Rajinikanth MohanBabu: రజనీ చుట్టూ ఇంత రచ్చ నడుస్తుంటే మోహన్‌బాబు మౌనానికి కారణం ఇదన్నమాట..!
ABN , First Publish Date - 2023-05-02T21:42:05+05:30 IST
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తమిళ నటుడు రజనీకాంత్ ఇప్పుడు కేంద్ర బిందువుగా మారారు. రజనీ చుట్టే అధికార వైసీపీ, విపక్ష టీడీపీ పరస్పరం మాటల యుద్ధం చేసుకుంటున్నాయి. రజనీకాంత్ వ్యక్తిత్వాన్ని హననం చేసే..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తమిళ నటుడు రజనీకాంత్ ఇప్పుడు కేంద్ర బిందువుగా మారారు. రజనీ చుట్టే అధికార వైసీపీ, విపక్ష టీడీపీ పరస్పరం మాటల యుద్ధం చేసుకుంటున్నాయి. రజనీకాంత్ వ్యక్తిత్వాన్ని హననం చేసే అంశాలేవైనా దొరుకుతాయేమోనని వైసీపీ గూగుల్ సెర్చ్ చేస్తుండగా, చంద్రబాబు విజన్‌ను ప్రశంసించినందుకు ఇంతకు దిగజారతారా అని టీడీపీ కౌంటర్ ఇస్తోంది. రజనీపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చౌకబారు వ్యాఖ్యలు, సిల్క్ స్మిత లేఖ పేరుతో వైసీపీ చేస్తున్న హడావుడి ఈ అంశాన్ని మరింత హాట్ టాపిక్‌గా మార్చాయి. గత రెండుమూడు రోజుల నుంచి రజనీపై వైసీపీ ఓ స్థాయిలో అవాకులుచవాకులు పేలుతుంటే ఒకరు మౌనం వహించడం మాత్రం ఇటు రాజకీయ వర్గాలతో పాటు సినీ వర్గాలను కూడా విస్మయానికి గురిచేస్తోంది.
రజనీతో తనకున్న సాన్నిహిత్యం గురించి పలు వేదికలపై సందర్భం కాకపోయినా ప్రస్తావిస్తూ.. రజనీని ‘అరేయ్ఒరేయ్’ అని పిలుస్తానని చెప్పుకునే ఆ సీనియర్ నటుడు ఎందుకు మౌనం వహిస్తున్నారనే ప్రశ్న సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ ప్రస్తావన ఎవరి గురించో ఈపాటికే అర్థమై ఉంటుంది. ఆయనే టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు. ‘వాడు’ అని సంబోధిస్తూ తమ మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి మోహన్ బాబు గతంలో రజనీ గురించి చెప్పుకొచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. వాస్తవానికి మోహన్‌బాబు, రజనీకాంత్ మధ్య చాలా ఏళ్లుగా స్నేహం ఉంది. స్వార్థానికి దూరంగా, స్నేహానికి దగ్గరగా వారి సాన్నిహిత్యం ఉండేది. ఆర్థికంగా కష్ట కాలంలో ఉన్నప్పుడు రజనీకాంత్ తనకు సాయం చేశారని మోహన్‌బాబు చెప్పిన విషయం కూడా టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు చాలామందికి తెలుసు. ఈ ఇద్దరి మధ్య ఇంత మంచి స్నేహం ఉన్నప్పటికీ రజనీ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా వైసీపీ సోషల్ మీడియా సాక్షిగా దుష్ప్రచారం చేస్తుంటే మోహన్ బాబు నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందన లేదు. ఈ పరిణామం ఈ ఇద్దరి స్నేహం గురించి తెలిసిన వారిని ఒకింత విస్మయానికి గురిచేసింది.
పైగా.. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. వైసీపీ ఇంత పనిగట్టుకుని ముప్పేట దాడికి దిగడానికి రజనీకాంత్ జగన్‌ను పల్లెత్తు మాట కూడా అనలేదు. వైసీపీ పాలన గురించి ఒక్క మాట రజనీ నోటి నుంచి వచ్చిందీ లేదు. చంద్రబాబు పాలనలో జరిగిన హైదరాబాద్ అభివృద్ధి గురించి ప్రస్తావించడమే రజనీ చేసిన పాపమైపోయింది. రజనీకాంత్‌పై అకారణంగా వైసీపీ దూషణలకు దిగుతోందని ఏపీ ప్రజలకు ఈపాటికే అర్థమైపోయింది. పైగా.. ఆ వేదికపై రజనీ మాట్లాడిన సందర్భంలో.. అక్కడున్న నందమూరి అభిమానులను ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేశారు. ‘మిమ్మల్ని చూస్తుంటే రాజకీయం మాట్లాడనిపిస్తోంది.. కానీ నా అనుభవం వద్దంటోంది’ అని రజనీ రాజకీయాల గురించి మాట్లాడనని స్పష్టం చేశారు. ఆయన ప్రసంగంలో కూడా చంద్రబాబుతో తనకున్న స్నేహం గురించి, చంద్రబాబు హయాంలో జరిగిన హైదరాబాద్ అభివృద్ధి గురించి మాత్రమే రజనీ మాట్లాడారు. అంతేతప్ప.. ప్రస్తుత ఏపీ పాలిటిక్స్ గురించి ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు.
ఈ విషయాలన్నీ మోహన్ బాబుకు కూడా తెలిసినప్పటికీ ఎందుకో రజనీపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై మౌనం వహిస్తున్నారే తప్ప మాట్లాడే సాహసం చేయడం లేదు. అలా అని రజనీపై వైసీపీ వైఖరికి మోహన్ బాబు కట్టుబడి ఉన్నారనుకునే పరిస్థితి కూడా లేదు. మోహన్ బాబు వైసీపీలోనే ఉన్నప్పటికీ కొంత కాలంగా యాక్టివ్‌గా లేరు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన విద్యా సంస్థల విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై మోహన్ బాబు ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్నారు.
వైసీపీతో అంటీముట్టనట్టు ఉంటున్న మోహన్ బాబు, రజనీకాంత్ గురించి వైసీపీ అంత ఘోరంగా సిల్మ్ స్మిత మరణానికి ముడిపెట్టి మరీ దుష్ప్రచారం చేస్తుంటే.. సాటి నటుడిగానైనా ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్న సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఒక్క మోహన్ బాబు మాత్రమే కాదు టాలీవుడ్ నుంచి ఏ ఒక్కరూ రజనీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించకపోవడం కొసమెరుపు. ఇది.. ‘టీడీపీ, వైసీపీ మధ్య జరుగుతున్న రోజువారీ రాజకీయం.. మనకెందుకొచ్చిన గొడవలే’ అనే వైఖరిలో టాలీవుడ్ ఉందని పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
‘‘రజనీకాంత్ అనేవాడు చెప్పే డబ్బా కబుర్లు సినిమాల్లో చెప్పుకొంటే గతంలో నడిచాయి. ఇప్పుడు రజనీకాంత్ సినిమాలు కూడా ఎవడూ చూసేవాడు లేడు. వయసై పోయి చీకేసిన తాటికాయ ఫేస్ ఒకటి వేసుకుని వచ్చి ఇక్కడ సొల్లు కబుర్లు చెబితే వింటానికెవడూ లేడు’’ అని రజనీకాంత్‌పై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు మోహన్‌బాబుకు, టాలీవుడ్ పెద్దలకు కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక సగటు సినీ నటుడి రూపంపై, ఆకారంపై, ఆహార్యంపై ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నా టాలీవుడ్ నుంచి ఒక్కరూ స్పందించకపోవడం సిగ్గుచేటని రజనీకాంత్ అభిమానులు తెలుగు సినీ పరిశ్రమపై మండిపడుతున్నారు.
రజనీకాంత్ సినిమాలను ఆడించుకుని సొమ్ము చేసుకునేందుకు ముందుండే టాలీవుడ్ ఆయనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి మాత్రం వెనకడుగు వేయడం ఏంటని తలైవా అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘రజనీకాంత్ నాకు అంత క్లోజ్, ఇంత క్లోజ్’ అని చెప్పుకునే సదరు టాలీవుడ్ సీనియర్ నటుడు తెర వెనుకే ఎందుకు ఉండిపోతున్నారని నిలదీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు తమిళనాడు జిల్లాలైన తిరువళ్లూరు, వేలూరు, కాంచీపురం తదితర జిల్లాలకు చెందిన అభిమానులు వైసీపీ తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ‘చంద్రబాబును రజనీ పొడిగితే వీళ్లకెందుకంత బాధ’ అంటూ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఏదేమైనా.. వైసీపీ దుష్ప్రచారం మూలాన ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం రజనీకాంత్ హాట్ టాపిక్ అయ్యారని చెప్పడంలో సందేహం లేదు.