Karnataka Election Result: బీజేపీ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి 6 కారణాలు ఇవే...
ABN , First Publish Date - 2023-05-13T18:41:00+05:30 IST
కన్నడనాట అధికార పార్టీ బీజేపీకి ఈ స్థాయి ఘోర వైఫల్యం ఎందుకు ఎదురైంది? ఇంతలా డీలాపడడానికి కారణాలు ఏమిటి?.. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ఆసక్తిగల విశ్లేషణలను ఒకసారి పరిశీలిద్దాం...
కన్నడనాట బీజేపీ (BJP) బొక్కబోర్లాపడింది... అధికారాన్ని నిలబెట్టుకోవడం ఖాయమనుకుంటే ఆశాభంగమే ఎదురైంది... కనీసం హంగ్ అయినా వస్తుందని కలలుగంటే ఘోర పరాభవమే ఎదురైంది... కాంగ్రెస్ జోరులో కాషాయదళం కేవలం 64 సీట్లకే పరిమితమైంది. మరోవైపు కాంగ్రెస్ (Congress) పార్టీ ఏకంగా 136 సీట్లతో చరిత్రాత్మక విజయాన్ని లిఖించింది. అయితే కన్నడనాట అధికార పార్టీ బీజేపీకి ఈ స్థాయి ఘోర వైఫల్యం ఎందుకు ఎదురైంది? ఇంతలా డీలాపడడానికి కారణాలు ఏమిటి?.. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ఆసక్తిగల విశ్లేషణలను ఒకసారి పరిశీలిద్దాం...
1. బెడిసికొట్టిన మతరాజకీయం...
ఎన్నికలకు ఏడాది ముందు కర్ణాటక బీజేపీ నేతలు ఏదో ఒక మత సంబంధమైన అంశాలను వివాదాస్పదంగా లేవనెత్తుతూ వచ్చారు. హలాల్, హిజాబ్, అజాన్‌తోపాటు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల తర్వాత ‘బజరంగ్ దళ్’ అంశాన్ని కూడా రాజకీయాస్త్రంగా వాడుకున్నారు. అయితే మతపరమైన ఈ అంశాలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించినప్పటికీ కర్ణాటకలో బీజేపీకి ఏమాత్రం సానుకూలమవ్వలేదు. హిందూత్వ కార్డ్ ఇతర రాష్ట్రాల్లో బీజేపీకి అక్కరకొచ్చిందేమో కానీ కర్ణాటకలో ఏమాత్రం కలిసి రాలేదని ఫలితాలను చూస్తే స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
2. బీజేపీ అవినీతిని బలంగా జనాల్లోకి తీసుకెళ్లిన కాంగ్రెస్..
బీజేపీ అవినీతిని ఎత్తిచూపుతూ ‘40 శాతం కమిషన్ ప్రభుత్వం’ అంటూ కాంగ్రెస్ సాగించిన ప్రచారం ఎన్నికల్లో అద్భుతంగా పనిచేసింది. బీజేపీ అవినీతిని ఎండగడుతూ కాంగ్రెస్ చేసిన ఈ నినాదం క్రమంగా జనాల్లోకి ప్రబలంగా వెళ్లింది. దీనికితోడు అవినీతి ఆరోపణలపై కేఎస్ ఈశ్వరప్ప తన మంత్రి పదవికి రాజీనామా చేయడం కాంగ్రెస్ ప్రచారానికి మరింత ఆజ్యం పోసింది. కర్ణాటక స్టేట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆ మంత్రి గురించి ఏకంగా ప్రధాన నరేంద్ర మోదీకే ఫిర్యాదు చేయడం మరింత ప్లస్ అయ్యింది. ఇవన్నీ రాష్ట్రంలో బీజేపీ గెలుపుపై తీవ్రంగా ప్రభావం చూపాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
3. ప్రభుత్వ వ్యతిరేక గాలికి విరుగుడు లేదు...
ప్రభుత్వ వ్యతిరేకతకు విరుగుడుని కనుగొనడంలో బీజేపీ నాయకత్వం సమర్థవంతంగా వ్యవహరించలేకపోయిందనే రాజకీయ నిపుణులు చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడంలో విఫలమవ్వడంతో జనాలు బీజేపీకి వ్యతిరేకంగా కసితీరా ఓట్లు వేసినట్టు కనిపిస్తోందని పేర్కొంటున్నారు.
4.బలమైన నేతలు దూరంగా ఉండడం..
కర్ణాటకలో బీజేపీ ఘోర పరాభవానికి ఆ పార్టీ తరపున బలమైన నేతలెవరూ కనిపించకపోవడం ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప స్థానంలో బసవరాజ్ బొమ్మైని నాయకత్వం తీసుకొచ్చింది. అయితే రాష్ట్ర పురోగతి, మార్పుల విషయంలో జనం కోరుకున్న విధంగా బసవరాజ్ బొమ్మై పాలన అందించడంలో విఫలమయ్యారన్న వాదనలున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి డీకే శివకుమార్, సిద్ధరామయ్య వంటి బలమైన నేతలు కనిపిస్తుండడం బీజేపీని తీవ్రంగా దెబ్బతీసింది. ఈ పరిణామమే కర్ణాటక బీజేపీని బలంగా దెబ్బకొట్టిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నారు.
5. పాపులారిటీ ఉన్న నేతలు దూరంగా..
కర్ణాటక బీజేపీలో అత్యంత కీలకమైన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఈ ఎన్నికల్లో అంత చురుకుగా పాల్గొనలేదు. అంతేకాదు మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్, మాజీ ఉపముఖ్యమంత్రి లక్ష్మణ్ సవదిలకు ఈ ఎన్నికల్లో టికెట్ కూడా దక్కలేదు. దీంతో ఎన్నికల బరిలో దిగేందుకు వీరిద్దరూ కాంగ్రెస్‌లో చేరిపోయారు. యడియూరప్ప, జగదీశ్ షెట్టర్, లక్ష్మణ్ సవది.. వీరు ముగ్గురూ లింగాయత్ వర్గానికి చెందినవారు ప్రబలమైన నేతలు. వీరిని బీజేపీకి ప్రతికూలంగా మారిందనే చర్చ నడుస్తోంది.
6. లింగాయత్ వర్గానికి దూరమవ్వడం...
ఎన్నికల ప్రచారంలో బీజేపీ పలు వాగ్ధానాలు చేసింది. ముఖ్యంగా ఆధిపత్య వర్గాలకు చెందిన ఓట్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా పలు హామీలు గుప్పించింది. ఈ వాగ్ధానాలను లింగాయత్ వర్గం విశ్వసించలేదు. అంతేకాదు దళిత్, ఆదివాసి, ఓబీసీతోపాటు వక్కలింగా ఓట్లు కూడా బీజేపీకి దూరమయ్యాయి. ఇదే సమయంలో ముస్లిం, దళితులు, ఓబీసీల ఓటర్లను తమవైపు నిలుపుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విజయవంతమైంది. అంతేకాదు లింగాయత్‌లు కూడా కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గుచూపేలా కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా వ్యహరించడం బీజేపీకి మైనస్ అయ్యింది.