Chandra Babu Jr NTR: చంద్రబాబు-జూనియర్‌ల కలయిక... జోష్‌లో టీడీపీ క్యాడర్
ABN , First Publish Date - 2023-01-11T17:36:01+05:30 IST
ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ కోసం నందమూరి వారసులు ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుతో కలిసి వస్తారా...? చాలా రోజులుగా ఈ ప్రశ్న వినపడుతూనే ఉంది. కానీ చంద్రబాబుతో చాలా రోజుల తర్వాత..
ఎన్టీఆర్ (Sr NTR) స్థాపించిన టీడీపీ (TDP) కోసం నందమూరి వారసులు (Nandamuri Family) ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుతో (Jr NTR Chandra Babu) కలిసి వస్తారా...? చాలా రోజులుగా ఈ ప్రశ్న వినపడుతూనే ఉంది. కానీ చంద్రబాబుతో చాలా రోజుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మాట కలపటం, తారకరత్న లోకేష్‌తో భేటీ కావటం ఇప్పుడు టీడీపీ వర్గాల్లో కొత్త జోష్‌ను నింపుతోంది. RRR మూవీలోని నాటు నాటు సాంగ్‌కు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కింది. దీనిపై చిత్ర యూనిట్‌కు అన్ని వైపుల నుండి ప్రశంసలు అందుతుండగా, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా చిత్ర యూనిట్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. దీనికి ‘థాంక్యూ మావయ్యా’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ అపాయ్యంగా రియాక్ట్ కావటం టీడీపీ వర్గాల్ని ఆనందంలో ముంచెత్తుతున్నాయి.
చాలాకాలంగా జూనియర్ ఎన్టీఆర్.. చంద్రబాబుతో అంటీముట్టనట్లుగా ఉంటున్నారని వైసీపీ నెగిటివ్‌గా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి ఫ్యామిలీ అంతా బాబుతోనే ఉన్నా ఎన్టీఆర్ మాత్రం దూరంగా ఉంటున్నారని సోషల్ మీడియాలో వైసీపీ ప్రచారం చేసింది. ఆ తర్వాత కొడాలి నాని అనుచిత వ్యాఖ్యల సమయంలో, ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు వ్యవహరంలో జూనియర్ స్పందనపై కొందరు టీడీపీ నేతలే పెదవి విరిచిన పరిస్థితి. వైసీపీ కూడా జూనియర్ సపోర్ట్ తమకే అన్నట్లుగా ప్రచారం చేసుకుంది. ఫ్లెక్సీల్లోనూ ఎన్టీఆర్ ఫోటోలు వేసుకుంది.
కానీ, ముందుస్తు ఎన్నికలు ఖాయం అనుకుంటున్న సమయంలో RRR మూవీ ఈ దుష్ప్రచారాన్ని తిప్పి కొడుతూ ఇద్దరినీ కలిపింది. నిజానికి ఇది అకస్మాత్తుగా జరిగిన పరిణామం కాదని... తారకరత్న లోకేష్‌తో భేటీ కావటం, టీడీపీ నుండి పోటీకి సిద్దమవటంతో పాటు గతంలో టీడీపీని వీడిన వారంతా సొంతగూటికి వచ్చేస్తున్న తరుణంలో జూనియర్ కూడా చంద్రబాబుకు అండగా ఉండేందుకు నిర్ణయించుకున్నారని, అందులో భాగమే ఇదన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి. చాలాకాలంగా మెగా అభిమానులతో ఎన్టీఆర్ సఖ్యతగా ఉండటం, పవన్ కళ్యాణ్-చంద్రబాబు పొత్తు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. కారణం ఏదైనా జూనియర్ మళ్లీ చంద్రబాబుతో ఆప్యాయంగా పలకరింపులు చూస్తే... టీడీపీ మరింత బలపడటం ఖాయమని క్యాడర్ ఫుల్ జోష్‌లో ఉంది.