బామ్మా.. నీ ధైర్యానికి సలామ్.. 8 ఏళ్ల మనవడి ప్రాణాలను కాపాడేందుకు తోడేలుతోనే పోరాడింది..!
ABN , First Publish Date - 2023-02-24T21:37:03+05:30 IST
అటవీ ప్రాంత సమీప గ్రామాల్లోకి తరచూ క్రూర మృగాలు చొరబడడం, దాడులు చేయడం చూస్తుంటాం. దీంతో అటవీ ప్రాంత ప్రజలు నిత్యం భయం భయంగా కాలం వెళ్లదీస్తుంటారు. జంతువుల దాడుల్లో కొన్ని సార్లు ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. ఇటీవల ..
అటవీ ప్రాంత సమీప గ్రామాల్లోకి తరచూ క్రూర మృగాలు చొరబడడం, దాడులు చేయడం చూస్తుంటాం. దీంతో అటవీ ప్రాంత ప్రజలు నిత్యం భయం భయంగా కాలం వెళ్లదీస్తుంటారు. జంతువుల దాడుల్లో కొన్ని సార్లు ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్లో తాజాగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల మనువడిని కాపాడేందుకు ఓ బామ్మ.. ఏకంగా తోడేలుతోనే పోరాడింది. ఈ ఘటనలో చివరకు ఏమైందంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఆగ్రా పరిధి ఫతేబాద్లోని ఛత్రియాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పప్పు భార్య అయిన 65ఏళ్ల కమలాదేవి.. గురువారం గోధుమ పంటకు నీరు పెట్టేందుకు వెళ్లింది. ఆ సమయంలో ఆమె ఎనిమిదేళ్ల మనువడు రిషి.. నేనూ వస్తానంటూ వెంటపడ్డాడు. దీంతో ఇష్టం లేకున్నా వృద్ధురాలు (old woman) తన మనువన్ని తీసుకుని పొలానికి వెళ్లింది. కమలాదేవి పొలానికి నీరు పెడుతున్న సమయంలో బాలుడు (boy) కొంచెం దూరంలో ఆడుకుంటూ ఉన్నాడు. అదే సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. పిల్లాడిపై ఓ పెద్ద తోడేలు (Wolf attack) దాడి చేసింది.
దీంతో బాలుడు ఒక్కసారిగా గట్టిగా కేకలు పెట్టాడు. అరుపులు విన్న కమలాదేవి.. కంగారుగా పరుగెత్తుకుంటూ వెళ్లింది. తోడేలు దాడి చేయడం చూసి షాక్ అయింది. ఎలాగైనా తన మనువన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో.. చేతిలో ఆయుధం లేకున్నా తోడేలుపై దాడికి (Old woman fight with wolf) దిగింది. ఈ క్రమంలో బాలుడితో పాటూ వృద్ధురాలికి కూడా గాయాలయ్యాయి. అయినా పట్టు వదలకుండా తోడేలుతో పోరాడింది. ఇంతలో పక్కన పొలాల్లోని వారు గమనించి, కేకలు పెడుతూ పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. దీంతో తోడేలు చివరకు వారిని వదిలిపెట్టి పారిపోయింది.
వీరిపై దాడి చేయకముందు సమీప ప్రాంతంలోని పొలాల్లో మరో మహిళపై కూడా దాడి చేసింది. ఈ దాడుల్లో గాయపడిన ముగ్గురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గ్రామ పరిసరాల్లో ఇటీవల అడవి జంతువుల దాడులు ఎక్కువ అవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాగా, తోడోలు దాడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు (Viral photos and videos).. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.