Lokesh On CBN Arrest : చంద్రబాబును చూసి తట్టుకోలేకపోయా.. చాలా బాధగా ఉంది!
ABN , First Publish Date - 2023-10-01T20:41:56+05:30 IST
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు (TDP Chief Chandrababu) అక్రమ అరెస్టుపై.. ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు...
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు (TDP Chief Chandrababu) అక్రమ అరెస్టుపై.. ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆదివారం నాడు ఢిల్లీ వేదికగా లోకేష్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు న్యాయస్థానాల్లో తప్పకుండా న్యాయం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తనకు న్యాయ వ్యవస్థపై పూర్తిగా నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు తప్పు చేయకున్నా ఇన్ని రోజులు జైల్లో ఉండటమే బాధగా ఉందని.. దీనిపైన ఖచ్చితంగా జాతీయ స్థాయిలో చర్చ తప్పకుండా జరగాల్సిందేనన్నారు.
తట్టుకోలేకపోయా..!
‘రాజమండ్రి జైలులో చంద్రబాబును చూసి తట్టుకోలేకపోయాను. సీఎంగా ఆయన ప్రారంభించిన బ్లాక్‌లోనే ఆయన్ను ఉంచడం బాధేసింది. చేయని తప్పుకు జైలుకు పంపితే ఇంకెవరైనా రాజకీయల్లోకి వస్తారా..?. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజలకు సేవ చేయడానికి నీతిమంతులు రాజకీయల్లోకి రారు. తెలుగుదేశం ఏనుగు లాంటిది.. పరిగెత్తడం మొదలుపెడితే ఆగదు. అధికారంలోకి రాగానే తప్పు చేసిన అధికారులపై న్యాయవిచారణకు ఆదేశిస్తాము. రెడ్ డైరీతో పాటు రెడ్ ఫోన్ కూడా సిద్దమవుతోంది. సైకో జగన్ ఆటలు ఎంతో కాలం సాగవు. ప్రజలకు అన్నీ అర్ధమవుతున్నాయి.. జగన్‌పై ప్రజలు కసితో ఉన్నారు’ అని లోకేష్ పేర్కొన్నారు.
బాధిస్తోంది..!
‘చంద్రబాబుకు క్రెడిబిలిటీ ఉంది కాబట్టే ప్రజలంతా కదిలివచ్చి.. నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిరసనల్లో టీడీపీ వాళ్ళ కన్నా సామాన్య ప్రజలే ఎక్కువగా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు నిరసన తెలుపుతున్నారు. ఒక్క ఆధారం కూడా చూపకుండా చంద్రబాబును జైల్లో పెట్టడమే నా మనస్సును బాధిస్తోంది. నాన్న అరెస్ట్ తర్వాత ప్రజాగ్రహం చూసి సైకో జగన్‌కు వణుకు పుడుతోంది. శాంతిభద్రతలను కాపాడే ఏకైక పార్టీ టీడీపీ.. అందుకే శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే హెరిటేజ్ ఆస్తులు పెరిగాయి’ అని లోకేష్ క్లియర్‌కట్‌గా చెప్పుకొచ్చారు.
హాజరవుతున్నా..!
సీఐడీ (CID) నోటీసులపైన కూడా మొదటిసారిగా లోకేష్ స్పందించారు. కచ్చితంగా అక్టోబర్-04 తారీఖున సీఐడీ విచారణకు హాజరవుతానని యువనేత స్పష్టం చేశారు. సీఐడీ అధికారులు అడిగిన వివరాలన్నీ ఇస్తానని.. తప్పు చేయనప్పుడు తాను ఎందుకు భయపడాలి..? అని లోకేష్ చెప్పుకొచ్చారు. కాగా పొత్తుపై మాట్లాడిన లోకేష్.. త్వరలో టీడీపీ-జనసేన కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేస్తామని మీడియాకు వెల్లడించారు. మరోవైపు.. ఇవాళ అవనిగడ్డ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జగన్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. జనసేన-టీడీపీ కూటమికి మద్దతివ్వాలని.. మళ్లీ జగన్‌కు ఓటేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలని పవన్ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై మాట్లాడుతోంటే తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని సేనాని ఒకింత భావద్వేగానికి లోనయ్యారు.