Kavitha Vs Sukesh : కవిత సంచలన ప్రకటనపై సుకేష్ లాయర్ స్ట్రాంగ్ రియాక్షన్.. ఇంత మాట అనేశారేంటి..?
ABN , First Publish Date - 2023-04-13T18:46:14+05:30 IST
మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) మధ్య వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ల వార్ నడుస్తోంది...
మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) మధ్య వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ల వార్ నడుస్తోంది. బుధవారం నాడు ఇదిగో ఆధారాలంటూ సుకేష్ స్క్రీన్ షాట్లను (Sukesh Screen Shots) రిలీజ్ చేయగా పెద్ద సంచలనమే అయ్యింది. దీనిపై ఇవాళ కవిత ఓ ప్రకటన రూపంలో వివరణ కూడా ఇచ్చుకున్నారు. అసలు సుకేష్ ఎవరో తనకు తెలియదని.. ఆయనతో తనకేంటి పనని.. కొన్ని మీడియా సంస్థలు కావాలనే పనిగట్టుకుని ఇలా చేస్తున్నాయంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. సుకేష్ వార్తకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో తన ప్రకటన తాలుకూ వార్తకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలంటూ మీడియాకు ఒకింత ఛాలెంజ్ కూడా చేశారామె. కవిత ప్రకటనపై సుకేష్ చంద్రశేఖర్ లాయర్ అనంత్ మాలిక్ (Sukesh Advocate Anant Malik) స్పందించారు.
ఇలా అనేశారేంటి..?
‘ నా క్లయింట్ సుకేష్ చంద్రశేఖర్ లేవనెత్తిన నిజాలపై కవిత ప్రతిస్పందన చిన్న పిల్లల ప్రకటనలా ఉంది. సుకేష్ తన వాదనలకు మద్దతుగా అనేక డిజిటల్ సాక్ష్యాలను అందజేశారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లోని సెక్షన్ 65- బి ప్రకారం వాంగూల్మం కూడా సుకేశ్ జత చేశాడు. ఈ విషయంలో న్యాయమైన విచారణను స్వాగతించే బదులు, కవిత ఆమె దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. న్యాయమైన, అనుభవజ్ఞుడైన, నిఖార్సైన రాజకీయ నేత ఎవరైనా ఈ విషయంలో విచారణను స్వాగతిస్తారు. తద్వారా నిజం బయటపడుతుంది. అయితే కవిత ప్రతిస్పందన, ఏజెన్సీల నుంచి దాగుడు మూతలు ఆడినట్లు ఉంది. కవిత తన ప్రకటనలో తన వాక్పటిమ నైపుణ్యాన్ని చూపారు. మీడియా, రాజకీయ పార్టీలపై బ్లేమ్ గేమ్‌లాగా కవిత ప్రకటన ఉంది. ప్రస్తుత విషయం ప్రత్యేక ఏజెన్సీల ప్రత్యేక పరిశోధనకు సంబంధించినది. సాధారణ ప్రజలలో ప్రజాదరణ పోటీకి సంబంధించిన విషయం కాదు. ఈ వారంలోనే నా క్లయింట్ ద్వారా దీనిపై వివరణాత్మక ప్రతిస్పందన అందించబడుతుంది’ అని కవితకు అనంత్ మాలిక్ కౌంటర్ ఇచ్చారు.
కవిత ఏమన్నారంటే..
‘సుఖేశ్‌తో నాకు ఎలాంటి పరిచయం లేదు. గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, మరీ ముఖ్యంగా నా మీద ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. అసలు సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో నాకు పరిచయం కూడా లేదు. అతనెవరో కూడా నాకు తెలియదు. కానీ వాస్తవాలను ఏవీ పట్టించుకోకుండా, కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో, పనిగట్టుకొని తప్పుడు వార్తలు ప్రచురించాయి. ఇదివరకు నా మొబైల్ ఫోన్ల విషయంలో కూడా ఇలాగే తొందరపడి వార్తలు రాసి తరువాత తోక ముడిచారు. మళ్లీ ఇప్పుడు క్రిమినల్ సుఖేష్‌ను పావుగా వాడుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని వారి కుటుంబ సభ్యులను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నాయి. నా మీద బురద జల్లే వార్తలకు కొన్ని మీడియా సంస్థలు ఇచ్చిన అగ్ర ప్రాధాన్యత, దమ్ముంటే, నిజాయితీ ఉంటే నా వివరణకి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. తెలంగాణ బిడ్డలం తలవంచం.. తెగించి కొట్లాడుతాం..! జై తెలంగాణ... జై భారత్’ అని కవిత వివరణ ఇచ్చుకున్నారు.
మొత్తానికి చూస్తే.. ఇటు కవిత రియాక్ట్ అవ్వడం వెంటనే సుకేష్ లాయర్ నుంచి కౌంటర్ రావడం జరిగిపోయింది. అయితే అనంత్ మాలిక్ మాత్రం కాస్త ఘాటుగానే స్పందించారు. ఈ కౌంటర్‌పై బీఆర్ఎస్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే.