Siddaramaiah vs DK Shivakumar: కర్ణాటక సీఎంపై అధిష్ఠానానికీ నో క్లారిటీ!.. ఫైనల్‌గా రాహుల్, సోనియా గాంధీల సపోర్ట్ ఎవరికంటే...!

ABN , First Publish Date - 2023-05-16T18:41:38+05:30 IST

కర్ణాటక తదుపరి సీఎం విషయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతోపాటు అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ రంగంలోకి దిగినా ఎలాంటి పురోగతి కనిపించడంలేదు. అయితే నాయకత్వంలో ఎవరు ఎవరివైపు ఉన్నారో తెలియవస్తోంది...

Siddaramaiah vs DK Shivakumar: కర్ణాటక సీఎంపై అధిష్ఠానానికీ నో క్లారిటీ!.. ఫైనల్‌గా రాహుల్, సోనియా గాంధీల సపోర్ట్ ఎవరికంటే...!

కర్ణాటక ఎన్నికల్లో సాధించిన అద్భుత విజయాన్ని సంపూర్ణంగా ఆస్వాదించకముందే కాంగ్రెస్‌లో సీఎం పీఠం చిక్కులు తెచ్చిపెట్టింది. పార్టీ కురువృద్ధుడు సిద్ధరామయ్య, పార్టీ విధేయుడిగా పేరున్న డీకే శివకుమార్ (Siddaramaiah vs DK Shivakumar) ఇద్దరూ సీఎం పదవి కోసం పట్టుబట్టారు. తగ్గేదేలా లేదంటూ భీష్మించుకున్నారు. ఈ పరిణామమే కాంగ్రెస్ అధిష్ఠానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఎటూ తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన శనివారం నుంచి కసరత్తు జరుగుతున్నా ఇప్పటికీ ఓ కొలిక్కిరాలేకపోతోంది పార్టీ హైకమాండ్. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతోపాటు అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ రంగంలోకి దిగినా ఎలాంటి పురోగతి కనిపించడంలేదు.

సోనియా ఎవరివైపు ఉన్నారంటే..

కర్ణాటక సీఎంగా సీనియర్ నాయకుడు సిద్ధరామయ్యను ఎంపిక చెయ్యాలా? లేదా... పార్టీ పట్ల విధేయతతో గెలుపు కోసం శ్రమించిన డీకే శివకుమార్‌కే పట్టం కట్టాలా? అనే విషయంలో నాయకత్వం తేల్చుకోలేకపోతోంది. ఈ అంశంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వంలోనూ ఏకాభిప్రాయం సాధ్యపడడం లేదు. అయితే సీనియర్ నాయకుడైన సిద్ధరామయ్య వైపే ఎక్కువ మొగ్గు కనిపిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇద్దరూ సిద్ధూ వైపే మొగ్గుచూపుతున్నారని అంటున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు సైతం సిద్ధూకే మద్ధతుగా నిలుస్తున్నట్టుగా ఓ జాతీయ మీడియా రిపోర్ట్ పేర్కొంది. అయితే కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాత్రం కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పట్ల సానుకూలంగా ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్పినట్టు తెలిపింది.

కాగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాత్రం సీఎం అభ్యర్థిత్వంపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అంతకంటే ముందు సంప్రదింపులు జరపాలని ఆయన నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం ఎంపిక బాధ్యతను ఖర్గేకు అప్పగిస్తూ పార్టీ ఇదివరకే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎల్‌పీ భేటీలో ఏకగ్రీవంగా ఏకవాక్య తీర్మానం చేసిన విషయం తెలిసిందే.

ఇక కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, కర్ణాటకలో పార్టీ వ్యవహారాలను చూసుకున్న రణ్‌దీప్ సూర్జేవాలా తటస్థంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా సీఎం అభ్యర్థిని ఎంపిక చేసి ప్రకటించనున్న నేపథ్యంలో పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో రాహుల్ గాంధీ మంగళవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో సూర్జేవాలా కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. మరోవైపు డీకే శివకుమార్ మంగళవారమే న్యూఢిల్లీ చేరుకున్నారు. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై పార్టీ పెద్దలతో ఆయన చర్చించనున్నారు. ఇక సీఎం రేసులో ముందున్న సిద్ధరామయ్య సోమవారం సాయంత్రమే హస్తిన చేరుకున్నారు. ఇదిలావుండగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ సమష్టిగా పోరాడడంతో బీజేపీ అధికారానికి దూరమైంది. ఏకంగా 135 సీట్లతో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-05-16T19:01:53+05:30 IST