Secunderabad: కంటోన్మెంట్‌లో టికెట్ రేస్..వచ్చే ఎన్నికల్లో తామే రేస్‌లో ఉంటామని ఎవరికివారు సంకేతాలు..!
ABN , First Publish Date - 2023-03-31T11:27:06+05:30 IST
దేశంలోనే సైనికుల ఆధీనంలో ఉన్న అతిపెద్ద కంటోన్మెంట్ అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో.... రెండున్నర లక్షల మందికిపైగా ఓటర్లు
గ్రేటర్ హైదరాబాద్‌లో ఆ ఎమ్మెల్యే మరణం తర్వాత అందరి చూపు ఆ అసెంబ్లీ స్థానంపైనే పడింది. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన ఆశావహుల సంఖ్య పెరిగింది. ఎన్నికలకు ముందుగానే నేతల పోటాపోటీ కార్యక్రమాలతో కంటోన్మెంట్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇంతకీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్‌ఎస్‌లో ఏ జరుగుతుంది...? పార్టీ టికెట్ ఇచ్చినా.... ఇవ్వకపోయినా రానున్న ఎన్నికల బరిలో సత్తా చాటుతా అంటున్న ఆ నేత ఎవరు..? అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..
టికెట్ రేస్‌లో శ్రీ గణేష్, క్రిశాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్...
దేశంలోనే సైనికుల ఆధీనంలో ఉన్న అతిపెద్ద కంటోన్మెంట్ అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో.... రెండున్నర లక్షల మందికిపైగా ఓటర్లు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న ఏకైక ఎస్సీ నియోజకవర్గం కంటోన్మెంట్. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరపున 2018లో సాయన్న భారీ మెజార్టీతో గెలుపొందారు. సాయన్న మరణంతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ పెద్దదిక్కును కోల్పోయింది. దివంగత ఎమ్మెల్యే సాయన్న మరణం తర్వాత కంటోన్మెంట్ బీఆర్‌ఎస్‌లో టికెట్ ఆశిస్తున్న నేతలు, ఆశావహులు భారీగా పెరిగారు. ఒక్క అధికార పార్టీ నుంచే పలువురు బీఆర్ఎస్ నేతలు పోటీకి సై అంటున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీ గణేష్, క్రిశాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్, దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తెలు లాస్య నందిత, నివేదిత, బీఆర్‌ఎస్ సీనియర్ నేత గజ్జల నగేష్ ఇలా పలువురు పార్టీ టికెట్ కోసం ఇప్పటినుంచే కంటోన్మెంట్లో పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతున్నారు. క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తామే రేస్‌లో ఉంటామని ఎవరికివారు సంకేతాలు ఇస్తున్నారు. కారు పార్టీ టికెట్ తమకే అన్నట్టు కలర్ ఇస్తున్నారు.
క్యాడర్‌కు అందుబాటులో ఉంటున్న సాయన్న కుమార్తెలు
ఇప్పటికే దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతుర్లు లాస్య నందిత, నివేదిత క్యాడర్‌కు అందుబాటులో ఉంటూ తాము బరిలో ఉన్నాం ఉన్న సంకేతాలు ఇస్తున్నారు. ఇక తానేమి తక్కువ కాదన్నట్టు ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమంతో కంటోన్మెంట్‌లో యాక్టివ్‌గా ఉండే శ్రీ గణేష్ బీఆర్ఎస్ నుంచి టికెట్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నట్లు సమాచారం. 2010 నుంచి కంటోన్మెంట్ కాంగ్రెస్‌లో ఎంతో క్రియాశీలకంగా ఉన్న శ్రీ గణేష్ పిసిసి సెక్రటరీగా, షెడ్యూల్ క్యాస్ట్ డైరెక్టర్ గా పనిచేసి 2014, 18 లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. 2018లో బీజేపీ నుంచి పోటీ చేసి 16 వేలకుపైగా ఓట్లను సాధించి మూడో స్థానంలో నిలిచారు.
2019లో గులాబీ పార్టీలో చేరిన శ్రీ గణేష్
2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో శ్రీ గణేష్ కారెక్కేశారు. మంత్రి మల్లారెడ్డి, బీఆర్‌ఎస్ మల్కాజ్‌గిరి పార్లమెంటరీ ఇన్‌చార్జ్ రాజశేఖర్ రెడ్డి హామీతో గులాబీ పార్టీలో చేరారు. అప్పటినుంచి బీఆర్‌ఎస్‌లో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ నిత్యం ఏదో కార్యక్రమాలతో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. సైనికుల ఆధీనంలో ఉన్న భూభాగం కావడంతో అక్కడ ఆర్మీ అధికారుల పెత్తనమే ఎక్కువగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు చెల్లవు. భద్రత పేరుతో ఆర్మీ అధికారులు కంటోన్మెంట్‌లో రోడ్ల మూసివేతకు పాల్పడ్డారు. దీంతో ప్రజలు కిలోమీటర్ల మేర తిరిగి తమ కాలనీలకు వెళ్తున్నారు. అంతేకాకుండా ఆర్మీ ప్రాంతాల్లో నివసించే ప్రజల ఓట్ల తొలగింపు, రోడ్ల మూసివేత ఇలా అనేక సమస్యలపై శ్రీ గణేష్ పోరాడుతూ వస్తున్నారు. దాంతో పాటు తన ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీతో సంబంధం లేకుండానే ప్రజలకు దగ్గరవుతున్నారు. సొంతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్రంగా బరిలో నిలిచేందుకు శ్రీ గణేష్ రంగం సిద్ధం చేసుకున్నారనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా జరుగుతుంది. అందుకే తన ఫౌండేషన్ పేరుతో కంటోన్మెంట్ ప్రజలకు దగ్గరవుతున్నారనే టాక్ వినిపిస్తుంది.
టికెట్‌పై ధీమాగా ఉన్న సాయన్న కుమార్తెలు
దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తెలు లాస్య నందిత, నివేదిత బీఆర్‌ఎస్ టికెట్ తమకే దక్కుతుందన్న ధీమాతో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించిన సమయంలో వారి వారసులకే టికెట్ ఇచ్చే సంప్రదాయం బీఆర్‌ఎస్‌లో ఉందని.... అదే తమకు ప్లస్ అవుతుందని వారు భావిస్తున్నారు. నియోజకవర్గంలో వారు కూడా సొంతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న అనుచరులు, అభిమానులు ఎలాగూ తమకే అండగా ఉన్నారని... బీఆర్‌ఎస్ నాయకత్వం తమకే టికెట్ ఇస్తుందని వారు భావిస్తున్నారు.
మరోవైపు బీఆర్‌ఎస్ నేతలు క్రిశాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్, నగేష్ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. అధిష్టానంతో టికెట్ కోసం ఇప్పటి నుంచే సంప్రదింపులు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి పార్టీకి అండగాఉన్న తమకే టికెట్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. తెలంగాణ సాధన కోసం ఎన్నో త్యాగాలు చేశామని చెబుతున్నారు. మొత్తానికి ఓవైపు ఎన్నికల సమయం సమీపిస్తుండడం, మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు సైతం ఖాళీ కావడంతో కంటోన్మెంట్ పాలిటిక్స్ హాట్‌హాట్‌గా మారాయి.