Devineni Uma: జగన్‌కు అదే పని.. జైలులో చంద్రబాబు నిద్రపోకుండా మరో కుట్ర..!!

ABN , First Publish Date - 2023-09-16T15:10:30+05:30 IST

రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును నిద్రపోకుండా తరచూ శబ్దాలు చేయాలని అక్కడి సిబ్బందికి జగన్ ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని దేవినేని ఉమా ఆరోపించారు.

Devineni Uma: జగన్‌కు అదే పని.. జైలులో చంద్రబాబు నిద్రపోకుండా మరో కుట్ర..!!

వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ సంచలన ఆరోపణలు చేశారు. అర్ధరాత్రి పూట చంద్రబాబును అరెస్ట్ చేసిన జగన్ ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. అంతేకాకుండా అర్ధరాత్రి పూటే రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారని ఆరోపించారు. జైలులో చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించిన భువనేశ్వరికి ములాఖత్‌కు అనుమతి ఇవ్వడం లేదని.. వారంలో కేవలం రెండుసార్లు మాత్రమే ములాఖత్‌కు పర్మిషన్ ఇస్తామని జైలు అధికారులు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని విధాలుగా కుట్రలు చేయాలో అన్ని విధాలుగా చేస్తోందని.. జైలులో కనీసం చంద్రబాబుకు నిద్రలేకుండా చేస్తోందని దేవినేని ఉమ సంచలన ఆరోపణలు చేశారు.

రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును నిద్రపోకుండా తరచూ శబ్దాలు చేయాలని అక్కడి సిబ్బందికి జగన్ ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని దేవినేని ఉమా ఆరోపించారు. విజిల్స్ వేయడం, జైలు ఊచలను లాఠీలతో కొట్టడంతో ఆ శబ్దాలకు నిద్రలేకుండా బాధపడుతున్న చంద్రబాబును సీసీ కెమెరాలలో చూసి జగన్ సైకో ఆనందం పొందుతున్నారని దేవినేని ఉమా విమర్శించారు. శుక్రవారం, శనివారం, ఆదివారం వస్తే చాలు జగన్ నిద్రపోకుండా ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరిని హింసించాలని ఆలోచించుకుంటూ కూర్చుంటాడని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాగానే తొలి రెండేళ్లలో జేసీబీలతో పాలన మొదలుపెట్టిన జగన్.. ఇప్పుడు అక్రమ అరెస్టులతో పాలన కొనసాగిస్తున్నారని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.

devineni uma.jpg

అటు చంద్రబాబు అరెస్టుతో మాజీ మంత్రి దేవినేని ఉమా దేశం వదిలి పారిపోయాడని బ్లూ మీడియాలో విషప్రచారం జరుగుతోంది. ఆయన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారని.. అందుకే దేవినేని ఉమా పారిపోయారంటూ కథనాలను ప్రసారం చేస్తోంది. ఈ వార్తలను చూసిన టీడీపీ అభిమానులు మండిపడుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుంచి తన నియోజకవర్గంలో జరుగుతున్న నిరసనల్లో దేవినేని ఉమా పాల్గొంటున్నారని.. శుక్రవారం కొండపల్లి మున్సిపాలిటీలో రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న ఆయన.. శనివారం నాడు టీడీపీ అభిమానులు చేపట్టిన మేము సైతం నిరాహార దీక్షల్లో పాల్గొని వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసినట్లు వీడియోలు విడుదల చేస్తున్నారు. వైసీపీ నేతలకు విషప్రచారం చేయడం అలవాటేనని.. అబద్దాలు చెప్పడంలో దిట్ట అని సోషల్ మీడియాలో నెటిజన్‌లు దుమ్మెత్తి పోస్తున్నారు.

Updated Date - 2023-09-16T15:13:13+05:30 IST