Ambati Rambabu: వైఎస్ఆర్ మద్యపాన నిషేధం చేశారా? తాగి మాట్లాడుతున్నారా?

ABN , First Publish Date - 2023-08-18T19:17:27+05:30 IST

ఇటీవల ఓ సభలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. వైఎస్ఆర్ జలయజ్ఞంతో పాటు మద్యపాన నిషేధం కూడా చేశారని చెప్పుకొచ్చారు. దీంతో ప్రజలు వైసీపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అంబటి రాంబాబు తాగి మాట్లాడుతున్నారా అంటూ నిలదీస్తున్నారు. అసలు ఆయన సోయలో ఉండే వ్యాఖ్యలు చేస్తున్నారా లేదా మండిపడుతున్నారు.

Ambati Rambabu: వైఎస్ఆర్ మద్యపాన నిషేధం చేశారా? తాగి మాట్లాడుతున్నారా?

2019 ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అందులో మద్యపాన నిషేధం కూడా ఉంది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీని తుంగలో తొక్కింది. ప్రతిపక్షాలు ఈ అంశంపై అధికార పక్షాన్ని నిలదీయగా సీఎం జగన్ మాట మార్చారు. మద్యపాన నిషేధాన్ని దశల వారీగా చేస్తామని.. ధరలు పెంచితే మద్యపానం తగ్గుముఖం పడుతుందని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. గత నాలుగున్నరేళ్లలో మద్యపాన నిషేధంపై ప్రభుత్వ నేతలు అనేక రకాలుగా పిల్లిమొగ్గలు వేశారు. పైగా ఇప్పుడు సాక్షాత్తూ మంత్రులు అబద్ధాలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఇటీవల ఓ సభలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. వైఎస్ఆర్ జలయజ్ఞంతో పాటు మద్యపాన నిషేధం కూడా చేశారని చెప్పుకొచ్చారు. దీంతో ప్రజలు వైసీపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అంబటి రాంబాబు తాగి మాట్లాడుతున్నారా అంటూ నిలదీస్తున్నారు. అసలు ఆయన సోయలో ఉండే వ్యాఖ్యలు చేస్తున్నారా లేదా మండిపడుతున్నారు.

గతంలో వైఎస్ఆర్ మద్యపాన నిషేధం చేశారని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించడం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నిజంగా ఆయన మద్యపానం నిషేధిస్తే సదరు వివరాలను బయటపెట్టాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని మాట ఇచ్చి.. ఇప్పుడు మడమ తిప్పి ప్రజలను మోసం చేసిందే కాకుండా ఇప్పుడు అబద్ధపు ప్రచారాలను చేస్తారా అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

పేద కుటుంబాలు ఇబ్బంది పడే సమస్యల్లో మద్యపానం ప్రధానమైనది. రోజువారీ సంపాదనలో మగవాళ్లు తాగుడుకు ఎక్కువ ఖర్చుపెడుతుంటారు. దీంతో చాలా కుటుంబాలు తినడానికి తిండి కూడా లేక అల్లాడుతుంటాయి. అయితే ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో మద్యం మీద వచ్చేది భారీగా ఉంటుంది. అందుకే ప్రభుత్వాలు మద్యపాన నిషేధం చేసేందుకు వెనకడుగు వేస్తాయి. కానీ పేదవాళ్లు సంతోషంగా ఉండాలంటే మద్యనిషేధం తప్పనిసరి. మద్యపాన నిషేధం అమల్లోకి తెస్తే ప్రభుత్వాలు పడిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఇవేమీ లెక్క చేయకుండా వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్ర సందర్భంగా ఇష్టానుసారం హామీలు ఇచ్చారు. అందులో మద్యపాన నిషేధం కూడా ఉంది. వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వడానికి ఈ హామీ ప్రధాన పాత్ర పోషించింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మద్యంపై వచ్చే ఆదాయంపైనే జగన్ సర్కారు ఆధారపడింది. దీంతో మద్యపాన నిషేధం హామీని పూర్తిగా విస్మరించింది.


అసలు జరిగింది ఇదీ..!!

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైన్ షాపులలో మద్యం ధరలను అమాంతం పెంచేసింది. దీనిపై ప్రశ్నించగా మద్య నిషేధం చేయాలంటే మద్యం ధరలు పెంచక తప్పదని జగన్ వివరించిన సందర్భాలు ఉన్నాయి. మద్యం తాగాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితులు కల్పిస్తామని, పెద్దపెద్ద మాల్స్, ఫైవ్ స్టార్ హోటల్స్ లో మాత్రమే మద్యం అందుబాటులో ఉండేలా చేస్తామని బీరాలు పలికింది. ఈ పరిణామంతో పొరుగు రాష్ట్రాల నుండి అక్రమ మద్యం ఏరులై పారింది. దీనిని కట్టడి చేయటానికి జగన్ ప్రభుత్వం నానాతంటాలు పడింది. పైపెచ్చు అనేక రకాల కొత్త రకం బ్రాండ్లను మార్కెట్‌లోకి విడుదల చేసి అప్పటి వరకు ఉన్న బ్రాండ్లలో దాదాపు 90% బ్రాండ్‌లపై నిషేధం విధించింది. దీంతో బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్, పెన్షన్ 3000, ఆంధ్రా గోల్డ్ వంటి బ్రాండ్లు మార్కెట్‌లోకి వచ్చాయి. కల్తీ మద్యం కూడా విచ్చలవిడిగా ఏరులై పారింది.

ఇప్పుడు అసత్య ప్రచారాలు ఎందుకు?

ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీ నేతలు ఇప్పుడు కొత్తరకం పల్లవిని అందుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే మంత్రి అంబటి రాంబాబు గతంలో వైఎస్ఆర్ మద్యపాన నిషేధం చేశారని ప్రజలను నమ్మించేందుకు అసత్య ప్రచారానికి తెరతీశారు. తాము చెప్పిన హామీపై ప్రజల నుంచి పక్కదారి పట్టించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. వైఎస్ఆర్ పేరును వాడుకుంటూ ఆయన చేయని పని కూడా చేసినట్లు ప్రచారం మొదలుపెట్టారని సోషల్ మీడియాలో నెటిజన్‌లు మండిపడుతున్నారు.

Updated Date - 2023-08-18T19:17:27+05:30 IST