌తో ఉమ్మడి సరిహద్దు జిల్లాల నేతలకు టెన్షన్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో... రాబోయే రోజుల్లోనైనా.. చేరికలు ఉంటాయా?.. లేక.. ప్రస్తుత పరిణామాలే దర్శనమిస్తాయా అన్నది చూడాలి మరి.

Updated Date - 2023-02-22T11:30:13+05:30 IST