Prathipati Pulla Rao Selfie Challenge: మంత్రి రజినీకి పెద్ద కష్టమే వచ్చిందిగా.. ఇప్పుడేం చేస్తారో..!
ABN , First Publish Date - 2023-04-22T13:17:03+05:30 IST
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచింది. మీరు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా వచ్చి సంవత్సరం దాటింది. 2018లో నేను రూ. 19 కోట్ల నాబార్డు నిధులతో..
చిలకలూరిపేట అర్బన్: ‘వైసీపీ ప్రభుత్వం (YCP Govt) అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచింది. మీరు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా వచ్చి సంవత్సరం దాటింది. 2018లో నేను రూ. 19 కోట్ల నాబార్డు నిధులతో తీసుకువచ్చిన వంద పడకల ఆస్పత్రి నిర్మాణం ఎందుకు చేయలేక పోయారు’అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సెల్ఫీ ఛాలెంజ్ ద్వారా సూటిగా ప్రశ్నించారు. పలనాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని పసుమర్రు రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిని శుక్రవారం మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సందర్శించారు.
అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఫిబ్రవరి 2019న శంకు స్థాపన చేసి ఎన్నికల సమయానికి 30 శాతం నిర్మాణం శరవేగంగా పూర్తి చేశామని, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే హోదాలో మీరు హాస్పటల్‌ను సందర్శించి జరుగుతున్న నిర్మాణ పనులను మీ కమిషన్‌ల కక్కుర్తి కోసం సంవత్సరం పాటు నిలిపి వేశారని పుల్లారావు మండి పడ్డారు. అనంతరం ఏపీఎం ఎస్‌ఐడీసీ అధికారులు, ఇంజనీర్లు సూచనతో మరలా పనులు ప్రారంభించారని, ఎందుకు ఆపారో ఎందుకు ప్రారంభించారో ప్రజలందరికీ తెలుసు అన్నారు. నిధుల కొరత లేకున్నా సంబంధిత మంత్రిగా ఉండి కనీసం సొంత నియోజక వర్గంలో ఇన్నాళ్ళు ఆస్పత్రి నిర్మాణం ఎందుకు పూర్తి చేయలేక పోయారని ప్రశ్నించారు.
నిత్యం సామాజిక మాధ్యమాల్లో సంబందం లేని కార్యక్రమాల్లో కన్పిస్తూ వ్యక్తి గత ప్రతిష్ఠ పెంచుకోవటం వల్ల ప్రజలకు ఏం ఉపయోగం లేదన్నారు. 30 పడకల ఆస్పత్రిలో కూడా 13మంది మాత్రమే ఇన్‌ఫేషెంట్లు ఉన్నారని, డాక్టర్లు మాత్రం 14 మంది, మిగతా సిబ్బంది పదుల సంఖ్యలో ఉన్నారని, రాష్ట్రంలో ఇన్‌పేషెంట్లకు ఆహార సౌకర్యం లేని ఏకైక ఆస్పత్రి మన చిలకలూరిపేట ఒకటేనని మండిపడ్డారు. శానిటేషన్ అద్వాన్నంగా ఉందని, శానిటేషన్‌కు వచ్చే లక్షల నిధులు మంత్రి అనుచరులు పంచుకుంటున్నారని పుల్లారావు ఆరోపించారు.
ఎన్‌టీఆర్ పుట్టిన రోజు నుంచి పట్టణంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయబోతున్నామని, ఈ లోగా ఇన్‌పేషెంట్లకు ఆహార సౌకర్యం ఏర్పాటు చేయకుంటే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇన్‌పేషెంట్లకు రెండు పూటలా అన్న క్యాంటీన్ నుంచి భోజనాలు ఏర్పాటు చేస్తామని ఛాలెంజ్ చేశారు. నేను తెచ్చిన వంద పడకల ఏరియా ఆస్పత్రి సత్వరమే పూర్తి చేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రే రిబ్బన్ కట్ చేసుకోవాలని, లేకుంటే వచ్చే సంవత్సరం ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేసి మేమే రిబ్బన్ కటింగ్ చేపడతామని ప్రత్తిపాటి పుల్లారావు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.