Mainampally : కుమారుడి కోసం మైనంపల్లి పక్కా ప్లాన్..అధిష్టానం ఆదేశాలతోనే స్పీడ్..!?

ABN , First Publish Date - 2023-03-01T10:58:58+05:30 IST

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది కూడా సమయం లేకపోవడంతో అన్ని పార్టీల నేతలు అలెర్టయ్యారు. సిట్టింగులు ఇప్పటికే నియోజకవర్గాల్లో ...

Mainampally : కుమారుడి కోసం మైనంపల్లి పక్కా ప్లాన్..అధిష్టానం ఆదేశాలతోనే స్పీడ్..!?

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే.. మెదక్ సీటుకు ఎసరు పెడుతున్నారా?.. పాత నియోజకవర్గంలో పాగా వేసేందుకు పక్కా ప్లాన్‌ అమలు చేస్తున్నారా?.. గతంలో రెండుసార్లు గెలిచిన హన్మంతరావు.. ఇప్పుడు.. కొడుకును బరిలోకి దించేందుకు సిద్ధమయ్యారా?.. మైనంపల్లి రోహిత్‌రావు కూడా మెదక్‌లో పర్యటిస్తూ పోటీ సంకేతాలు ఇస్తున్నారా?.. చారిటీ పేరిట సేవలు చేస్తూ.. ప్రజలతో పట్టు సాధిస్తున్నారా?.. ఇంతకీ.. మైనంపల్లి.. సడెన్‌గా మెదక్‌పై ఎందుకు ఫోకస్‌ పెట్టారు?.. అధిష్టానం ఆదేశాలతోనే రోహిత్‌రావు మెదక్‌లో స్పీడ్‌ పెంచారా?.. మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-955.jpg

సిట్టింగులు, మాజీలు, ఆశావహుల ప్రయత్నాలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది కూడా సమయం లేకపోవడంతో అన్ని పార్టీల నేతలు అలెర్టయ్యారు. సిట్టింగులు ఇప్పటికే నియోజకవర్గాల్లో తిష్టవేసి నిత్యం గ్రామాల్లో తిరుగుతున్నారు. ఆశావహులు సైతం యాక్టీవయ్యారు. టిక్కెట్‌ ఆశిస్తున్న నియోజకవర్గంలో పట్టు కోసం ప్రజలతో మమేకమవుతున్నారు. అటు సిట్టింగులు.. ఇటు మాజీలు.. వారితోపాటు ఆశావహులు.. ఇలా.. ఎవరికీ వారే ప్రజల మద్దతు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న నేతలు.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో టికెట్ రేసులోకి దూసుకొస్తున్నారు. సిట్టింగులకు పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా.. ఆ జాబితాలోకి మెదక్ కూడా చేరడం ఆసక్తి రేపుతోంది.

Untitled-1355.jpg

మెదక్ టిక్కెట్‌ రేసులోకి మరో నేత రావడంతో హీట్‌

మెదక్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం పద్మా దేవేందర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత.. బీఆర్ఎస్‌కు మెదక్ కంచుకోటలా మారింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి.. 2014, 2018లో వరసగా విజయం సాధించారు. అలాంటి.. మెదక్‌లో పోటీ చేసేందుకు ఎమ్మెల్సీ, కేసీఆర్ పొలిటికల్ సెక్రటరీగా పని చేసిన శేరి సుభాష్‌రెడ్డి ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నా రనే ప్రచారం సాగుతోంది. అయితే.. పద్మా దేవేందర్‌రెడ్డి మొదటినుంచి బీఆర్ఎస్‌లోనే ఉన్నారు. 2004లో రామాయంపేట ఎమ్మెల్యేగా ఫస్ట్ టైమ్ గెలిచారు. 2014లో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. ఆ క్రమంలో.. పద్మా దేవేందర్‌రెడ్డిని కాదని బీఆర్ఎస్ అధిష్టానం శేరి సుభాష్‌రెడ్డికి అవకాశం ఇస్తుందా? అన్నది ప్రతిసారి సస్పెన్స్‌గానే మారుతోంది. ఇప్పుడు.. అదే సమయంలో.. మరో నేత మెదక్ టిక్కెట్‌ రేసులోకి రావడం మరింత హీట్‌ పెంచుతోంది. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు.. కుమారుడు ద్వారా.. మెదక్ సిట్టింగ్ సీటుకు ఎసరు పెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

Untitled-10545.jpg

మెదక్ నుంచి బరిలోకి దింపేందుకు పక్కా ప్రణాళికలు

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు.. వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడు రోహిత్‌ను మెదక్ నుంచి బరిలోకి దింపేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నిజానికి.. మైనంపల్లి పుట్టింది మెదక్ జిల్లాలోనే. 2009లో ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగానూ గెలిచారు. హన్మంతరావు బీఆర్ఎస్‌లో చేరకముందు పద్మా దేవందర్‌రెడ్డికి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు. 2008 ఉప ఎన్నికల్లో ఆయన పద్మా దేవేందర్‌రెడ్డిని ఓడించి.. మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. టీడీపీ మెదక్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 వరకూ ఆయన మెదక్ జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. మైనంపల్లికి అక్కడి ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రతీ గ్రామంలో అభిమానులు, అనుచరులు ఉన్నారు. దాంతో.. కుమారుడు రోహిత్‌ను వచ్చే ఎన్నికల్లో పోటీకి దింపాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. తండ్రి ఆశీస్సులతో మైనంపల్లి రోహిత్ ఇప్పటికే మెదక్ నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్‌ కూడా స్టార్ట్ చేశారు.

Untitled-855.jpg

సొంత ఖర్చులతో గ్రామాల్లో మంచినీటి బోర్లు

మైనంపల్లి రోహిత్ ఎంబీబీఎస్ పూర్తి చేసి.. ప్రస్తుతం సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ పేరుతో పెద్ద ఎత్తున పేదలకు అండగా నిలుస్తున్నారు. కోవిడ్ సమయంలో నిత్యావసర సరుకులు అందించారు. తల్లిదండ్రులు లేని వారికి, వితంతువులకు సొంత డబ్బులతో డిపాజిట్ చేసి భవిష్యత్‌కు భరోసా ఇచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక.. తరచూ ఉచిత కంటి శిబిరాలు, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ పేదలకు వైద్య సహాయం చేస్తున్నారు. సొంత ఖర్చులతో గ్రామాల్లో మంచినీటి బోర్లు వేయిస్తున్నారు. మెదక్‌లో తండ్రికి మంచి ఫాలోయింగ్ ఉండడంతోపాటు.. ఛారిటీ ద్వారా చేస్తున్న సేవలు.. వచ్చే ఎన్నికల్లో రోహిత్‌కు కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్నారు.

Untitled-125.jpg

కొడుకును ప్రోత్సహించడం వెనుక అధినేత అనుమతి ఉందా?

ఇక.. మెదక్‌పై కన్నేసిన మైనంపల్లి రోహిత్ ఇప్పటికే ఎంట్రీ కూడా ఇచ్చారు. ఇటీవల నియోజకవర్గంలో పర్యటించి పోటీ సంకేతాలు పంపారు. అటు.. రోహిత్ పర్యటనకు ప్రజల నుంచి కూడా అనూహ్య స్పందన వచ్చింది. స్వచ్ఛందంగా తరలి వచ్చి గ్రాండ్‌ వెల్ కమ్‌ చెప్పారు. ఆయన కూడా చారిటీ ద్వారా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు ముమ్మరం చేశారు. అయితే.. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న చోట హన్మంతరావు.. తన కొడుకును ప్రోత్సహించడం వెనుక పార్టీ అధినేత అనుమతి ఉందా అనే చర్చ మొదలైంది. అయితే.. కేసీఆర్ సర్వేలో మెదక్ ఎమ్మెల్యే పని తీరుపై నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలిచి మూడోసారి అధికారంలోకి రావాలంటే పనితీరు సరిగాలేని ఎమ్మెల్యేలకు ఈ సారి టికెట్ ఇవ్వొద్దని గులాబీబాస్‌ ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. మెదక్‌లో హన్మంతరావు.. కొడుకును ఎంకరేజ్ చేస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఇన్‌డైరెక్ట్ ఇండికేషన్స్ ఉండడం వల్లే రోహిత్ మెదక్‌లో పర్యటన చేస్తున్నారని ప్రచారం సాగుతోంది.

Untitled-1154.jpg

మొత్తంగా... మెదక్‌ ఎమ్మెల్యే సీటుపై కన్నేసిన మైనంపల్లి.. ఆ దిశగా ముమ్మరంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఎన్నికల నాటికి మెదక్‌లో రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.

Updated Date - 2023-03-01T11:56:14+05:30 IST