YSRCP Meeting: సస్పెన్షన్ పేరుతో మరో జగన్నాటకం.. వైసీపీలో మీటింగ్‌లో క్రిమినల్..!!
ABN , First Publish Date - 2023-09-27T12:51:21+05:30 IST
మంగళవారం నాడు సీఎం జగన్ నిర్వహించిన వైసీపీ మీటింగ్‌కు అనంత్‌బాబు హాజరుకావడం చర్చకు దారి తీసింది. ఇప్పటికే చాలా అంశాల్లో జగన్నాటకాలను నడిపిస్తున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు మరోసారి మీడియాకు అడ్డంగా దొరికిపోయారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
దళిత యువకుడు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలైన ఎమ్మెల్సీ అనంత్‌బాబును తమ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ గతంలో ప్రకటించింది. అయితే మంగళవారం నాడు సీఎం జగన్ నిర్వహించిన వైసీపీ మీటింగ్‌కు అనంత్‌బాబు హాజరుకావడం చర్చకు దారి తీసింది. ఇప్పటికే చాలా అంశాల్లో జగన్నాటకాలను నడిపిస్తున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు మరోసారి మీడియాకు అడ్డంగా దొరికిపోయారని కామెంట్లు వినిపిస్తున్నాయి. తమ పార్టీలో నీతిమంతులకే చోటు ఉంటుందని కట్టుకథలు వినిపించిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు సస్పెండ్ చేసిన వ్యక్తిని ఎలా మీటింగ్‌ను పిలిచారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. వైసీపీలో క్రిమినల్స్, గుండాలకే చోటు ఉంటుందని సంకేతాలు ఇస్తున్నారా అని నిలదీస్తున్నారు.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం మరణానికి తానే బాధ్యుడిని అని ఎమ్మెల్సీ అనంత్‌బాబు తమకు వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో.. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మే 25, 2022న తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రెస్‌నోట్ విడుదల చేసింది. అంటే హత్య జరిగిన ఆరు రోజులకు ఈ సస్పెన్షన్ చోటు చేసుకుంది. ఆ తర్వాత అనంత్‌బాబుపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ఎక్కడా ప్రకటించలేదు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీ ముఖ్య నేతలతో సీఎం జగన్ నిర్వహించిన సమావేశానికి అనంత్‌బాబు ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది. వల్లభనేని వంశీ మోహన్, పేర్ని నాని మధ్య అనంత్‌బాబు కూర్చున్న ఫోటోలు మీడియాలో దర్శనమిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్‌లు వైసీపీ తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు.
ఇదేం కొత్త కాదు
క్రిమినల్స్‌కు వైసీపీలో పెద్దపీట వేస్తున్నారని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ మాత్రమే. గత నెలలో కూనవరంలో వరద ప్రాంతాల పరిశీలనకు సీఎం జగన్ వెళ్లిన సమయంలో అక్కడ నిర్వహించిన సమావేశంలో సీఎంతో పాటు వేదికపై అనంత్‌బాబు కూడా కనిపించారు. అంతేకాకుండా అనంత్‌బాబు బెయిల్‌పై విడుదలైన సమయంలో ఆయన ఫ్లెక్సీలకు వైసీపీ నేతలు దండలు వేయడం, పాలాభిషేకాలు చేయడం వంటి ఘటనలు కూడా ప్రజలు గమనించారు. ఈ ఘటనపై అప్పట్లో టీడీపీ యువ నేత నారా లోకేష్ కూడా స్పందించారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను అత్యంత కిరాతకంగా చంపిన ఎమ్మెల్సీ అనంతబాబుకు సీఎం జగన్ పాలాభిషేకం చేయించారని.. జైల్లో సకల సౌకర్యాలు, బయట ఫ్లెక్సీలతో ఊరేగింపులు చూస్తుంటే దళితులపై సాగుతున్న దమనకాండ అంతా జగన్ కనుసన్నల్లోనే జరుగుతోందని స్పష్టమవుతోందని లోకేష్ ఆరోపించిన సంగతిని పలువురు నెటిజన్‌లు గుర్తు చేస్తున్నారు.