Guntur District టీడీపీలో టిక్కెట్ల గోల..ఒకపక్క జనసేనతో పొత్తు ఉంటుందన్న భావన..

ABN , First Publish Date - 2023-02-11T13:00:07+05:30 IST

ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీకి బలమైన నాయకులు ఉన్నారు. ఆ నాయకులంతా సీనియర్లు కావడంతో వారు మాట్లాడిన మాటలు

Guntur District టీడీపీలో టిక్కెట్ల గోల..ఒకపక్క జనసేనతో పొత్తు ఉంటుందన్న భావన..

ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది ఆ జిల్లా టీడీపీ నేతల పరిస్థితి. నాకంటే.. నాకే.. టికెట్ అంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆ జిల్లాలో కలకలం రేపుతున్నాయి. చైతన్యవంతమైన జిల్లాలో ఏంటీ టికెట్ల గోల అని క్యాడర్‌ కూడా తల పట్టుకుంటోంది. అరడజను మంది నేతలు టికెట్లపై చేసిన కామెంట్స్ ఇప్పుడు టీడీపీలో కాక రేపుతున్నాయి. ఇంతకీ.. ఏంటా జిల్లా?.. టిక్కెట్లపై ప్రకటన చేసిన నేతలెవరు?.. అనే మరిన్ని విషయాలను ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-2254.jpg

ఇష్టమైన నేతకు టికెట్ వస్తుందో రాదో అన్న గుబులు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీకి బలమైన నాయకులు ఉన్నారు. ఆ నాయకులంతా సీనియర్లు కావడంతో వారు మాట్లాడిన మాటలు అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అయితే.. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉండగా.. టికెట్లపై టీడీపీ నేతలు చేస్తున్న కామెంట్స్‌ అభిమానులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఒకపక్క జనసేనతో పొత్తు ఉంటుందన్న భావన.. మరోవైపు ఇష్టమైన నేతకు టికెట్ వస్తుందో రాదో అన్న చర్చ ఇప్పటినుండే కార్యకర్తల్లో మొదలైంది.

ఇతర నియోజకవర్గాల నేతల్లోనూ గుబులు

వాస్తవానికి.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో టికెట్ల తేనె తుట్టెను మొట్టమొదట కదిపింది మాజీ మంత్రి ఆలపాటి రాజా అని చెప్పొచ్చు. ఆలపాటి.. తెనాలి నుండే పోటీ చేయాలని రాసి పెట్టిలేదని.. చంద్రబాబు ఎక్కడ నుండి పోటీ చేయమంటే అక్కడ నుండి బరిలో దిగుతానని ప్రకటించడం చర్చగా మారింది. అయితే.. జనసేనతో పొత్తు ఉంటుందనే భావనతో.. ఆ టికెట్ నాదెండ్ల మనోహర్‌కు ఇస్తారన్న ప్రచారం జరిగింది. దానికి అనుగుణంగానే.. ఆలపాటి కామెంట్స్‌ చేశారనే టాక్‌ నడుస్తోంది. ఆలపాటి రాజా చేసిన వ్యాఖ్యలు.. గుంటూరు జిల్లా ఇతర నియోజకవర్గాల నేతల్లోనూ గుబులు పుట్టించాయి.

Untitled-2554.jpg

టికెట్ ఇస్తే ఓడిస్తామన్న వ్యాఖ్యలతో దూమారం

మరోవైపు.. ఆలపాటి ఎపిసోడ్‌కు కొనసాగింపుగా మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇటీవల చేసిన కామెంట్స్‌.. రాజకీయంగా మరింత హీట్ పెంచాయి. తాడికొండ సీటు తోకల రాజవర్ధనరావుకే అంటూ రాయపాటి మాట్లాడడం టీడీపీలో మంటలు రేపింది. అయితే.. గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా, తాడికొండ ఇన్‌చార్జ్‌గా ఉన్న తెనాలి శ్రావణకుమార్ రాయపాటి కామెంట్స్‌ను ఖండించారు. టికెట్లు ఇచ్చేది చంద్రబాబు.. రాయపాటి కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో తాడికొండ నుండి బరిలోకి దిగేది తానేనని శ్రావణకుమార్ స్పష్టం చేశారు. అంతేకాదు.. కడప వాళ్లకి నర్సరావుపేట పార్లమెంట్ టికెట్ ఇస్తే ఓడిస్తామన్న రాయపాటి వ్యాఖ్యలు కూడా అంతే దూమారం రేపాయి. దానిపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు రియాక్ట్‌ అయ్యారు. టికెట్ ఎవరికి ఇవ్వాలనేది చంద్రబాబు నిర్ణయిస్తారని.. కాదని.. ఇంకెవరూ మాట్లాడినా.. అది వారి వ్యక్తిగత అభిప్రాయమేనని తెలిపారు.

Untitled-2645.jpg

వ్యక్తిగత అభిప్రాయాలతో పార్టీకి నష్టం

ఇక.. వచ్చే ఎన్నికల్లో అందరం కలిసి పని చేస్తామని ప్రత్తిపాటి పుల్లారావు చెప్పుకొచ్చారు. టీడీపీ పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్న సమయంలో వ్యక్తిగత అభిప్రాయాలతో పార్టీకి నష్టం కల్గించవద్దని యరపతినేని సూచించారు. అలా సీనియర్లంతా ఏడాది ముందు నుండే టికెట్ల విషయంలో విరుద్ధ ప్రకటనలు చేస్తుండడంతో టీడీపీ అభిమానుల్లో అందోళన నెలకొంది. కార్యకర్తలు కూడా ఆయా నేతల వ్యాఖ్యలపై చర్చోపచర్చలు చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సీనియర్ నేతలు టికెట్లు గురించి బహిరంగంగా మాట్లాడడం పార్టీకి ఇబ్బంది కల్గించే అంశమని మరికొందరు భావిస్తున్నారు. ఏదేమైనా.. పరిస్థితి శృతి మించకముందే చంద్రబాబు జోక్యం చేసుకొని సీనియర్లను కట్టడి చేయాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు. అయితే.. గుంటూరు జిల్లా సీనియర్‌ నేతల ఇష్టారీతి ప్రకటనలపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Untitled-2805.jpg

Updated Date - 2023-02-11T13:00:17+05:30 IST