Vijayasai Reddy: గతం మర్చిపోయిన విజయసాయిరెడ్డి.. తాజా ట్వీటే సాక్ష్యం..!
ABN , First Publish Date - 2023-01-21T20:09:38+05:30 IST
వైసీపీలో విజయసాయిరెడ్డి స్థానం ఏంటో తెలుగు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఢిల్లీలో జగన్‌కు సంబంధించిన వ్యవహారాలన్నీ చక్కబెడుతూ సోషల్ మీడియాలో..
వైసీపీలో (YCP) విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) స్థానం ఏంటో తెలుగు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఢిల్లీలో జగన్‌కు (Jagan) సంబంధించిన వ్యవహారాలన్నీ చక్కబెడుతూ సోషల్ మీడియాలో ప్రత్యర్థులపై దిగజారుడు పోస్ట్‌లు పెడుతుండటంలో ఈయనకు ఈయనే సాటి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ ప్రభుత్వం ఏం చేసినా వక్రీకరించడమే పనిగా పెట్టుకున్న విజయసాయి.. కియా కంపెనీపై (Kia Company) కూడా అప్పట్లో విషం వెళ్లగక్కారు. టీడీపీ ప్రభుత్వం (TDP Govt) ఏపీకి కార్ల కంపెనీని తీసుకొచ్చిందన్న ఒకేఒక్క కారణంతో.. ట్విట్టర్ సాక్షిగా అక్కసుతో ట్వీట్లు పెట్టారు. కియా కంపెనీపై బురద చల్లే ప్రయత్నం కూడా చేశారు. అలాంటి విజయసాయి తాజాగా చేసిన ఒక ట్వీట్ చూసి తెలుగు రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్న పరిస్థితి. అంత నవ్వుల పాలయ్యే విధంగా విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఏంటంటే..
విజయసాయిరెడ్డి తాజా ట్వీట్ ఏంటంటే..
ఆంధ్రప్రదేశ్‌లో తయారైన కియా కారెన్స్ (Kia Carens) ‘ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2023’ అవార్డ్ గెలుచుకోవడం గర్వ కారణం. అనంతపురంలో ఉన్న కియా పరిశ్రమ 2019లో 57,719 కార్లను తయారుచేస్తే, ఈ ఉత్పాదకత 2021 నాటికి 2.27 లక్షల కార్లకు పెరిగిందని చెప్పేందుకు గర్వపడుతున్నాం. ఏపీలో తయారవుతున్న కియా కార్లు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి.
ఇదే విజయసాయిరెడ్డి కియా గురించి మార్చి 11, 2019న చేసిన ట్వీట్ ఏంటంటే..
కార్లు అమ్ముడు పోని కారణంగా కియా మోటార్స్ చైనాలోని అతి పెద్ద ప్లాంటును మూసేసింది. మరి అనంతపూర్లో ఏర్పటవుతున్న ప్లాంట్ సంగతేమిటో? కమిషన్ల కక్కుర్తితో కియా మోటార్స్‌కు చంద్రబాబు రెండు వేల కోట్ల రాయితీలిచ్చాడు. కంపెనీ ఉద్యోగుల్లో స్థానికులు వంద మందికి మించి లేరు.
అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ కియా మోటార్స్‌ను ఏపీకి తీసుకొచ్చిందన్న అసూయతో దుష్ప్రచారం చేసి.. ఇప్పుడు అనంతపురంలోని కియా పరిశ్రమను విజయసాయిరెడ్డి ఆకాశానికెత్తడం సిగ్గుచేటని ప్రజలు వాపోతున్నారు. గతంలో కియాపై వైసీపీ చేయని దుష్ప్రచారం అంటూ లేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే కాదు.. జగన్ అధికారంలోకి వచ్చాక కూడా కియా పరిశ్రమపై విష ప్రచారాన్ని వైసీపీ మానుకోలేదు. చంద్రబాబు కృషితో అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ ఏర్పాటయింది. అతి తక్కువ సమయంలోనే కార్లను కూడా మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కియాపై వైసీపీ తీవ్ర విమర్శలు చేసినా.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పడం వల్లే అనంతపురం జిల్లాకు కియా ప్రాజెక్ట్ వచ్చింది..’ అని అసెంబ్లీ సాక్షిగా చెప్పుకుంది.
కియా కార్ల ఆవిష్కరణ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రవర్తన తీవ్ర వివాదాస్పదమయిన సంగతి తెలిసిందే. కియా ప్రతినిధులపై వేదికపైనే గోరంట్ల మాధవ్ చిందులు వేయడం, వేలు చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అధికార పార్టీ నేతల ప్రవర్తన ఇలా ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు ఇంకేమొస్తాయంటూ అప్పట్లో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయినప్పటికీ ఆ ఘటనకు సంబంధించి గోరంట్ల మాధవ్‌పై వైసీపీ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇలా అవకాశం దొరికినప్పుడల్లా.. వైసీపీ నేతలు కియా పరిశ్రమపై విషం కక్కుతూనే ఉన్నారు. అలాంటి వైసీపీ ఇవాళ కియా కంపెనీకి అవార్డు రాగానే తామేదో ఆ సంస్థను తీసుకొచ్చేందుకు ఊడబొడిచినట్టుగా ట్వీట్లు పెడుతుండటం చూసి నెటిజన్లు జగన్‌ను చూసి జాలి పడుతున్న పరిస్థితి.