Visakhapatnam: విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీలో వేడెక్కుతున్న రాజకీయాలు
ABN , First Publish Date - 2023-03-24T11:31:59+05:30 IST
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందనే సామెత ఇప్పుడు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేకి అతికినట్టు సరిపోతుంది. ఈ నియోజకవర్గానికి వాసుపల్లి ...
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు ఆ నేతకు గుబులు పుట్టిస్తున్నాయా... ఎన్నికల్లో ఓటమి చెందిన అధికార పార్టీ అభ్యర్థి ఇప్పుడు అసెంబ్లీ వైపు చూస్తున్నారా... అసెంబ్లీ టిక్కెట్ కోసం పట్టుబడితే అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేకు మొండి చేయి చూపనుందా... తనకు టిక్కెట్ వస్తుందా... రాదా అన్న టెన్షన్ ఎక్కువైందా... ఇంతకీ ఆ నేత ఎవరు... అనే వివరాలు ఏబీఎన్ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..
రాజకీయ భిక్షపెట్టిన టీడీపీని వంచించిన గణేష్
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందనే సామెత ఇప్పుడు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేకి అతికినట్టు సరిపోతుంది. ఈ నియోజకవర్గానికి వాసుపల్లి గణేష్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన వైసీపీ పంచన చేరారు. రాజకీయ భిక్ష పెట్టి, ఎమ్మెల్యేను చేసిన టీడీపీని వంచించి... ఫ్యాన్ పార్టీ పంచన చేరడం చాలా మంది తెలుగు తమ్ముళ్లకు నచ్చలేదు.. దీంతో ఆ నియోజకవర్గంలో చాలా మంది స్థానిక నేతలు, కార్యకర్తలు ఆయన వెంట వెళ్లలేదు. పార్టీ మీద అభిమానంతో చాలా మంది తెలుగుదేశంలోనే ఉండిపోయారు.
వాసుపల్లికి వ్యతిరేకంగా మూడు, నాలుగు గ్రూప్‌లు
టీడీపీలో ఉన్నప్పుడు వాసుపల్లి గణేష్ కుమార్ జగన్ మీద, వైసీపీ సర్కారు మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. అంతే కాదు విన్నూత రీతిలో నిరసనలు చేసి ఆకట్టుకునే వారు. ఇదంతా బాగా గుర్తుకు పెట్టున్న వైసీపీ నేతలు, క్యాడర్ వాసుపల్లి వైసీపీలోకి వచ్చినా టీడీపీ నేతగానే చూసేవారు. ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ఎంతమాత్రం ఇష్టపడేవారు కాదు. అందుకే దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లికి వ్యతిరేకంగా మూడు, నాలుగు గ్రూప్‌లు పనిచేస్తున్నాయి. ఇందులో బలమైనది ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ గ్రూప్ అని చెప్పవచ్చు. వాసుపల్లికి వ్యతిరేకంగా సీతంరాజు సుధాకర్ దక్షిణ నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. నిరుపేదలకు కుట్టుమిషన్లు, దుస్తుల పంపిణీ, గర్భిణులకు సామూహిక సీమంతాలు చేస్తూ నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేకంగా ఒక వర్గాన్ని తయారుచేసుకున్నారు.
అధిష్టానానికి తన గోడు వెళ్లబోసుకున్న వాసుపల్లి
ఈ పరిణామాలు ఎమ్మెల్యే వాసుపల్లికి మింగుడుపడలేదు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గ టిక్కెట్ కేటాయింపుపై సుధాకర్‌కు అధిష్ఠానం హామీ ఇచ్చిందంటూ ఆయన వర్గీయులు ప్రచారం ప్రారంభించారు. ఈ విషయం తెలిసిన వాసుపల్లి హైకమాండ్ వద్దకు వెళ్లి తన గోడు విన్నవించుకున్నారు. అయితే సుధాకర్ సంగతి మేము చూసుకుంటాము... మీరు మీ నియోజకవర్గంలో పనిచేసుకోండి, వచ్చే ఎన్నికల్లో మీకే టికెట్ ఇస్తామని వైసీపీ హైకమాండ్ మాట ఇచ్చిందని వాసుపల్లి వర్గీయులు చెప్పుకుంటున్నారు.
అన్ని పార్టీలకంటే ముందుగానే సీతంరాజు పేరు ప్రకటన
ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానాన్ని ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశ్యంతో అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్ధిగా సీతంరాజు సుధాకర్ పేరును ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తనకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోయిందని ఊపిరి పీల్చుకున్నారు. ఆయన ఎమ్మెల్సీగా గెలిస్తే... దక్షిణ నియోజకవర్గంలో తనకే టికెట్ వస్తుందని వాసుపల్లి భావించారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీతంరాజు తరుపున కూడా ప్రచారం చేసి... ఆయనకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. ఇక్కడ వాసుపల్లి స్వార్ధం కూడా ఉందని గుసగుసలు వినబడ్డాయి.. ఎలాగైనా సుధాకర్‌ని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తే... తనకు ప్రధాన అడ్డంకి తొలగుతుందని ఇష్టం లేకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేశారని టాక్...
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ ఓటమి
అయితే వాసుపల్లి అనుకున్నది ఒక్కటి... జరిగింది ఇంకొకటి అయింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో... ఇప్పడు సీతంరాజు సుధాకర్ కన్ను మళ్లీ దక్షిణ నియోజకవర్గంపై పడిందని విశాఖలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెండి నాణేలు, కోట్లాది రూపాయాల డబ్బులు ఖర్చు పెట్టి, నష్టపోయారని... కాబట్టి, వచ్చే ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గం టికెట్ ఇవ్వాలని ఆయన వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి సీతంరాజు సుధాకర్‌కి కూడా దక్షిణ నియోజకవర్గంలో పోటీ చేసి శాసనసభకు వెళ్లాలని ఆలోచనగా ఉండేది. కానీ హైకమాండ్ ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేయమని ఆదేశించడంతో తప్పని సరిస్థితిలో తలవంచి పోటీ చేసి చేయి కాల్చుకున్నారు.
డైలమాలో పడిన అధిష్టానం
ఆర్ధికంగా ఎంతో నష్టపోయాను కాబట్టి తనకు ఎలాగైనా దక్షిణం టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని సుధాకర్ కోరుతున్నారట. అందుకు హైకమాండ్ కూడా ఓకే అన్నదని సీతంరాజు వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు. టికెట్ తమకే ఇస్తామని హైకమాండ్ మాట ఇచ్చిందని ఇటు వాసుపల్లి వర్గీయులు కూడా చెప్పుకుంటున్నారు... ఈ వ్యవహారం ఇప్పుడు పార్టీ అధిష్టానం వద్దకు చేరడంతో....డైలమాలో పడినట్లు తెలుస్తోంది. ఇద్దరిలో ఏ ఒకరికి టికెట్ ఇచ్చినా... పార్టీకి వెన్నుపోట్లు తప్పవు.. కాబట్టి ఈ ఇద్దరికి కాకుండా మూడో వ్యక్తికి ఇస్తే ఎలా ఉంటుందో అని హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం...