AP Politics: ఏపీలో దొంగ ఓట్ల కలకలం.. మీ ఓటు ఉందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి..!!
ABN , First Publish Date - 2023-08-22T13:24:56+05:30 IST
భారత ఎన్నికల సంఘం 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ మేరకు ఓటు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులను జారీ చేస్తోంది. ఓటర్ కార్డులో EPIC నంబర్‌ను జారీ చేస్తోంది. ఈ నంబర్ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటును ఓటర్ జాబితాలో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ EPIC నంబర్ గుర్తులేకపోతే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ లేదా వయసు, నియోజకవర్గం వివరాలు, మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే మీ ఓటు వివరాలు వస్తాయి.
ఏపీలో ప్రస్తుతం దొంగ ఓట్ల నమోదు కలకలం సృష్టిస్తోంది. ఓట్ల నమోదు ప్రక్రియ సందర్భంగా అధికార పార్టీ వైసీపీ నేతలు దొంగ ఓట్లను జాబితాలో చేరుస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది అధికారులు కూడా వైసీపీ నేతలకు సపోర్ట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఉరవకొండ నియోజకవర్గంలో 6వేల దొంగ ఓట్లు చేర్పించారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా జిల్లా పరిషత్ సీఈవో భాస్కర్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు పలు నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి అక్రమాలే జరుగుతున్నాయని టీడీపీ, జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.
మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమకు అనుకూలంగా లేని ఓట్లను తీసివేసి దొంగ ఓట్లను సృష్టించే పనిలో అధికార పార్టీ వైసీపీ ఉందని ఇప్పటికే ప్రతిపక్షాల నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అనేక నియోజకవర్గాల్లో కొన్ని కుటుంబాలకు ఓట్లు లేవని.. మరికొన్ని చోట్ల కుటుంబంలో ఒకరికి ఓటు ఉంచి మిగతా అర్హులను జాబితా నుంచి తొలగించినట్లు సమాచారం అందుతోంది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల సున్నా డోర్ నంబర్‌తో దొంగ ఓట్లు సృష్టించినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా ఉరవకొండలో దొంగ ఓట్ల వ్యవహారం నడుస్తోందని ఏడాది కాలంగా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి మొరపెట్టుకోగా తాజాగా చర్యలు తీసుకున్నారు. అలాంటిది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని.. ఎన్నికల సంఘం అధికారులు ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ప్రతిపక్షాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
మీ ఓటు ఉందో లేదో ఇలా చెక్ చేయండి
భారత ఎన్నికల సంఘం 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ మేరకు ఓటు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులను జారీ చేస్తోంది. ఓటర్ కార్డులో EPIC నంబర్‌ను జారీ చేస్తోంది. ఈ నంబర్ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటును ఓటర్ జాబితాలో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ EPIC నంబర్ గుర్తులేకపోతే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ లేదా వయసు, నియోజకవర్గం వివరాలు, మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే మీ ఓటు వివరాలు వస్తాయి.
1) ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే ముందుగా ఓటరు అధికారిక వెబ్‌సైట్ https://electoralsearch.eci.gov.in ఓపెన్ చేయాలి
2) ఆ తర్వాత మీ రాష్ట్రం పేరు, భాషను ఎంటర్ చేయాలి
3) అనంతరం పర్సనల్ డిటైల్స్ నమోదు చేయాలి. ఈ సందర్భంగా మీ పేరు, చిరునామా, వయస్సు, జెండర్, EPIC నంబర్, మొబైల్ నంబర్, నియోజకవర్గం వంటి వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత సెర్చ్ బటన్ క్లిక్ చేయాలి. ఈ ప్రాసెస్ తర్వాత ఓటరు జాబితా మీ ముందు విండోలో కనిపిస్తుంది. అక్కడ మీరు మీ పేరును కనుగొనవచ్చు.
మీరు మీ పేరును చూడటానికి క్రిందికి స్క్రోల్ చేయవచ్చు. ఎవరికైనా EPIC నంబర్ తెలియకుంటే వారు తమ పేరు, పుట్టిన తేదీ, అసెంబ్లీ నియోజకవర్గం వంటి వారి వ్యక్తిగత వివరాల ద్వారా ఎన్నికలలో ఓటరు జాబితాలో తమ పేరును చూసుకోవచ్చు. ఆ తర్వాత వారి EPIC నంబర్, పోలింగ్ బూత్ వివరాలను తెలుసుకోవచ్చు.
ఒకవేళ ఎలాంటి వివరాలు రాకపోతే మీ ఓటు కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓటర్ల జాబితాలో పేరు లేని వారితో పాటు ఈ ఏడాది అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండుతున్న వాళ్లంతా ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం ఎన్నికల సంఘం కల్పిస్తోంది. అంతే కాకుండా ఓటర్లు తమ చిరునామా మార్చుకునే అవకాశం కూడా ఉంది. ఈ మేరకు ఓటరు జాబితా సవరణ షెడ్యూల్‌ను ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.