CBN Letter : జైలు నుంచి చంద్రబాబు బహిరంగ లేఖ.. ఒక్క క్షణం కూడా..!
ABN , First Publish Date - 2023-10-22T17:10:05+05:30 IST
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) సుమారు 40 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో (Rajahmundry Central Jail) ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న బాబు.. జైలులో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజల గురించే ఆలోచిస్తున్నారు..
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) సుమారు 40 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో (Rajahmundry Central Jail) ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న బాబు.. జైలులో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. దసరా సందర్భంగా తెలుగు ప్రజలకు జైలు నుంచి బహిరంగ లేఖ (CBN Open Letter) రాశారు. ప్రజలు, టీడీపీ శ్రేణులకు ధైర్యం చెబుతూ ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు. కాగా.. కుటుంబ సభ్యులతో ములాఖత్ సందర్భంగా చంద్రబాబు తన అభిప్రాయాలు, ఆలోచనలను రాష్ట్ర ప్రజలకు లేఖ రాయాలని కోరారు. ఆయన చెప్పిన అంశాలను పొందుపరిచి బాబు పేరిట కుటుంబ సభ్యులు లేఖను విడుదల చేశారు.
త్వరలోనే బయటికొస్తా..!
‘నేను జైలులో లేను.. ప్రజల హృదయాల్లో ఉన్నాను. ప్రజల నుంచి నన్ను ఒక్క క్షణం కూడా ఎవ్వరూ దూరం చేయలేరు. 45 ఏళ్లుగా నేను కాపాడుకుంటూ వస్తున్న విలువలు, విశ్వసనీయతను ఎవరూ చెరిపేయలేరు. ఆలస్యమైనా న్యాయం గెలుస్తుంది.. నేను త్వరలో బయటకొస్తాను. ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాను. ఓటమి భయంతో జైలు గోడల మధ్య బంధించి ప్రజలకు నన్ను దూరం చేశామనుకుంటున్నారు. నేను ప్రస్తుతం ప్రజల మధ్యలో లేకపోవచ్చు.. అభివృద్ధి రూపంలో ప్రతీ చోటా కనిపిస్తాను. సంక్షేమం పేరు వినిపించిన ప్రతీసారి నా పేరే తలుస్తారు. తెలుగు ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు’ అని లేఖలో బాబు రాశారు.
మేనిఫెస్టో రిలీజ్ చేస్తా..!
‘జైలు గోడల మధ్య కూర్చుని ఆలోచిస్తూ ఉంటే 45 ఏళ్ల ప్రజా జీవితం నా కళ్ల ముందు కదలాడుతోంది. నా రాజకీయ ప్రస్థానమంతా తెలుగు ప్రజల అభివృద్ధి.. సంక్షేమమే లక్ష్యంగా సాగింది. కుట్రలతో నాపై అవినీతి ముద్ర వేయాలని ప్రయత్నించారు కానీ.. నేను నమ్మిన విలువలు, విశ్వసనీయతని ఎన్నడూ చెరిపేయలేరు. ఈ చీకట్లు తాత్కాలికమే.. సత్యం అనే సూర్యుడి ముందు కారుమబ్బులు వీడిపోతాయి. సంకెళ్లు నా సంకల్పాన్ని బంధించలేవు. జైలు గోడలు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవు. జైలు ఊచలు నన్ను ప్రజల నుంచి దూరం చేయలేవు. నేను తప్పు చేయను.. చేయనివ్వను. ఈ దసరాకి పూర్తిస్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తానని రాజమహేంద్రవరం మహానాడులో ప్రకటించాను. అదే రాజమహేంద్రవరం జైలులో నన్ను ఖైదు చేశారు. త్వరలో బయటకొచ్చి పూర్తిస్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తాను’ అని పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు అభయమిచ్చారు.
నా బలం, ధైర్యం మీరే!
‘నా ప్రజల కోసం, వారి పిల్లల భవిష్యత్తు కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాను. ఎప్పుడూ బయటకు రాని స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి బిడ్డ, నా భార్య భువనేశ్వరిని నేను అందుబాటులో లేని ఈ కష్టకాలంలో ప్రజల్లోకి వెళ్లి వారి తరఫున పోరాడాలని నేను కోరాను. ఆమె అంగీకరించింది. నా అక్రమ అరెస్టుతో తల్లడిల్లి మృతి చెందిన వారి కుటుంబాలని పరామర్శించి, అరాచక పాలనను ఎండగట్టడానికి ‘‘నిజం గెలవాలి’’ అంటూ మీ ముందుకు వస్తోంది. జనమే నా బలం, జనమే నా ధైర్యం. దేశవిదేశాలలో నా కోసం రోడ్డెక్కిన ప్రజలు వివిధ రూపాల్లో మద్దతు తెలుపుతున్నారు. నా క్షేమం కోసం కుల, మత, ప్రాంతాలకు అతీతంగా మీరు చేసిన ప్రార్థనలు ఫలిస్తాయి. న్యాయం ఆలస్యం అవ్వొచ్చునేమో కానీ, అంతిమంగా గెలిచేది మాత్రం న్యాయమే. మీ అభిమానం, ఆశీస్సులతో త్వరలోనే బయటకి వస్తాను. అంతవరకూ నియంత పాలనపై శాంతియుత పోరాటం కొనసాగించండి. చెడు గెలిచినా నిలవదు.. మంచి తాత్కాలికంగా ఓడినట్లు కనిపించినా కాలపరీక్షలో గెలిచి తీరుతుంది. త్వరలోనే చెడుపై మంచి విజయం సాధిస్తుంది’ అని లేఖలో చంద్రబాబు రాశారు. ప్రస్తుతం ఈ లేఖ గురించే ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు.. టీడీపీ శ్రేణులు ఈ లేఖను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
లేఖ ఇదే..