Jaya SudhaBJP : జయసుధకు కాషాయ కండువా కప్పి.. ఆ ఇద్దరికీ చెక్ పెట్టాలని కిషన్ రెడ్డి ప్లాన్.. రచ్చ.. రచ్చ!
ABN , First Publish Date - 2023-07-29T18:18:37+05:30 IST
టాలీవుడ్ సీనియర్ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ (Jaya Sudha) బీజేపీ (BJP) తీర్థం పుచ్చుకోబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) సమక్షంలో జయసుధ కాషాయ కండువా కప్పుకోబోతున్నారని తెలియవచ్చింది. అయితే..
టాలీవుడ్ సీనియర్ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ (Jaya Sudha) బీజేపీ (BJP) తీర్థం పుచ్చుకోబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) సమక్షంలో జయసుధ కాషాయ కండువా కప్పుకోబోతున్నారని తెలియవచ్చింది. జయసుధకు హైదరాబాద్‌లోని ప్రధాన నియోజకవర్గాలైన సికింద్రాబాద్ (Secunderabad) లేదా ముషీరాబాద్ (Musheerabad) నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా టాక్ నడుస్తోంది. ఎందుకంటే.. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఆమె గెలుపొందారు. దీంతో పార్టీలో చేర్చుకున్నాక కచ్చితంగా ఈమెను బరిలోకి దింపితే.. గెలుస్తారని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారట. అయితే.. జయసుధ పోటీపై అలా వార్తలు వచ్చాయో లేదో.. తెలంగాణ బీజేపీలో లొల్లి మొదలైంది.
స్పెషల్ ఫోకస్..!
రాజకీయాలు జయసుధకు కొత్తేమీ కాదు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి కాంగ్రెస్ తరఫున 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీచేసి.. టీడీపీ, పీఆర్పీ తరఫున పోటీచేసిన అభ్యర్థుల కంటే డబుల్ ఓట్లతో గెలిచారు. రాజకీయాల్లోకి వచ్చిన మొదటిసారే ఈమె గెలవడం అప్పట్లో పెద్ద సంచలనమే అయ్యింది. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరమైన ఈమె సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కిషన్ రెడ్డి (Kishan Reddy) చేరికలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో మాజీలు, సీనియర్ నేతలు, సెలబ్రిటీలను పార్టీలో చేర్చుకునేందుకు గాను వరుసగా చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల సినీ నటి జయసుధతో శుక్రవారం నాడు కిషన్ రెడ్డి కలిశారు. పార్టీలో చేరాలని ఆహ్వానించగా.. ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. త్వరలోనే ఢిల్లీ వేదికగా అమిత్ షా ఆధ్వర్యంలో జయసుధ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది.
రచ్చ ఎందుకంటే..?
జయసుధను పార్టీలోకి చేర్చుకుంటే కచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందే.! ఎందుకంటే గతంలో సికింద్రాబాద్ అసెంబ్లీ నుంచి గెలవడం, సెలబ్రిటీ కావడం, అంతకుమించి జనాల్లో మంచి పేరు ఉండటంతో టికెట్ ఇవ్వాలనే ఆలోచన కమలనాథుల్లో కూడా ఉందట. అయితే.. సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ నుంచి బరిలోకి దింపుతారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు టికెట్‌పై కిషన్ రెడ్డి-జయసుధ (Kishan Reddy-Jayasudha) మధ్య చర్చలు కూడా జరిగినట్లు తెలియవచ్చింది. ముషీరాబాద్ అనే మాట వచ్చేసరికి జయసుధ పార్టీలో చేరక ముందే లొల్లి మొదలైంది. ఎందుకంటే.. ముషీరాబాద్ నుంచి తన అనుచరులకు ఇప్పించుకోవాలని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ (MP Lakshman) భావిస్తున్నారు. మరోవైపు.. ముషీరాబాద్ నుంచి తన కుమార్తె విజయలక్ష్మిని బరిలోకి దింపాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) భావిస్తున్నారు. ఈ మధ్య బీజేపీ కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా ఉన్నారు. ‘అలయ్ బలయ్’ (Alai Balai) కార్యక్రమం బాధ్యతలు కూడా విజయలక్ష్మికే దత్తన్న అప్పగించారు. ఇలా ఇప్పుడిప్పుడే రాజకీయాలకు తన వారసత్వాన్ని పరిచయం చేస్తున్నారు. దీంతో.. లక్ష్మణ్, దత్తాత్రేయలకు చెక్ పెట్టేలా కిషన్ రెడ్డి.. జయసుధను పక్కా ప్లాన్ ప్రకారమే.. పార్టీలోకి తీసుకొస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కాగా.. ఆ మధ్య చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కూడా మాజీ ఎమ్మెల్యేతో భేటీ అయిన సంగతి తెలిసిందే.
మొత్తానికి చూస్తే.. ఇద్దరి మధ్య జరుగుతున్న టికెట్ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టడానికి జయసుధను కిషన్ రెడ్డి తెరమీదకి తెచ్చారని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. చేరిక వరకూ ఓకే.. లక్ష్మణ్, దత్తాత్రేయను కాదని కేంద్రంలోని కమలనాథులు టికెట్ ఇస్తారా..? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మరోవైపు తన చేరికతో ఇలా రచ్చ జరుగుతుండటంతో జయసుధ కూడా బీజేపీలో చేరాలా.. లేకుంటే సొంత గూటికే (కాంగ్రెస్) వెళ్లాలా..? అనేదానిపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. అయితే రాజకీయాలకు జయసుధ దూరంగా ఉంటున్నప్పటికీ కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలో చేరతారని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.