YS Sharmila: సునీత భర్త ఆస్తి కోసమే ఇదంతా చేశారనుకుంటే చంపాల్సింది వివేకాను కాదు.. షర్మిల కీలక వ్యాఖ్యలు..!
ABN , First Publish Date - 2023-04-26T17:55:15+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన వైఎస్ వివేకా హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకున్న తరుణంలో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పందించారు. వైఎస్ వివేకాపై..
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన వైఎస్ వివేకా హత్య కేసు (YS Viveka Murder Case) విచారణ కీలక దశకు చేరుకున్న తరుణంలో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) స్పందించారు. వైఎస్ వివేకాపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం దారుణమని ఆమె వ్యాఖ్యానించారు. తన చిన్నాన్న వివేకా ఆస్తులన్నీ సునీత పేరు మీదే ఉంచారని, అన్ని ఆస్తులు ఎప్పటి నుంచో సునీత పేరు మీదే ఉన్నాయని షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. అలాంటప్పుడు సునీత ఆస్తుల కోసమో లేకపోతే ఆస్తి ఇంకెవరికో రాసిస్తాడనో సునీత ఆలోచన చేసిందనే ఆరోపణల్లో, లాజిక్‌లో అసలు అర్థమే లేదన్నారు.
ఒకవేళ.. సునీత భర్త ఆస్తి కోసమే ఇలా చేశారనుకుంటే చంపాల్సింది వివేకానందరెడ్డిని కాదని.. సునీతను చంపాలని (ఆస్తి సునీత పేరు మీద ఉందనే సందర్భంలో షర్మిల ఈ వ్యాఖ్య చేశారు) షర్మిల అన్నారు. ఆస్తి కోసం వివేకాను సునీత, ఆమె భర్త ఏదో చేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదని షర్మిల కుండబద్ధలు కొట్టారు. వివేకా ప్రజల మనిషని.. అలాంటి వ్యక్తి గురించి కొన్ని మీడియా హౌస్‌లు పనిగట్టుకుని వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ కథనాలు ప్రసారం చేస్తున్నాయని (సాక్షి ఛానల్‌పై పరోక్ష వ్యాఖ్యలు), ఆ మీడియా హౌస్‌లకు ఆ అర్హతే లేదని షర్మిల వ్యాఖ్యానించారు. అసలు లేని వ్యక్తి మీద, తనకు తాను సంజాయిషీ ఇచ్చుకోలేని వ్యక్తి మీద కొన్ని మీడియా హౌస్‌లు ఆయన క్యారెక్టర్‌ను కించపరిచేలా వార్తలు, కథనాలు ప్రసారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల స్పష్టం చేశారు.
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం అయినప్పటి నుంచి వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి, జగన్‌కు బాకా ఊదే నీలి మీడియా పనిగట్టుకుని మరీ వివేకా క్యారెక్టర్‌ను తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. వైఎస్ వివేకా రెండో పెళ్లిని హైలైట్ చేస్తూ సజ్జల వంటి వాళ్లు మాట్లాడటం, సొంత మీడియాలో కథనాలు ప్రసారం చేయడం, నిందితుల కుటుంబంలోని మహిళలతో కూడా వివేకాకు వివాహేతర సంబంధాలున్నాయని అవినాశ్ కోర్టుకు చెప్పిన విషయం విదితమే. ఒక్కమాటలో చెప్పాలంటే.. వైఎస్ వివేకానందరెడ్డిపై ఒక స్త్రీ లోలుడిగా ముద్ర వేసేందుకు వైసీపీ చేయని పని లేదు. వైసీపీ సొంత మీడియాలో, అధికారిక సోషల్ మీడియాలో వివేకానందరెడ్డి వ్యక్తిత్వ హననానికి వైసీపీ పాల్పడింది. అవినాశ్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి కోర్టులో వాదనలు వినిపించిన సందర్భంలో కూడా ఇదే తరహాలో వ్యాఖ్యానించారు. వివేకా హత్య వెనుక కుటుంబ కలహాలు, రాజకీయ కారణాలు, ఆర్థిక లావాదేవీలు, మహిళలతో సంబంధాలు వంటి అనేక కారణాలు ఉన్నాయని చెప్పి న్యాయస్థానం దృష్టిలో కూడా వివేకా క్యారెక్టర్‌కు తూట్లు పొడిచే ప్రయత్నం చేశారు.
2019 మార్చి 15న వివేకా హత్యకు గురయ్యారు. మొదట గుండెపోటుతో మరణించాడని ప్రచారం జరిగినా మధ్యాహ్నానికి హత్య కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో మొత్తం మూడు సిట్‌లు కలిపి సుమారు 1,300 మంది సాక్షులను, అనుమానితులను విచారించాయి. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణ చేపట్టింది. సీబీఐ సుమారు 250 మంది సాక్షులు, అనుమానితులను ప్రశ్నించింది. సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన వారిలో అనేక మంది అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిపై సందేహం వ్యక్తం చేశారు. విచారణలో వందలాది మంది ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పుడు సీబీఐ అధికారులు వారిద్దరినీ ప్రశ్నిస్తున్నారు. సుదీర్ఘంగా కొనసాగిన కేసు దర్యాప్తులో ఇప్పటి వరకు లభించని సమాచారం, వీరికి మాత్రమే తెలిసిన మరికొన్ని విషయాలపై సీబీఐ అధికారులు వివరాలు రాబడుతున్నట్లు తెలిసింది.